Begin typing your search above and press return to search.

ఆ రెండు కంపెనీల కలయిక.. బుల్ దూకుడు తిరుగులేకుండా పోయింది

By:  Tupaki Desk   |   5 April 2022 4:34 AM GMT
ఆ రెండు కంపెనీల కలయిక.. బుల్ దూకుడు తిరుగులేకుండా పోయింది
X
కొద్ది రోజుల క్రితం వరకు బేర్ విశ్వరూపం చూపిస్తూ చెలరేగిపోవటం.. సెన్సెక్స్ నేల చూపులు చూడటం తెలిసిందే. అందుకు భిన్నంగా కొద్ది రోజులుగా బుల్ పుంజుకోవటం.. అంతర్జాతీయ పరిణామాలకుభిన్నంగా దేశీయ సెన్సెక్స్ దౌడు జోరు పెరిగింది. దీంతో.. మార్కెట్లు కళకళలాడాయి. తాజాగా హెచ్ డీఎఫ్ సీ.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విలీన ప్రక్రియ ప్రకటన మార్కెట్ కు కొత్త జోష్ ను తెచ్చి పెట్టింది.

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బుల్ తో.. సెన్సెక్స్ చాలాకాలం తర్వా 60వేల కీలక పాయింట్లను దాటేసింది. సెన్సెక్స్ రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సోమవారం ఉదయం 59,764.13 పాయింట్ల వద్ద జోరు మీద ఉన్న సెన్సెక్స్ తన జోరును రోజంతా సాగించింది. ఇంట్రాడేలో 60,845 పాయింట్ల గరిష్ఠాన్ని టచ్ చేసింది. నిఫ్టీ సైతం 382.95 పాయింట్లను రోజులో నమోదు చేసింది. మొత్తంగా ఇంట్రాడేలో ఈ సూచీ 18,114.65పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.

ఈ పరిణామంతో బీఎస్ఈలో మదుపర్ల సంపదగా చెప్పే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ భారీగాపెరిగింది. రోజు వ్యవధిలో రూ.4.57 లక్షలకోట్లకు పెరగటం గమనార్హం. ఇటీవల కాలంలో ఇంత భారీగా లాభాల్ని సొంతం చేసుకున్నది ఇదేనంటున్నారు.

బూల్ దూకుడుతో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.272.46 లక్షల కోట్లకు చేరింది. దీంతో మదుపరులకు లాభాల పంట అన్నట్లుగా మారింది. ఏమైనా.. రోజులో భారీగా లాభాలు మూటకట్టుకోవటం విశేషంగా చెప్పాలి. దీనంతటికి కారణం భారత కార్పొరేట్ చరిత్రలో అతి పెద్ద విలీనమైన హెచ్ డీఎఫ్ సీ.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఒప్పందం కీలకంగా పని చేసిందని చెప్పాలి.