Begin typing your search above and press return to search.

టీడీపీ టికెట్లు అన్నీ యువతకేనా...?

By:  Tupaki Desk   |   29 March 2022 8:30 AM GMT
టీడీపీ టికెట్లు అన్నీ యువతకేనా...?
X
వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ల కోసం డిమాండ్ అయితే కచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏపీలో రాజకీయం మారుతోంది. ఒక వేళ వైసీపీ మీద జనాలు పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచుకుంటే ఆల్టర్నేషన్ గా ఈ రోజుకీ కనిపించేది టీడీపీ మాత్రమే. ఏపీలోని పదమూడు జిల్లాల వ్యాప్తంగా టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. లీడర్లు ఉన్నారు. అనుభవశాలురు అనేకులు ఉన్నారు. పైగా అర్ధ, అంగ బలాలు ఆ పార్ఱీకి ఉన్నాయి. అన్నింటికీ మించి చంద్రబాబు లాంటి వ్యూహకర్త ఆ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు.

దాంతో వైసీపీకి ధీటు అయిన పార్టీగా టీడీపీనే చెప్పుకోవాలి. మరి మరో రెండేళ్ళలో జరిగే ఎన్నికలలో టీడీపీ టికెట్లు ఎవరికి ఇస్తుంది. ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి. గెలుపు గుర్రాలను ఎలా ఎంపిక చేస్తారు అన్న ప్రశ్నలు అపుడే పుట్టుకువస్తున్నాయి. టీడీపీకి వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి అన్న దాంట్లో ఏ రకమైన సందేహమే లేదు.

మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన 2024 ఎన్నికల్లో ప్రతీ సీటూ ముఖ్యమే. అందువల్ల మొహమాటాలకు అసలు చాన్స్ లేదు. అలాగే ఫలనా వారికి టికెట్ ఇవ్వాలన్న వత్తిళ్లు కూడా ఈసారి పనిచేయవు. ఇప్పటి నుంచే చంద్రబాబు వచ్చే ఎన్నికల మీద దృష్టి పెట్టి ఉన్నారు. ప్రతీ అసెంబ్లీ సీటులోనూ ఆయన తనదైన శైలిలో సర్వేలు చేయించుకుంటున్నారు, సమీక్షలూ నిర్వహిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ వయసు నలభయ్యేళ్ళు. ఆ పార్టీలో మొదట్లో చేరిన వారిలో చాలా మంది ఈ రోజుకీ కంటిన్యూ అవుతున్నారు. వారి వయసు అయితే ఆరున్నర దశాబ్దాలు పై దాటి ఉంది. కొందరు ఏడు పదుల వయసుకు కూడా చేరుకున్నారు. మరి వారే ఈ రోజుకీ టీడీపీలో ముందు వరసలో ఉన్నారు.

ఒక విధంగా నడి వయసు టీడీపీలో షష్టి పూర్తి దాటిన లీడర్లు ఉన్నారన్న కామెంట్స్ ఉన్నాయి. నాడు ఎన్టీయార్ పార్టీని పెట్టినపుడు ఆయన వయసు అరవై ఏళ్ళు. పార్టీలో చేరిన వారు పాతికేళ్ల వారు, వారే ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. వారే ఇంతకాలం టీడీపీని నడిపించారు, ముందుకు తెచ్చారు.

మరి ఇదే టీడీపీ మరో నలభై యాభై ఏళ్ల పాటు రాజకీయం చేయాలంటే ఏం చేయాలి. దానికి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన సూచన బాగుంది. 40 ఏళ్ళ టీడీపీతో నేను అన్న పుస్తకాన్ని రచించిన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.

సభా ముఖంగానే అయ్యన్న అధినేత చంద్రబాబుకు ఒక సలహా ఇచ్చారు. మేమంతా చిన్న వారిగా ఉండగా ఎన్టీయార్ టికెట్లు ఇచ్చి ఇంతటి స్థాయికి తెచ్చారు. మేమూ పార్టీని అలా ముందుకు తెచ్చాము, ఇదే పార్టీ మరో నలభై ఏళ్లు ఉండాలీ అంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు అనీ కూడా యువతకే ఇవ్వండి చంద్రబాబు గారూ అని విలువైన సూచనలు చేశారు.

నిజంగా అయ్యన్న ఇచ్చిన సూచన గొప్పదే. దానికి సభలో కరతాళద్వనులూ వినిపించాయి. మరి చంద్రబాబు అలా చేస్తారా, మొత్తం టికెట్లు యువతకు ఇవ్వగలరా. అలా చేస్తే సీనియర్లు ఊరుకుంటారా. అసలు యువతకు టికెట్లు ఎక్కువ ఇస్తే వారు తమ సత్తా ఎంత మేరకు చాటుతారు అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

పైగా అధికార వైసీపీ పటిష్టంగా ఉంది. వచ్చే ఎన్నికలలో ఢీ అంటే ఢీ అన్న పోటీ ఉంటుంది. దాంతో అన్నీ ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకోవాలి. యువతకే టికెట్లు అని కొత్తవారిని తెచ్చిపెట్టి ప్రయోగాలు చేయడానికి 2024లో కుదురుతుందా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా కూడా ఆ ప్రయోగం చేస్తే మంచిదే. అయితే నూరు శాతం టికెట్లు ఇవ్వలేకపోవచ్చు కానీ ఎంత వీలైతే అంత ఎక్కువగా యువతకు టికెట్లు ఇవ్వడం ద్వారా కొత్త నీరుని టీడీపీలోకి తీసుకురావాలన్న సూచనలు అయితే పార్టీవ్యాప్తంగా ఉన్నాయి.