Begin typing your search above and press return to search.

40 ఇయర్స్ టీడీపీ - ఉత్తరాంధ్ర కథ ఇది

By:  Tupaki Desk   |   29 March 2022 4:34 AM GMT
40 ఇయర్స్ టీడీపీ - ఉత్తరాంధ్ర కథ ఇది
X
పండుగ అంటే తోర‌ణాలు క‌డ‌తారు.. గుమ్మానికి ప‌సుపు రాస్తారు..అదేవిధంగా ఇంటికి రంగులేస్తారు. కొత్త బ‌ట్ట‌లు ఇష్ట దేవ‌త‌ల ఆరాధ‌న‌ల్లో భాగంగా ధ‌రిస్తారు..ఇంకా ప్ర‌సాదాలు నైవేద్య రూప స‌మ‌ర్ప‌ణ‌లు ఉంటూనే ఉంటాయి. న‌ల‌భై ఏళ్ల పార్టీకి పండుగ ఇది. ఉత్త‌రాంధ్ర వ‌ర‌కూ ముఖ్యంగా శ్రీ‌కాకుళం వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీకి ఇంకా పెద్ద పండుగ ఇది. కానీ ఆ పండుగ ఆన‌వాళ్లు పెద్ద‌గా ఇవాళ ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు.

ఎన్టీఆర్ వినిపించిన ఆత్మ‌గౌర‌వ నినాదం త‌రువాత కాలంలో చాలా మంది వినిపించారు. ఆయ‌న స్థాయిలో కాక‌పోయినా ఓ మోస్త‌రుగా ప్రముఖ దివంగ‌త బీసీ నేత ఎర్ర‌న్నాయుడు కూడా వినిపించారు. ఆ మాటకు వ‌స్తే జిల్లా నాయ‌కుల్లో శివాజీ, సీతారాం (ఇప్ప‌టి స్పీక‌ర్) కూడా ఆత్మ గౌర‌వ నినాద ప్రాభవంతోనే ఎదిగారు. కొన్ని ప‌రిణామాల రీత్యా సీతారాం పార్టీ వీడి జ‌గ‌న్ చెంత‌కు చేరారు. అనూహ్యం అనుకునే రీతిలో ఆయ‌న స్పీక‌ర్ అయ్యారు. ఆ రోజు మంత్రి ప‌ద‌విలో ఉండి ఏ విధంగా అయితే త‌ప్పిదాలు చేశారో అంత‌కుమించిన త‌ప్పిదాలు స్పీక‌ర్ చేస్తున్నా టీడీపీ వాటిని వెలుగులోకి తీసుకుని రావ‌డం లేదు. ఆ విధంగా స్పీక‌ర్ సీతారాం సేఫ్. జ‌న‌సేన మాత్రం స్పీక‌ర్ పై తిరుగుబాటు చేసి దెబ్బలు కూడా తింటోంది.ఈ పాటి సాహ‌సం టీడీపీకి లేదు. ఇక‌పై ఉండ‌దు కూడా ! ఆ రోజు సీతారాం హ‌యాంలో మూత‌ప‌డిన ఫ్యాక్ట‌రీ మ‌ళ్లీ తెరుచుకోలేదు. ఇక‌పై ఆ ఆలోచ‌న కూడా చేయ‌కూడదు. ఏ విధంగా చూసుకున్నా అటు టీడీపీ హ‌యాంలో ఇటు వైసీపీ నేతృత్వంలో ఆమ‌దాల‌వ‌ల‌స బాగు ప‌డ‌లేదు. ఆ విధంగా వైసీపీ క‌న్నా ఎక్కువ అధికారం అనుభ‌వించిన,ఇంకా చెప్పాలంటే మంత్రి హోదాలో చ‌క్రం తిప్పిన సీతారాందే ఆ పాపం అంతా !

స్పీక‌ర్ సీతారాం క‌న్నా ఎర్ర‌న్నాయుడు బెట‌ర్. ఎందుకంటే ఆయ‌న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా ప‌నిచేశారు. ఆ విధంగా ఆయ‌న త‌న ప‌రిధిలో అది స‌హాయ మంత్రి ప‌దవి అయిన‌ప్ప‌టికీ ఉన్నంత‌లో నిధులు తెచ్చారు. ఉద్దానం దాహార్తి తీర్చేందుకు పైలెట్ ప్రాజెక్టుకు శ్రీ‌కారం దిద్దారు. అదేవిధంగా జిల్లా వెనుక‌బాటుపై పార్ల‌మెంట్ లో అనేక సార్లు మాట్లాడారు. సంబంధిత పార్టీల‌ను నిల‌దీశారు. స్వ‌శ‌క్తితో దేశ రాజ‌కీయాల్లో రాణించి సీతారాం క‌న్నా మెరుగయిన నేత అయ్యారు.

ఎర్ర‌న్న త‌రువాత గౌతు శ్యామ సుంద‌ర శివాజీ ( స్వాతంత్ర్య స‌మ‌ర యోధులు గౌతు ల‌చ్చ‌న్న కుమారుడు, మాజీ ఎమ్మెల్యే) కొంత ప‌నిచేశారు. వివాదాలున్నా కూడా ఆ రోజు సోంపేట నియోజ‌క‌వ‌ర్గంలోనూ త‌రువాత పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో ఏర్పాట‌యిన ప‌లాస‌లో త‌న‌కంటూ ఓ క్యాడ‌ర్ ను ఏర్ప‌రుచుకున్నారు.ఇప్పుడు పిల్లాడ‌యిన మంత్రి సీదిరితో కయ్యాలు పెట్టుకుంటున్నారు. శివాజీ కుమార్తె శిరీష టీడీపీ జిల్లా అధ్య‌క్షురాలిగా ప‌నిచేసినప్పుడు జిల్లా కేంద్రంలో పార్టీకి ఓ సొంత గూడు నిర్మాణ‌మైంది. ఆ విధంగా శ్రీ‌కాకుళంలో మ‌రో ఎన్టీఆర్ భ‌వ‌న్ హైద్రాబాద్ లో ఉన్న పార్టీ కార్యాల‌యంను త‌ల‌పించే స్థాయిలో ఏర్పాటైంది.

ప‌ద‌వుల ప‌రంగా ప్ర‌తిభా భార‌తి స్పీక‌ర్ గా ప‌నిచేసి ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంకు ఓ గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడీమె కుమార్తె గ్రీష్మ రాజ‌కీయాల్లో ఉన్నారు. కొన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో రాజాం కేంద్రంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆ విధంగా క‌లిసివ‌చ్చిన ఎచ్చెర్ల‌ను వ‌దిలి అటుగా వెళ్లాల్సి వ‌చ్చింది. ఎందుకంటే రాజాం ఎస్సీ రిజ‌ర్వు నియోజ‌క‌వ‌ర్గం క‌నుక. ఓపెన్ కేట‌గిరీలో ఉన్న ఎచ్చెర్లకు గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన కోండ్రు ముర‌ళి కూడా రాజాం వైపే క‌న్నేశారు. ఆయ‌న కూడా ఎస్సీ సామాజిక‌వ‌ర్గం కు చెందిన నాయ‌కుడే!

ఇక్క‌డ ఎచ్చెర్ల లో మాజీ మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట్రావు రాజ‌కీయాలు న‌డుపుతున్నారు కానీ ఈ సారి ఆయ‌న కొడుకు రాం మ‌ల్లిక్ నాయుడు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారు అన్న వాద‌న కూడా ఉంది. కిమిడి కుటుంబం ఇటు శ్రీ‌కాకుళం అటు విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌లో రాజ‌కీయం చేస్తోంది. పార్టీ ప‌రంగా మంచి ప‌దవులే అందుకుంది. గ‌త సారి మృణాళిని (క‌ళా వెంక‌ట్రావు అన్న భార్య‌) మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అలానే గ‌తంలో ఆమె శ్రీ‌కాకుళం జెడ్పీ చైర్మ‌న్ గా కూడా ప‌నిచేశారు.

ఇక ఇచ్ఛాపురం రాజ‌కీయాల్లో మొద‌టి నుంచి టీడీపీ అనుకూలమే! కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌రోసారి అశోక్ బెందాళం (సిట్టింగ్ ఎమ్మెల్యే) గెలుపు అత్యాశ కావొచ్చు. కానీ యువ ఎంపీ రాము మ‌ద్ద‌తు ఈయ‌న‌కు ఉంది. అదేవిధంగా ఉద్దానం ప్రాంతంలో వైసీపీ చేసిందేం లేదు అన్న వాద‌న ఒక‌టి ప్ర‌బ‌లంగా ఉంది క‌నుక ఈ సారి టీడీపీకి క‌లిసి వ‌స్తే రావొచ్చు.

పాల‌కొండ ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ కూడా పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్నా కూడా లీడ‌ర్ అస‌మ‌ర్థ‌త‌తో వైసీపీ రెండు సార్లు గెలిచింది. ఇక్క‌డ యాక్టివ్ గా నిమ్మ‌క జ‌య‌కృష్ణ గెలుపు ఈ సారి కూడా సునాయాసం కాక‌పోవ‌చ్చు. కానీ ఎమ్మెల్యే క‌ళావ‌తి ప‌నితీరు పెద్ద‌గా లేద‌న్న విమ‌ర్శ ఒక‌టి ఉంది. ఆ విధంగా టీడీపీ నెగ్గుకు రావొచ్చు. జ‌య‌కృష్ణ‌కు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్న
దీవెన‌లు ఉన్నాయి.

న‌ర‌స‌న్న‌పేట, టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ప‌ట్టుంది కానీ అభ్య‌ర్థుల గెలుపు మాత్రం అనుకున్నంత సులువు కాదు.ఇప్ప‌టి శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఒక‌వేళ న‌ర‌స‌న్న‌పేట నుంచి పోటీ చేస్తే అప్పుడు టీడీపీకి చుక్కలు త‌ప్ప‌వు.అదే దాస‌న్న (డిప్యూటీ సీఎం కృష్ణ‌దాసు, సిట్టింగ్ ఎమ్మెల్యే) పోటీ చేస్తే మాత్రం బ‌గ్గు ర‌మ‌ణ మూర్తి విజ‌యం సులువు. కానీ ఈయ‌న గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌నిచేసినా నియోజ‌క‌వ‌ర్గంకు చేసిందేమీ లేదు అనే తేలిపోయింది. ఇదే స‌మ‌యంలో టెక్క‌లిలో మ‌రోసారి అచ్చెన్న గెలుపు ఖాయం. కుమారుడ్ని కూడా ఇటుగా తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌లాస రాజ‌కీయంలో ఈ సారి శివాజీ కుటుంబం నెగ్గ‌వ‌చ్చు కానీ గ‌తంలో మాదిరిగా అల్లుడు వెంక‌న్న చౌద‌రి హ‌వా ఉంటే మాత్రం
అక్క‌డ అభివృద్ధి ఆశించ‌డం మాత్రం అత్యాశే అవుతుంది. ఇప్ప‌టికే ఈ కుటుంబంపై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


ఇదే స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్ప‌ల్రాజుకూ కొన్ని త‌ల‌నొప్పులున్నాయి. క‌నుక ఇక్క‌డ ఎవ‌రొచ్చిన వ‌ర్గ పోరు త‌ప్ప అభివృద్ధి ఊసు పెద్డ‌గా లేదు. ఈ న‌ల‌భై ఏళ్ల తెలుగు దేశం పార్టీ రాజ‌కీయంలో కొర్ల రేవ‌తీప‌తి టెక్క‌లి కేంద్రంగా రాజ‌కీయం న‌డిపి స‌క్సెస్ అయ్యారు. త‌రువాత కాలంలో ఆయ‌న పార్టీ మారారు. 1999లో టీడీపీ త‌రుఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాక 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి మ‌రోసారి ఎమ్మెల్యే అయ్యారు. కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ చ‌నిపోయారు. అదే నియోజ‌క‌వ‌ర్గంలో అప్ప‌య్య దొర కూడా మంచి నేత‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ అనుచరుడిగా గుర్తింపు పొందారు.

ఇదే స‌మ‌యంలో మ‌రో కీల‌క నేత ఎర్ర‌న్నాయుడు క‌నుమూశారు. వీరు కూడా చాలా మంచి నాయ‌కుడిగా పేరు పొందారు. ఈ ముగ్గురినీ మిన‌హాయిస్తే ఇప్ప‌టికీ పార్టీని జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లి ఆ మాత్రం అయినా మాట్లాడే నేత‌గా ఎర్ర‌న్న కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు త‌ప్ప ఇంకెవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు. ఆ విధంగా జిల్లా నాయ‌కులు ఢిల్లీ రాజ‌కీయాల్లో నెగ్గ‌లేక‌పోతున్నారు. కేంద్రంతో తమ స‌మ‌స్య‌లు వివ‌రించ‌డంలో ఇత‌ర పార్టీల నేత‌లు కూడా పెద్ద‌గా చొర‌వ చూప‌డం లేదు.దాంతో అంతో ఇంతో దేశ రాజ‌కీయాల్లో శ్రీ‌కాకుళం జిల్లా టీడీపీ ప‌ట్టు సాధించింది.