Begin typing your search above and press return to search.

ఐపీఎస్ అధికారి ఆక‌స్మిక బ‌దిలీ.. అంతా రేవంత్ పుణ్య‌మే..!

By:  Tupaki Desk   |   24 March 2022 11:30 AM GMT
ఐపీఎస్ అధికారి ఆక‌స్మిక బ‌దిలీ.. అంతా రేవంత్ పుణ్య‌మే..!
X
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ పుణ్య‌మా అని ఒక ఐపీఎస్ అధికారి ఆక‌స్మికంగా బ‌దిలీ అయ్యారు. రేవంతుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మే ఆయ‌న చేసిన పాపం. ముఖ్య‌మైన హోదాల్లో ఉన్న వారు స‌మ‌యోచితంగా మాట్లాడాలి. ఎదుటి వారి మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. సంద‌ర్భం ఏదైనా ఆచితూచి అడుగేయాలి. ఇది కేసీఆర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఆయ‌న‌తో పోల్చుకుంటే ఈ విష‌యంలో రేవంత్ మ‌రింత రాటుదేలాల్సి ఉంది. రేవంత్ వ్యాఖ్య‌ల ఫ‌లితం వ‌ల్ల ఉత్త పుణ్యానికి ఒక ఐపీఎస్ అధికారి బ‌దిలీ అయ్యారు.

ఇటీవ‌ల తెలంగాణలో ఉన్న బిహార్ అధికారుల‌పై రేవంత్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని బిహార్ ముఠా ఆక్ర‌మిస్తోంద‌ని.. ఆ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. ఇక్క‌డి అధికారుల‌నేమో అప్రాధాన్య పోస్టుల‌కు పంపుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్య హోదాల్లో ఉన్న‌ సీఎస్ సోమేశ్ కుమార్‌, డీజీపీ అంజ‌నీకుమార్‌, మునిసిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్‌, సందీప్ కుమార్ సుల్తానియా త‌దిత‌రుల‌ది బిహార్ రాష్ట్ర‌మ‌ని ఆరోపించారు. అలాగే రాజ‌కీయ స‌ల‌హాదారుగా కొత్త‌గా ఆ రాష్ట్రానికే చెందిన పీకేను నియ‌మించుకున్నార‌ని అన్నారు. సీఎం కేసీఆర్ పూర్వీకుల‌ది కూడా బిహారేన‌ని తెలిపారు.

రేవంత్ వ్యాఖ్య‌ల‌పై అప్ప‌ట్లో తీవ్ర దుమారం చెల‌రేగింది. ఇంటా బ‌య‌టా అంద‌రూ రేవంతును విమ‌ర్శించారు. ముఖ్యంగా తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం రేవంత్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగం ప్ర‌కార‌మే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు విధులు నిర్వ‌ర్తిస్తార‌ని.. రేవంత్ వ్యాఖ్య‌లు పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేలా ఉన్నాయ‌ని ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తాజాగా ఈ అంశంపై మ‌రొక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఐపీఎస్ అధికారుల సంఘం వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు ప‌డుతూ.. రేవంతుకు మ‌ద్ద‌తు తెలుపుతూ ఒక ఐపీఎస్ అధికారి తాజాగా పోస్టు పెట్టారు. ఈ విష‌యంలో ఇత‌ర అధికారుల‌ను ప్ర‌శ్నిస్తూ ఐపీఎస్ ల వాట్సాప్ గ్రూపులో పోస్టులు చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌, అర్వింద్ త‌దిత‌రులు పోలీసు ఉన్న‌తాధికారుల‌పై గ‌తంలో ఇంత‌క‌న్నా ఘోర‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని.. అప్పుడు లేనిది ఇపుడు బిహార్ ముఠా అన‌గానే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి ఖండించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు. ఈ పోస్టు పోలీసు శాఖ మొత్తం వైర‌ల్ గా మారి అంత‌టా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

దీంతో ఉన్న‌తాధికారులు క్ర‌మ శిక్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. రేవంతుకు అనుకూలంగా పోస్టులు పెట్టిన ఆ ఐపీఎస్ అధికారిని బ‌దిలీ చేశారు. నిబ‌ద్ధ‌త గ‌ల అధికారిగా పేరున్న ఆయ‌న‌కు ఎలాంటి పోస్టింగు ఇవ్వ‌కుండా డీజీపీ కార్యాల‌యానికి అటాచ్ చేశారు. ఆ ఐపీస్ అధికారి బ‌దిలీ పోలీసు వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. రేవంత్ వ్యాఖ్య‌లు పోలీసు శాఖ‌లో చిచ్చు రేపి ఒక‌ సిన్సియ‌ర్ అధికారి బ‌దిలీకి కార‌ణం అయ్యాయ‌ని అంత‌టా ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.