Begin typing your search above and press return to search.

ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ దివాళా.. 25వేల మంది ఫ్యూచర్ ఏంటి?

By:  Tupaki Desk   |   26 March 2022 3:28 AM GMT
ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ దివాళా.. 25వేల మంది ఫ్యూచర్ ఏంటి?
X
ఢిల్లీ - నోయిడా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ గా పేరు ప్రఖ్యాతులు ఉన్న అతి పెద్ద సంస్థల్లో ఒకటి సూపర్ టెక్ లిమిటెడ్ తాజాగా షాకిచ్చింది. సదరు సంస్థ దివాలా తీసినట్లుగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఢిల్లీ బెంచ్ ప్రకటించింది. ఈ సంస్థకు ప్రస్తుతం పలు నగరాల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దాదాపుగా 25 వేల మంది వినియోగదారులు ఈ కంపెనీ వెంచర్లలో ప్లాట్లు బుక్ చేశారు. తాజా పరిణామాలతో ఎదురుకానున్న పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇంతకీ ఈ కంపెనీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటన్నది చూస్తే.. దాదాపుగా రూ.1200 కోట్ల మేర రుణాలు తీసుకోగా.. ఒక్క యూనియన్ బ్యాంకు వద్దే రూ.150 కోట్ల మేర రుణాన్ని తీసుకోవటం.. వాటి చెల్లింపుల్లో విఫలం కావటం కూడా తాజా పరిణామాలకు కారణంగా చెప్పొచ్చు. తమకు చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించటంలో సూపర్ టెక్ సంస్థ ఫెయిల్ అయ్యిందంటూ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో తాజా పరిణామా చోటు చేసుకుంది.

వాస్తవ కోణంలో చూసినప్పుడు సూపర్ టెక్ సంస్థకు నోయిడా - గ్రేటర్ నొయిడా ఎక్స్ ప్రెస్ వే సమీపంలో నిర్మించిన ట్విన్ టవర్లు పెద్ద శాపంగా మారాయి. ఎందుకంటే.. నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తున్న దశలో.. ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ కోర్టులో దాఖలైన పిటీషన్ మీద విచారణ జరిపిన కోర్టు.. చర్యలు తీసుకోవాలని ఆదేశించటంతో సంస్థకు ఎదురుదెబ్బలు షురూ అయ్యాయి. అయితే.. కోర్టు తీర్పును నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ లో సవాలు చేయనున్నట్లుగా సూపర్ టెక్ చెబుతోంది.

సూపర్ టెక్ విషయానికి వస్తే ప్రస్తుతం గురుగ్రామ్.. ఘజియాబాద్.. నొయిడా.. గ్రేటర్ నొయిడాలలో చేపట్టిన పలు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తమ వద్ద ప్లాట్లు బుక్ చేసుకున్న వారి ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని.. ప్రాజెక్టు పూర్తి అయ్యాక తీర్చే బ్యాంకు బకాయిల్ని తీర్చే ఆలోచన చేస్తామని చెబుతున్నారు.

బ్యాంకుల రుణాల చెల్లింపుల కంటే కూడా ప్రాజెక్టులను పూర్తి చేయటం.. డెలివరీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కంపెనీకి చెందిన అన్ని ప్రాజెక్టులు లాభదాయకంగా ఉన్నాయని.. తమ వద్ద బుక్ చేసుకున్న వారిలో ఏ ఒక్కరికి నష్టం వాటిల్లదని సూపర్ టెక్ చెబుతోంది. తమ వద్ద ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వారికి కేటాయించిన యూనిట్లను అందిస్తామని చెబుతున్నారు. తమ ప్రాజెక్టులు అన్ని ఆర్థికంగా లాభదాయకండా ఉన్నాయని.. ఏ పార్టీకి కానీ తమకు రుణాలు ఇచ్చిన సంస్థలకు కానీ నష్టం చేసే అవకాశం లేదంటున్నారు.

తాజా ఆదేశాలతో తమ కంపెనీ కార్యకలాపాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఏడేళ్లలో 40 వేల కంటే ఎక్కువ ప్లాటను వాటి యజమానులకు అప్పజెప్పామని కంపెనీ చెబుతోంది. తమ మిషన్ కంప్లీషన్ లో భాగంగా ఈ ఏడాది డిసెంబరు నాటికి 7వేల యూనిట్లను ఇవ్వాలని.. వాటిని ఇచ్చేయనున్నట్లుగా సూపర్ టెక్ చెబుతోంది. మరి.. కంపెనీ చెబుతున్న వాదనల్లో వాస్తవం ఎంతన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదని చెప్పాలి