Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: రష్యా దూకుడుతో ప్రపంచానికి మూడుతోందా.. ?

By:  Tupaki Desk   |   24 Feb 2022 10:30 AM GMT
#RussiaUkrainewar: రష్యా దూకుడుతో ప్రపంచానికి మూడుతోందా.. ?
X
ఆధునిక సమాజంలో ఉన్న వేళ ఆటవిక నీతి అమలవుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. బలవంతుడు బలహీనుడి మీద దాడి చేస్తే దుష్ట మనస్తత్వం ఇంకా కొనసాగుతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఇదంతా ఎందుకు అంటే రష్యా తన అపరిమితమైన బలాన్ని ఉపయోగించి మరో దేశమైన ఉక్రెయిన్ మీద దాడులకు తెగబడడం. ప్రపంచ దేశాలను సైతం కాదని తన చిత్తం వచ్చినట్లుగా దూకుడు చేయడం.

ఉక్రెయిన్ నాటో దేశాలతో కలవాలనుకోవడం రష్యాకు నచ్చకపోవచ్చు. అలాగే ఉక్రెయిన్ పాలకుల తీరు మీద అనుమానాలు ఉండవచ్చు. తన దేశం ప్రయోజనాలు భద్రతాపరమైన వ్యవహారాలు కూడా అందులో ఉండవచ్చు. కానీ వీటన్నిటికీ యుద్ధమే పరిష్కారమని రష్యా అనుకోవడమే విచిత్రం, విడ్డూరం.

మరో వైపు ప్రపంచ దేశాలన్నీ చర్చలు అంటూంటే కూడా రష్యా పెడచెవిన పెట్టడం ప్రపంచానికి ఏ సంకేతాన్ని పంపుతోంది అన్నది ఇక్కడ చూడాలి. ఐక్య రాజ్య సమితి వినతులు, సూక్తులు కూడా గాలికి పోతున్న వేళ రష్యా తెగబడడాన్ని ఏ విధంగా చూడాలి. ఇక రష్యా ఇపుడు ఉక్రెయిన్ లో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అంటోంది.

ఆ మీదట తన ఆధీనంలో అయినా ఆ దేశాన్ని ఉంచుకోవచ్చు. లేదా ఉక్రెయిన్ ప్రజల కోరిక మేరకు అంటూ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని అక్కడ ఉంచే ప్రయత్నం చేయవచ్చు. అంతా నా ఇష్టం అన్న తరహాలో రష్యా చేస్తున్న ఈ దారుణాన్ని ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా. లేక తిరగబడుతుందా.

అలా జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం వైపుగా అడుగులు పడినట్లే. ఇప్పటికి ఎనభయ్యేళ్ల క్రితం రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ తరువాత ప్రపంచమే మారిపోయింది అని అంతా సంతోషించారు. కానీ అలా కాదు అని అనేక పరిణామాలు రుజువు చేస్తున్నాయి. మరో వైపు ఉత్తర కొరియా లాంటి చోట్ల నియంత పాలన సాగుతోంది. సౌత్ కొరియాతో దాని గొడవలు ఉండనే ఉన్నాయి. తరచూ అణు ప్రయోగాలతో ఉత్తర కొరియా భయపెడుతున్న కధ కూడా చూస్తున్నదే.

ఇంకో వైపు చూసుకుంటే చైనా తైవాన్ ని మింగేయాలని చూస్తోంది. ఇలా ప్రపంచం అంతా నియంత పోకడలతోనే ముందుకు సాగితే విశ్వ శాంతి అన్నది ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ కి మద్దతుగా నాటో దేశాలు కనుక రంగంలోకి దిగితే మూడవ ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చునని కూడా అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించే వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రష్యా దూకుడుతో ప్రపంచానికి మూడినట్లేనా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.