Begin typing your search above and press return to search.

బాధతో నిద్రపట్టడం లేదు.. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ భావోద్వేగం

By:  Tupaki Desk   |   23 March 2022 11:30 AM GMT
బాధతో నిద్రపట్టడం లేదు.. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ భావోద్వేగం
X
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి, సస్పెన్షన్ పై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమోషనల్ అయ్యారు. వారి ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరోజు విజిల్స్, మరో రోజు భజన.. ఇంకో రోజు చిడతలు ఇలా ఏంటీ పద్ధతి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వికృత చేష్టలను కంట్రోల్ చేయకపోతే ఎమ్మెల్యేలపై విశ్వాసం పోతుందని వాపోయారు.

సభ్యులను సస్పెండ్ చేసిన రోజు తనకు నిద్ర పట్టదంటూ తమ్మినేని సీతారాం ఎమోషనల్ అయ్యారు. తాను ఎంత బాధపడుతున్నానో వాళ్లకేం తెలుసు అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ నడపడానికి రోజుకు రూ.53 లక్షలు ఖర్చు అవుతుందని.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. 2022 మార్చి 23వ తేదీ బుధవారం కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. బుధవారం గురువారం టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సభ ప్రారంభమైన దగ్గర నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు వింత వింత ఆందోళనలు చేస్తూ అడ్డుపడుతుండడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిడతలు వాయిస్తూ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఎంత వారించినా టీడీపీ సభ్యులు వినలేదు. అధికార పార్టీ నేతలు మాట్లాడుతుండగా సభకు అడ్డుపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీలో గత కొద్దిరోజులుగా టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని స్పీకర్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.