Begin typing your search above and press return to search.

రష్యా జనరల్స్ ను వేటాడుతున్న ఉక్రెయిన్

By:  Tupaki Desk   |   21 March 2022 9:34 AM GMT
రష్యా జనరల్స్ ను వేటాడుతున్న ఉక్రెయిన్
X
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా విచిత్రమైన పరిస్ధితులు ఎదుర్కొంటోంది. మామూలుగా యుద్ధాల సమయంలో ఫీల్డ్ లో పోరాటాలు చేసే సైనికులు మరణిస్తుంటారు. అలాగే శతృదేశాల దెబ్బకు వైమానిక దళాలు కూడా నేలకొరుగుతుంటారు. అంతేకానీ జనరల్ స్ధాయి ఉన్నతాధికారులు మరణించటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏ దేశం ఎంతగా నష్టపోయినా జనరల్ స్థాయి అధికారి మరణించారంటే అది చాలా తీవ్రమైన విషయం పరిగణించాల్సిందే.

అలాంటి నెలరోజుల ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చెందిన వివిధ విభాగాల్లోని ఏడుగురు సైనిక జనరల్స్ మరణించటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరణించిన వారిలో జనరల్స్ మాత్రమే కాదు ఇద్దరు మేజర్ జనరల్స్ కూడా ఉండటం ప్రపంచదేశాలను ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణాలు ఏమిటంటే రష్యన్ దళాలు ఉపయోగిస్తున్న కమ్యూనికేషన్ వ్యవస్ధ చాలా బలహీనంగా ఉండటమే కారణమట. దీన్ని అడ్డంపెట్టుకుని ఉక్రెయిన్ సైన్యం రష్యాన్ జనరల్స్ స్ధాయి ఉన్నతాధికారులను వేటాడుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం అందించింది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే రష్యాన్ సైన్యం అత్యంత బలహీనంగా ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థను వాడుతున్న విషయం ఉక్రెయిన్ కు తెలిసింది. అందుకనే ఆ వ్యవస్ధను ఇంటర్సెప్ట్ చేసే అత్యాధునిక వ్యవస్ధను ఉక్రెయిన్ ఉపయోగిస్తోందట. దీనివల్ల రష్యా జనరల్ స్థాయి ఉన్నతాధికారులు ఏ ప్రాంతంలో ఉన్నారు ? సరిగ్గా ఎక్కడున్నారనే విషయాన్ని ఉక్రెయిన్ తెలుసుకోగలుగుతోంది. దీంతో కేవలం మేజర్ జనరల్, జనరల్ స్థాయి ఉన్నతాధికారులను చంపటానికి ఉక్రెయిన్ ప్రత్యేకంగా ఒక టీమునే ఏర్పాటుచేసింది.

దీని ప్రకారం సదరు ప్రత్యేక టీము రష్యన్ కమ్యూనికేషన్ వ్యవస్థలోకి జొరబడుతోంది. వాళ్ళ మాటలన్నీ వింటు జనరల్, మేజర్ జనరల్ స్ధాయి ఉన్నతాధికారులు ఎక్కడున్నారో తెలుసుకుని వారిపై దాడులు చేసి చంపేస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్ కు అంత సీన్ లేదని అందరికీ తెలుసు. అమెరికా సైన్యమే రష్యన్ కమ్యూనికేషన్ వ్యవస్ధలోకి జొరబడి జనరల్, మేజర్ జనరల్ స్ధాయి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుని ఉక్రెయిన్ ద్వారానే చంపిస్తున్నదనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా రష్యా మాత్రం యుద్ధంలో భారీ మూల్యమే చెల్లించుకుంటోంది.