Begin typing your search above and press return to search.

'మహారాష్ట్ర' పర్యటన తర్వాత కేసీఆర్ మాటలో మార్పు?

By:  Tupaki Desk   |   24 Feb 2022 7:30 AM GMT
మహారాష్ట్ర పర్యటన తర్వాత కేసీఆర్ మాటలో మార్పు?
X
కేంద్రంలోని మోడీ సర్కారు మీద గురి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంతలా విరుచుకుపడుతున్నది తెలిసిందే. ప్రధాని మోడీని ఉద్దేశించి విమర్శించే విషయంలో దేశంలోని ఏ పార్టీ అధినేత తొందరపాటును ప్రదర్శించటం కనిపించదు.

తమ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్నా.. ఆచితూచి మాట్లాడటమే తప్పించి.. మిగిలిన రాజకీయ అధినేతల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలకుకాస్తంత దూరంగా ఉంటారు. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర సీఎం మాత్రం మోడీ మీద ఘాటుగా రియాక్టు కావటమే కాదు సంచలన వ్యాఖ్యలు చేయటం చూశాం.

జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్లాన్ చేస్తున్న ఆయన.. ఇప్పటికే ఫోన్ లో పలువురు సీఎంలతో మాట్లాడిన కేసీఆర్.. మొన్న ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లటం తెలిసిందే. ఆ సందర్భంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ కు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ యాక్టివ్ గా పాల్గొన్న తీరు అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.

కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ ఇంత సన్నిహితుడా? అన్న భావన కలిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహారాష్ట్ర పర్యటన తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చిన సీఎం కేసీఆర్ లో ఒక మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. మహారాష్ట్ర పర్యటనకు ముందు.. ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన ఘాటు విమర్శలు చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం కేంద్ర సర్కారు పేరు మీదనే తప్పించి.. మోడీ మీద విరుచుకుపడటం తగ్గించిన తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది

తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలు మొత్తం దేశాన్ని తాము నడిపే తీరును చెప్పేందుకే ప్రాధాన్యం ఇవ్వటం.. అందుకోసం తాను చేసే త్యాగాలను గొప్పగా చెప్పుకోవటమే తప్పించి.. మోడీ మీదా.. మోడీ సర్కారు వైఫల్యాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టటం కనిపిస్తోంది. తాను చేసిన తెలంగాణ పోరాటం.. అందులో సాధించిన విజయాన్ని చెప్పుకోవటం.. ఇప్పుడు తాను దేశంలో కొత్త తరహా ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలిపే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.

ఇదంతా చూస్తే..వ్యక్తిగత నిందలు వేసే తీరును వదిలేసి.. విషయాల్ని విషయాలుగా ప్రస్తావిస్తున్న కొత్త తీరు కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్ర పర్యటన సందర్భంగా అక్కడి నేతల మధ్య సాగిన చర్చలతో.. వచ్చిన సూచనలతో తన తీరును కాస్తంత మార్చుకున్నారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా మల్లన్నసాగర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. మోడీని ప్రత్యేకంగా టార్గెట్ చేయని వైనం కనిపిస్తుంది.