Begin typing your search above and press return to search.

గర్జించే రష్యా కాదు.. దారుణ రష్యా.. రుణ రష్యా.. అంతా తలకిందులు

By:  Tupaki Desk   |   27 Jun 2022 11:30 PM GMT
గర్జించే రష్యా కాదు.. దారుణ రష్యా.. రుణ రష్యా.. అంతా తలకిందులు
X
గర్జించు రష్యా.. గాండ్రించు రష్యా.. దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా.. లే లే రష్యా.. రా రా రష్యా.. సై అంటూ రష్యా.. జై అంటూ రష్యా.. కోటి చేతులు నిన్ను కోరి రమ్మన్నాయి.. కోటి గొంతులునిన్ను కోరి రమ్మన్నాయి.. అనంత ప్రపంచం అంతటా నీవై.. నీ గొడుగు నీడలు సాగించు రష్యా.. ప్రపంచం నీకోసం పరిపక్వంగా ఉంది.. రష్యా... రష్యా.. రష్యా.. ఓ రష్యా.. మహా కవి శ్రీ శ్రీస్వప్నం ఇది.

అలాంటి రష్యా ఆర్థిక పరిస్థితి ఉక్రెయిన్ పై దురాక్రమణ తర్వాత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అంతా తలకిందులైంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కుదేలైంది. 104 ఏళ్లలో తొలిసారిగా డబ్బుల్లేక రష్యా తన విదేశీ మారకద్రవ్య సార్వభౌమ రుణాన్ని 1918 తర్వాత తొలిసారి డిఫాల్ట్ చేసింది. ఉక్రెయిన్‌ పై యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరప్ దేశాలు విదేశీ రుణదాతలకు చెల్లింపు మార్గాలను మూసివేస్తూ ఆంక్షలు విధించడంతో రష్యా ఆర్థిక దిగ్బంధనంలో చిక్కుకుంది. సరిగ్గా నెల కిందట దీనిని గ్రహించిన రష్యా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించింది.

మే 27న దాదాపు 100 మిలియన్ డాలర్ల స్నేర్డ్ ఇంటరెస్ట్ చెల్లింపులపై గ్రేస్ పీరియడ్ కోరింది. ఇప్పుడా గడువు ముగిసింది. దీంతో డిఫాల్ట్‌ అయింది. రష్యా ఆర్థికంగా, రాజకీయంగా దాదాపు ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొన్నది. మార్చి నుంచి దేశీయ యూరోబాండ్స్ ఇబ్బందికరస్థాయిలో ట్రేడ్ అయ్యాయి. సెంట్రల్ బ్యాంకు విదేశీ నిల్వలను స్తంభింపజేశారు. ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యాలోని ప్రపంచ అతిపెద్ద బ్యాంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి విభజితమయ్యాయి.

ఆర్థిక చక్రబంధం

రష్యా నుంచి ఇంధనం, సహజ వాయువు కొనబోమని యూరప్ దేశాలు.. ఆ దేశ సంపన్నులపై ఆంక్షలు.. రష్యా బ్యాంకులపై వేటు.. డాలర్లలో మాత్రమే చెల్లింపులకు ఆదేశాలు.. ఇలా ఒకటేమిటి..? రష్యా ఆర్థిక మూలాలను పశ్చిమ దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. పైకి గంభీరంగా కనిపిస్తున్నా.. అమెరికా సహా యూరోపియన్ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యాకు నష్టం వాటిల్లిన మాట వాస్తవం. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు డిఫాల్ట్ దెబ్బపడింది. రెండంకెల ద్రవ్యోల్భణం, దారుణ ఆర్థిక సంకోచం నేపథ్యంలో ఇది కూడా ఆ దేశానికి దెబ్బే. అయితే డిఫాల్ట్ పైన రష్యా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తమ వద్ద అవసరమైన నిధులు ఉన్నాయని తెలిపింది.

అయితే ఆ తర్వాత గతవారం 40 బిలియన్ డాలర్ల సార్వభౌమ రుణాన్ని రూబుళ్లలో అందిస్తామని ప్రకటించింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత విదేశీ రుణాల చెల్లింపులు చేయలేని స్థితికి రష్యా చేరింది. వాస్తవానికి రష్యా వద్ద 100 మిలియన్‌ డాలర్ల రుణ చెల్లింపులు చేసేందుకు నిధులు ఉన్నాయి. కానీ, ఆంక్షల కారణంగా అంతర్జాతీయ రుణదాతలకు చెల్లింపులు చేయలేకపోయింది. ఇప్పటికే రుణచెల్లింపులు ఆపకూడదని భావించిన క్రెమ్లిన్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బ. రష్యా మే 27వ తేదీన రుణ చెల్లింపులకు సంబంధించి 100 మిలియన్‌ డాలర్ల సొమ్మును యూరోక్లియర్‌ బ్యాంక్‌కు పంపించింది.

ఈ బ్యాంకు నుంచి ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరగాలి. కానీ, ఆ సొమ్ము యూరో క్లియర్‌ వద్దే నిలిచిపోయింది. గడువు తేదీ దాటి 30 రోజులు గడిచినా రుణదాతలకు సొమ్ము చేరలేదు. ఈ సొమ్మును నిలిపివేసినట్లు యూరోక్లియర్‌ వెల్లడించలేదు. కేవలం ఆంక్షలకు కట్టుబడి ఉన్నామని మాత్రమే పేర్కొంది. రష్యా యూరోక్లియర్‌కు సొమ్ము చెల్లించడానికి రెండురోజుల ముందు అమెరికా ట్రెజరీ శాఖ తీసుకొన్న నిర్ణయం ఈ పరిస్థితికి కారణమైంది.

ఇన్వెస్టర్లకు రష్యా నుంచి వడ్డీ చెల్లింపు సొమ్మును తీసుకొనేందుకు కూడా మినహాయింపులు ఇవ్వకూడదని నాడు ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయించింది. అమెరికా ట్రెజరీ నిర్ణయ పరిణామాలను క్రెమ్లిన్‌ అంచనావేసింది. దీంతో ఇన్వెస్టర్లకు రూబుళ్ల రూపంలో రష్యన్‌ బ్యాంక్‌ ద్వారా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. డాలర్ల రూపంలో ఉన్న కాంట్రాక్టులకు కూడా ఇదే విధానం వర్తించనుంది. ‘పెట్టుబడిదారులకు సొమ్ము చేరడంలేదు’అంటూ రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్‌ సిల్యానోవ్‌ అంగీకరించారు. విదేశీ చెల్లింపు వ్యవస్థలు సహకరించకపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు సొమ్ము స్వీకరించకుండా నిషేధం విధించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన విశ్లేషించారు. వాస్తవానికి ఇది ఏమీ రుణ ఎగవేత కాదని ఆయన పేర్కొన్నారు.

నాడు లెనిన్ శకంలో.. నేడు పుతిన్ హయాంలో..

యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) ఏర్పాటుకు ముందే.. సోవియట్ రష్యాగా ఉన్న సమయంలో వ్లాదిమిర్ లెనిల్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో.. అంటే 1918లో విదేశీ అప్పులు చెల్లించడంలో రష్యా విఫలమైంది. అది బోల్షివిక్‌ విప్లవ సమయం. నాడు ఐరోపా దేశాలు ఇచ్చిన రుణాలను చెల్లించేందుకు లెనిన్‌ నిరాకరించారు. బోరిస్‌ ఎల్సిన్‌పాలనలో రూబుల్‌ సంక్షోభం తలెత్తింది. అలా 1998లో రష్యా దేశీయ రుణ చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో దేశీయ బాండ్లకు చెల్లింపులు నిలిపివేసి విదేశీ అప్పులు చెల్లించారు. మళ్లీఇప్పుడు పుతిన్ హయాంలో.. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా విదేశీ అప్పులను చెల్లించడంలో రష్యా విఫలమైంది.