Begin typing your search above and press return to search.

న్యూయార్కు లో కలకలం.. కాల్పుల ఉదంతంతో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   13 April 2022 3:20 AM GMT
న్యూయార్కు లో కలకలం.. కాల్పుల ఉదంతంతో ఏం జరిగింది?
X
సంచలన వార్తలంటేనే చాలు.. విరుచుకుపడే భారత మీడియా అతి తాజాగా మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు నవ్వులపాలైంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా వ్యవహరించే ధోరణి ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంగళవారం సాయంత్రం (భారతకాలమానం ప్రకారం) బ్లూకిన్ దగ్గరి సబ్ వేలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఉదంతంలో పదమూడు మంది వరకు గాయపడ్డారు. నిర్మాణ రంగ కార్మికుడి మాదిరి అతడి దుస్తులు ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

ఈ ఉదంతాన్ని భారత్ కు చెందిన పలు మీడియా సంస్థలు ఉగ్రదాడిగా పేర్కొనటం.. దానికి సంబంధించిన వార్తలు.. ఫోటోలతో సంచలన వార్తగా ప్రసారం చేశాయి. ఇక.. వెబ్ మీడియా అయితే..వెనుకా ముందు చూసుకోకుండా తనకు తోచినట్లుగా వార్తలు వండేశారని చెప్పాలి. ఎందుకంటే.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థలు.. ఈ ఉదంతంపై దూకుడు ప్రదర్శించే కన్నా.. వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేస్తే.. భారత్ లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం తమకు చిత్తం వచ్చినట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది.

సబ్ వేలో చోటుచేసుకున్న కాల్పుల వేళ.. ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగ కమ్ముకోవటం.. అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. అయితే.. ఈ విషయాల్ని చెప్పాల్సిన మీడియా.. కాల్పుల ఉదంతంలో ఐదుగురు మరణించారని.. కాదు తొమ్మిది మంది వరకు మరణించినట్లుగా మరికొన్ని మీడియా సంస్థలు తమకు తోచిన విధంగా వార్తలను ఇచ్చేయటం చూస్తే షాక్ తినాల్సిందే.

ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నట్లుగా అమెరికన్ మీడియా చెబుతుంటే.. అందుకు భిన్నంగా మన మీడియా సంస్థలు మాత్రం ఏకంగా ఉగ్రదాడిగా పేర్కొంటూ.. పది వరకు మరణాలు చోటు చేసుకున్నాయని.. పలువురు గాయపడినట్లుగా వార్తల్నిఇవ్వటం గమనార్హం. న్యూయార్క్ సబ్ వేలో చోటు చేసుకున్న కాల్పుల ఉదంతాన్ని భారత్ కు చెందిన ఏ మీడియా సంస్థ కూడా ప్రత్యక్షంగా కవర్ చేసింది లేదు. కానీ.. అంతర్జాతీయ మీడియా సంస్థల సమాచారాన్ని అందిపుచ్చుకొని.. సంచలనాలకు ట్రై చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీడియా సంస్థలకు అమెరికాలో నెట్ వర్కు ఉండాలని చెప్పటం లేదు కానీ.. ప్రజల భావోద్వేగాల్ని ప్రభావితం చేసే ఈ తరహా వార్తల్ని అందించే వేళలో.. మీడియా సంస్థలు తాము తీసుకునే సమాచారాన్ని విశ్వసనీయత ఉన్న సోర్సుల ద్వారా తీసుకుంటే బాగుండేది. అంతేకాదు.. సంచలనాల కోసం వార్తలు వండేసే వారి వార్తల్ని ప్రామాణికంగా తీసుకొని.. వార్తలు రాసేస్తే.. ఈ తరహా నవ్వులాటకు కేరాఫ్ అడ్రస్ గా మారతామని చెప్పక తప్పదు.