Begin typing your search above and press return to search.

పొరుగున ఉన్న చిట్టి దేశంలో అత్యవసర పరిస్థితి

By:  Tupaki Desk   |   2 April 2022 7:41 AM GMT
పొరుగున ఉన్న చిట్టి దేశంలో అత్యవసర పరిస్థితి
X
కరోనా మహమ్మారి కొ్ట్టిన దెబ్బ ఎంత తీవ్రంగా ఉందన్న విషయానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది శ్రీలంక. ఆ దేశంలోని రాజపక్స సర్కారు అనుసరించిన విధానాలకు కరోనామహమ్మారి తోడు కావటం.. ఆ దేశ ఆదాయ వనరులో కీలకమైన పర్యాటకం పడకేయటంతో ఆ దేశ పరిస్థితి దారుణంగా మారింది. తీవ్రమైన ఆహార సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ దేశంలో తాజాగా దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తూ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేశారు. ఆహార సంక్షోభంతో మొదలైన సమస్య అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసే వరకు వెళ్లటం.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్న నేపథ్యంలో ఆహార పదార్థాల కొరత.. విద్యుత్ కోతలతో పాటు.. ఇంధన కొరతను ఎదుర్కొంటోంది.
దీంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన.. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి వేలాది మంది దేశాధ్యక్షుడి భవనాన్నిచుట్టుముట్టారు.

అధ్యక్ష స్థానంలో ఉన్న రాజపక్స తప్పుకోవాలన్న డిమాండ్ కు మద్దతు అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలతో పాటు.. పోలీసులు పెద్ద ఎత్తున గాయపడ్డారు. దేశ రాజధాని కొలంబోలోని పలు ప్రాంతాల్లో కర్ప్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో.. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు వీలుగా.. దేశాధ్యక్షుడు తన అమ్ముల పొదిలోని ఎమర్జెన్సీ అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రజల భద్రత.. అత్యవసర సేవలు.. నిత్యావసర వస్తువుల సరఫరాలకు సంబంధించి అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అర్థరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు లంక పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించే ఆందోళన కారులపై దేశాధ్యక్షుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారుల నిరసనను ఉగ్రవాద చర్యలుగా ఆయన అభివర్ణిస్తున్నారు.

దేశాధ్యక్ష భవనం ఎదుట జరిగిన నిరసన శాంతియుతంగా మొదలైనా.. తర్వాత పోలీసులు వాటర్ కేనన్స్.. టియర్ గ్యాస్ ను ప్రయోగించటంతో పరిస్థితి అదుపు తప్పింది. నిరసకారులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయటంతో పాటు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక ప్రస్తుత గడ్డు పరిస్థితికి కారణాల్లో ముఖ్యమైనది ప్రభుత్వ అవినీతి.. బంధు ప్రీతిగా చెబుతున్నారు. రాజపక్స మంత్రివర్గంలోని అనేక కీలక శాఖలు ఆయన సోదరులు.. మేనల్లుడి వద్దే పోగుపడినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా శ్రీలంకలో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.