Begin typing your search above and press return to search.

పక్కనే పెట్టుకుని దిక్కులు చూస్తున్నారా... ?

By:  Tupaki Desk   |   20 Feb 2022 2:30 AM GMT
పక్కనే  పెట్టుకుని దిక్కులు చూస్తున్నారా... ?
X
చంద్రబాబు వ్యూహాలు బాగానే ఉంటాయి. కానీ వాటికి కాలానికి తగినట్లుగా అమలు చేయడంలోనే ఆయన వెనకబడుతున్నారు అన్నది పెద్ద విమర్శ. టీడీపీ అధినేత కూడా సెంటిమెంట్లను పట్టుకుని ముందుకు పోతున్నారా అన్నది కూడా తమ్ముళ్లకు ఒక పెద్ద డౌట్. టీడీపీకి 2014 ఎన్నికలు బాగా కలసివచ్చాయి. చివరి దాకా వైసీపీదే గెలుపు అన్నారు. ఒక్కసారి సీన్ టర్న్ అయింది. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు, అలాగే నాటి మోడీ క్రేజ్.

ఇలా పొత్తుల వల్లనే గెలిచాను అన్నది బాబు ఆలోచన. నిజానికి పొత్తులు బాగా హెల్ప్ చేశాయి. దానితో పాటు నవ్యాంధ్రాకు సృష్టికర్తగా బాబును జనాలు నమ్మారు. అలా టీడీపీ ఇచ్చిన నినాదం కూడా వర్కౌట్ అయింది. మొత్తానికి చూస్తే చంద్రబాబు నాడు గెలిచారు, 2019లో ఓడారు, 2024లో కూడా పాత కాంబినేషన్ రిపీట్ అంటున్నారు.

సరే పొత్తుల సంగతి ఎన్నికల వేళ తేలుతుంది కానీ వాటితో సంబంధం లేకుండా టీడీపీని బలోపేతం చేయడానికి బాబుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి కదా అన్నదే చర్చగా ఉంది. టీడీపీకి నందమూరి వంశం కంటే గ్లామర్ వేరేది ఉందా అన్నది ప్రశ్న అలా అయితే ఆ వంశాంకురం నందమూరి బాలక్రిష్ణ పక్కనే ఉన్నారు కదా అన్నది మరో ప్రశ్న.

బాలయ్య ఇమేజ్ ఇపుడు బాగా మారిపోయింది. సినీ రంగాన ఆయన ఇపుడు మధ్యాహ్న మార్తాండుడుగా అఖండ మూవీతో వెలిగిపోతున్నారు. అదే విధంగా అహా ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద ఆయన టాక్ షో తరువాత గతం కంటే భిన్నంగా అన్ని వర్గాల జనాలకు బాగా రీచ్ అయ్యారు. ఆయన మీద గతంలో జరిగిన ప్రచారం, జనాలు పెట్టుకున్న కొన్ని అభిప్రాయాలూ అన్నీ ఒక్క దెబ్బకు తుడిచిపెట్టుకుపోయాయి.

ఇక పొలిటికల్ గా చూసినా ఈ మధ్య హిందూపురం జిల్లా కేంద్రంగా ఉండాలని కోరుతూ బాలయ్య అక్కడ పెట్టిన పొలికేక రీ సౌండ్ చేసింది. బాలయ్య పేల్చిన పంచ్ డైలాగులు ఆయన ఏంటో చెప్పాయి. గతానికి భిన్నంగా బాలయ్య బాగా రాటుదేలారు అని కూడా చెబుతున్నారు. ఇపుడు టీడీపీకి గ్లామర్ అవసరం. పక్కనే బావమరిది రూపంలో టన్నుల కొద్దీ గ్లామర్ ఉంది. మరి దాన్ని వాడుకోకుండా పొత్తుల ఎత్తులతో దిక్కులు చూడడం టీడీపీ అధినాయకత్వానికి తగిన పనేనా అన్నదే చర్చట.

బాలయ్యకు హైలెట్ చేయడానికి సందేహం ఎందుకో అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఆయన బావ చంద్రబాబుకు విధేయుడు. పైగా వియ్యకుండు, ఇక లోకేష్ కి స్వయాన మేనమామ, పిల్లనిచ్చిన మామ కూడా. మరి బాలయ్యను ముందు పెట్టి సైకిల్ తొక్కితే ఆ స్పీడ్ అసెంబ్లీ గేట్లు దాటుకుని ముందుకు దూసుకుపోదా అన్నది సగటు తమ్ముడి ప్రశ్న. దీనికి జవాబు మాత్రం టీడీపీ పెద్దలే చెప్పాలి.