Begin typing your search above and press return to search.

ముద్రగడకు ఎందుకంత కోపం? సమీక్షించుకోవాల్సింది పోయి.. పావుగా మారితే ఎలా..?

By:  Tupaki Desk   |   31 March 2022 9:36 AM GMT
ముద్రగడకు ఎందుకంత కోపం? సమీక్షించుకోవాల్సింది పోయి.. పావుగా మారితే ఎలా..?
X
ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు కోపమొచ్చింది. ఓ మీడియా అధినేతను ఉద్దేశిస్తూ ఏకంగా లేఖ రాసేంత ఆగ్రహం ఆయనలో వ్యక్తమైంది. చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్లు అంటూ నానా హంగామా చేసి.. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న ముద్రగడ మళ్లీ లేఖాస్త్రం సంధించారు. ఈసారి మీడియా అధినేతను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే, ఇక్కడ ఆయన కాపు జాతి గురించి కాక.. తనను ఏకవచనంతో సంబోధించారంటూ తప్పుబట్టారు. వాస్తవానికి ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ, ముద్రగడ ఉన్నట్టుండి మీడియాపైకి వచ్చి లేఖ వదిలారు. ఇందులో అసలు అంశాన్ని వదిలేసి కొసరును పట్టుకుని.. అది కూడా తన వ్యక్తిగత ప్రతిష్ఠను ముడిపెడుతూ లేఖ రాశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ లేఖ తానే రాసినట్లు ఆయన నుంచి కానీ, ఆయన తరఫు వారు కానీ స్పష్టంగా ప్రకటించలేదు. ఓ పత్రికలో మాత్రం.. (వైరి వర్గం మీడియా అధినేతకు రాసిన లేఖ కాబట్టి) ప్రచురితమైంది. అసలు సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉండగా.. తోకలో ఈకను పట్టుకుని ముద్రగడ ప్రస్తావించడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇంతకూ ఏమైందంటే..

పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ఒకరిని ఇటీవల ఓ మీడియా అధినేత ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా కాపు లలో పెద్దగా ఎవరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోవడాన్ని ప్రస్తావించారు. పారిశ్రామిక రంగంలో కాపులు ఎదిగితే పదిమందికి ఉపాధి కల్పించవచ్చు కదా? అని అడిగారు. దీనికి ఆ ఎమ్మెల్యే కూడా హుందాగానే స్పందించారు. కారణాలను విపులంగా వివరించారు. ఇదే సమయంలో మీడియా అధినేత.. ముద్రగడ ప్రస్తావన తెస్తూ.. ఇలాంటి వారెందరో ఉండగా కాపులు ఆర్థిక శక్తులుగా ఎదగలేకపోవడం ఎందుకని అడిగారు. ఇక్కడ ముద్రగడను ఏకవచనంతో సంబోధించారు. అయితే, ఇది సాధారణ సంభాషణే కానీ.. ప్రత్యేకంగా ముద్రగడను తక్కువ చేయాలని చూడడంలో జరిగింది కాదు. దీనిని ఒక్కదానినే పట్టుకుని ముద్రగడ.. ఆ మీడియా అధినేతకు లేఖ రాశారు. గౌరవం లేకుండా మాట్లాడారంటూ నిందించారు. పనిలో పనిగా ఆ మీడియా అధినేత ప్రస్థానాన్ని ప్రస్తావించి తక్కువ చేశారు.

సమీక్ష కదా చేయాల్సింది..?

వాస్తవానికి ఆ మీడియా అధినేత ఇంటర్వ్యూ చాలా హుందాగా సాగింది. ఎమ్మెల్యే సైతం మంచి పేరున్నవారు కావడంతో స్పందన బాగుంది. ఎమ్మెల్యే కూడా తన సమాధానాలను చాలా స్పష్టంగా చెప్పారు. ముఖాముఖి సందర్భంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో కాపులు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన చాలా అంశాలను అడిగారు. ఆఖరికి రిజర్వేషన్ అంశాన్ని కూడా అడిగారు. నిశితంగా పరిశీలిస్తే ఇది ఇద్దరి మధ్య జరిగిన సంభాషణే అయినా.. కొన్ని ప్రగతిదాయక పాయింట్లున్నాయి. వాటన్నిటినీ వదిలేసి.. ఇంటర్వ్యూలోని ఓ సాధారణ పాయింట్ ను పట్టుకుని లేఖ రాయడం.. అందులోనూ మీడియా అధినేత ప్రస్థానం గురించి ప్రస్తావించడం, ఆయనను తక్కువ చేసి చూపుతూ రాయడం గమనార్హం.

అదే కదా? ఆయన అడిగింది..?

కాపులు ఆర్థిక శక్తులుగా ఎందుకు మారలేకపోతున్నారు? అని మీడియా అధినేత అడిగారు. దీనికి వేర్వేరు కారణాలుండొచ్చు. అందరికీ డబ్బు సంపాదన ఆలోచన ఉండకపోవచ్చు. కానీ, రాజ్యాధికారం కోసం పోటీ పడే క్రమంలో కాపులకు ఆర్థిక శక్తి అవసరమే. ఇక్కడ సహజంగా చూస్తే.. అవకాశాలను అందిపుచ్చకుని ఆర్థికంగా ఎదగడం అనే పాయింట్ ను ఆ మీడియా అధినేత చేతల్లో చూపారు. చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చి మీడియాలో ఓ ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. నిజానికి ఆయన ప్రస్థానమూ ఓ పాఠమే. అది వదిలేసి తనను ఏకవచనంతో సంబోధించారంటూ ముద్రగడ భావించడం గమనార్హం.

లేఖ రాసింది ఆయనేనా? వేరొకరికి ఆయుధం అవుతారా?

ఆ మీడియా అధినేత వైరి వర్గం మీడియాలో.. ముద్రగడ లేఖ గురించి వార్త వచ్చింది. వాస్తవానికి లేఖ సంగతి బయటకు వచ్చి ఒక రోజు గడిచింది. దీనిని ముద్రగడే రాశారా? లేఖ వేరేకొరు ఆయన పేరిట రాశారా.? అనే సంశయం ఉండేది. కానీ, ముద్రగడ నుంచి తాను రాయలేదనే ఖండన లేకపోవడం, అదే లేఖ గురించి ఓ పత్రికలో కథనం రావడంతో విషయం వాస్తవమని స్పష్టమవుతోంది. వాస్తవానికి కాపుల రిజర్వేషన్ అంశంపై ముద్రగడ ప్రస్తుత వైఖరి, ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించకపోవడం గమనిస్తే ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏమిటనే ఆసక్తి నెలకొంది. అలాంటిది ఉన్నట్లుండి.. మీడియా అధినేతకు లేఖతో వెలుగులోకి వచ్చారు. ఆయన ఉద్దేశం మంచిదే అయినా.. మీడియా, రాజకీయ వర్గ పోరులో ముద్రగడ మరోసారి పావుగా మారుతున్నారా? అనే అనుమానం వస్తోంది. ముద్రగడను ముందరపెట్టి.. కాపుల ఓట్లను పట్టే ఎత్తుగడ వ్యూహం ఎప్పటినుంచో ఉంది. మరోసారి అది జరగకుండా ఉండాలని కోరుకుందాం.