Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో కొనసాగడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టత.. మరి రాజగోపాలరెడ్డి..?

By:  Tupaki Desk   |   22 March 2022 12:30 PM GMT
కాంగ్రెస్ లో కొనసాగడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టత.. మరి రాజగోపాలరెడ్డి..?
X
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత సీఎం వైఎస్ ప్రాపకంతో కాంగ్రెస్ లో ఎదిగిన ఈ అన్నదమ్ములు.. ఇప్పటికీ అదే పార్టీలో ప్రభావశీలంగా ఉన్నారు. పట్టుబట్టి టిక్కెట్లు తెచ్చుకుని తాము గెలవడమే కాక ఇంకొకరిని కూడా గెలిపించే సత్తా ఉన్నవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా.. ఎమ్మెల్సీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారంటే ఈ బ్రదర్స్ బలమేమిటో తెలిసిపోతుంది.

అయితే, కొన్నేళ్లుగా వీరిద్దరూ కాంగ్రెస్ లో అసమ్మతి నేతలుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ పీఠాన్ని ఆశించారు. అది దక్కకపోవడంతో మునుపటంత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేశాక.. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ వెంకటరెడ్డి ఆగ్రహోదగ్రులయ్యారు. పాదయాత్ర చేస్తానని ప్రకటించి వెనక్కుతగ్గారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలతోనూ టచ్ లో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారమూ సాగుతోంది. ఇటీవల పార్టీ మార్పుపై కూడా కొంత స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. రాజగోపాల్‌ రెడ్డి అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని తెలిపారు.

పీసీపీ చీఫ్ రేవంత్ తో కలిసి మీడియా ముందుకు

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కడంతోనే మండిపడిన వెంకట్ రెడ్డి.. తర్వాత కొద్దిగా మెత్తబడ్డారు. ఓసారి రేవంత్ తోనూ భేటీ అయ్యారు. విభేదాలు సమసినట్లే కనిపించినా.. తర్వాత పూర్తిగా తొలగలేదని స్పష్టమైంది. అయితే, మంగళవారం ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా రేవంత్, వెంకట్ రెడ్డి కలుసుకున్నారు. మీడియా ముందుకు వచ్చారు. ఇది కొంత ప్రత్యేకమైనదే.

చనిపోతే.. మూడు రంగుల జెండా కప్పమని చెప్పా..

తన తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను కలిసినట్లు చెప్పారు. ప్రధానిని కలిస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి అభిప్రాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఒకే ఇంట్లోనే ఎన్నో గొడవలు ఉంటాయని.. అలాంటిది కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు ఉండటం సహజమన్నారు. భాజపా, తెరాసలో కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ గొడవలున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

మరి రాజగోపాలరెడ్డో?

వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డి.. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఒకే మాట అన్నట్లు ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రామలక్ష్మణులుగా మెలిగారు. ఇప్పుడు వెంకటరెడ్డి తాను కాంగ్రెస్ ను వీడనని స్పష్టత ఇచ్చారు. నోరు విప్పాల్సింది రాజగోపాల రెడ్డే. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గం వార్తల్లో నిలిచేలా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడినుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ బలోపేతానికి ఇది పనికొస్తుందని లెక్కలు వేస్తున్నారు. అదే నిజమైతే.. మునుగోడులో రాజగోపాలరెడ్డికి గట్టి సవాల్ తప్పదు. మరి ఆయనేం చేస్తారు? అన్న బాటలో నడుస్తారా? లేక మరో నిర్ణయం తీసుకుంటారా?