Begin typing your search above and press return to search.

పుతిన్ కు క్యాన్సరా ?

By:  Tupaki Desk   |   2 April 2022 8:40 AM GMT
పుతిన్ కు క్యాన్సరా ?
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారా ? అవుననే చెబుతోంది మీడియా ప్రాజెక్టు అనే సంస్థ. ఈ సంస్థ పుతిన్ ఆరోగ్యంపై పరిశోధనాత్మక కథనాన్ని అందించింది. ఆ కథనం ప్రకారం పుతిన్ తన అనారోగ్యాన్ని జనాలకు తెలియకుండా దాచి పెడుతున్నట్లు చెప్పింది. తన అనారోగ్యంపై జనాల దృష్టిని మళ్లించేందుకు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగారంటు ఆరోపించింది. ఈ విషయంలో మీడియా ఆరోపణలు నమ్మేట్లుగా లేదు.

ఎందుకంటే తన అనారోగ్యాన్ని దాచిపెట్టాలంటే ఇంకేదో విధంగా చేస్తారు కానీ ఏకంగా పొరుగు దేశంపై యుద్ధానికి దిగుతారా ? సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే క్యాన్సర్ కు మందులు వాడుతున్న కారణంగా పుతిన్ మెడ, మొహం వాచిందని కూడా చెబుతోంది. పుతిన్ ఆరోగ్యాన్ని మానిటర్ చేయటానికి 24 గంటలూ డాక్టర్ల బృందం రెడీగా ఉంటుందని కూడా చెప్పింది. ఒక దేశపు అధ్యక్షుడు అందులోను అగ్రరాజ్యం రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం మానిటర్ చేయటానికి డాక్టర్ల బృందం రెడీగా ఉండటంలో వింతేముంది ?

అయితే డాక్టర్ల బృందంలో థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టుతో పాటు మరో న్యూరో సర్జన్ కూడా ఉన్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. థైరాయిడ్ సమస్య ముదిరిపోయిన కారణంగానే పుతిన్ కు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినట్లు మీడియా చెప్పింది. 2020లో పుతిన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ అధిపతి ఇవాన్ ను కలిసినట్లు చెప్పింది.

అంతేకాకుండా పుతిన్ రెగ్యులర్ గా ఒక రిసార్టులో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. మీడియా చెప్పిన రిసార్టుకు పుతిన్ రెగ్యులర్ గా వెళుతారన్నది వాస్తవమే. అలాగే కొద్దిరోజులు ఎవరికీ కనబడకుండా పుతిన్ మాయమైపోతున్నది కూడా నిజమే. ఇదంతా క్యాన్సర్ రోగానికి చికిత్స కోసమే అనేది మీడియా చెప్పేమాట. అయితే ఈ విషయాన్ని రష్యాలోని ప్రభుత్వాధికారులు కొట్టిపడేస్తున్నారు. పుతిన్ ఆరోగ్యంపై వదంతులు పుట్టించటం పాశ్చాత్య దేశాల మీడియాకు బాగా అలవాటే అంటున్నారు. మరి నిజమేమిటో దేవుడికే తెలియాలి.