Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి బ్రదర్స్ ను బీజేపీలో అడ్డుకుంటున్నదెవరు..?

By:  Tupaki Desk   |   22 March 2022 10:30 AM GMT
కోమటిరెడ్డి బ్రదర్స్ ను బీజేపీలో అడ్డుకుంటున్నదెవరు..?
X
తెలంగాణ రాజకీయ నాయకుల్లో కొమరెడ్డి బ్రదర్స్ గురించి తెలియని వారుండరు. రాష్ట్ర రాజకీయాల్లో తమదైన శైలిలో చక్రం తిప్పుతూ అన్నదమ్ములిద్దరూ అనుకున్నది సాధించుకుంటారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న వీరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ఇప్పుడు తాము కొనసాగుతున్న పార్టీ బాగుపడే పరిస్థితి లేదని భావించిన వీరు ఢిల్లీ పర్యటన చేస్తున్నారంటే కచ్చితంగా బీజేపీలోకి చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరుతారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు వారికి బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే గతంలోనూ ఒకరు ఎంపీగా.. మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగారు. గత కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయినప్పటి నుంచి బహిరంగంగానే ఆయనపై విమర్శలు చేశారు. అయితే ఆ తరువాత మళ్లీ కలవడంతో వివాదం సద్దుమణిగినట్లయింది. అయినా పార్టీలో ఇమడలేకపోవడంతో పక్క పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజుల నుంచి బీజేపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి జగదీశ్ రెడ్డితో వాగ్వాదం పెట్టుకున్న ఆయనకు సపోర్టుగా పార్టీ వ్యక్తులు ఎవరూ మాట్లాడలేదు. దీంతో తనకు పార్టీలో న్యాయం జరిగే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. అయితే గతంలో ఈ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డిని అడగగా ఆయన పార్టీ మారనని చెప్పారు.

తాజాగా అన్నదమ్ములిద్దరూ ఢిల్లీలో మకాం వేసి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీగా కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కేంద్రంలో ఉన్న నాయకులతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. ఇటు రాష్ట్రంలోనూ రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. దీంతో పార్టీలోకి వీరిని తీసుకుంటే వారిదే పైచేయి అవుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆలోచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెవల్లో నాయకులను కలిసేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తుండడంతో వారికి రాష్ట్ర బీజేపీ నేతలు బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ వీరిద్దరు పార్టీలో చేరితో ఢిల్లీ నాయకుల అండతో రాష్ట్రంలో చక్రం తిప్పే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలు జోరుగా వస్తున్నాయి. సాధారణంగా బీజేపీలోకి ఆర్ఎస్ఎస్ మినహా ఇతర నేతలకు ప్రాధాన్యం ఉండదు. ఈటల రాజేందర్ లాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకులు విషయంలో కాస్త మార్పు ఉంటుంది. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో జాయిన్ అయి వారి పెత్తనం చెలాయిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి..? అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏ పార్టీ నుంచి వచ్చినా జాయిన్ చేసుకుంటామని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా.. కోమటిరెడ్డి లాంటి వాళ్ల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.