Begin typing your search above and press return to search.

కొత్త కొత్తగా టీమిండియా.. ప్రదర్శన అదిరింది.. కూర్పు కుదిరిందా?

By:  Tupaki Desk   |   23 Feb 2022 11:30 PM GMT
కొత్త కొత్తగా టీమిండియా.. ప్రదర్శన అదిరింది.. కూర్పు కుదిరిందా?
X
కొన్నేళ్లలో ఎన్నడూ చూడని విధంగా టీమిండియా జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ గా రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్నాడు. ఏడెనిమిదేళ్లుగా జట్టుగో ఉంటున్నా.. చోటు ఖాయమని చెప్పలేని నిలకడ సాధించి కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ అయ్యాడు. పేసర్లుగా ప్రసిద్ధ్ క్రిష్ణ, హర్షల్ పటేల్ తెరపైకి వచ్చారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో సూర్య కుమార్ ప్రతాపం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..? ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చినా.. బాదుడే ముఖ్యం అన్నట్లు అతడు చెలరేగే తీరు ఆకట్టుకుంటోంది.

వెస్టిండీస్ తో ముగిసిన సిరీస్ లో సూర్య అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కు తోడు వెంకటేశ్ అయ్యర్ అందుబాటులోకి వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ తదితరుల హయాం నుంచి టీమిడియా కొత్త రూపంలోకి మారుతున్నట్లు స్పష్టమైంది.

ముందుంది కప్..

టి20 ప్రపంచ కప్.. 2007లో తొలిసారి కప్ నిర్వహించిన సమయంలో తప్ప మరెప్పడు మన జట్టు విజేతగా నిలవలేదు. నిరుడు జరిగిన కప్ లో ప్రదర్శన మరీ దారుణం. ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ పై తొలిసారి ప్రపంచ కప్ లో ఓటమి పాలైంది. ఆపై న్యూజిలాండ్ చేతిలోనూ సెమీస్ రేసు నుంచి తప్పుకొంది. వాస్తవానికి ఆ సమయంలో జట్టులో కొంత స్తబ్ధత నెలకొంది. హెడ్ కోచ్ రవి శాస్త్రికి అదే ఆఖరు కావడం, కోహ్లి కూడా కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో జట్టు కొంత సందిగ్ధంలో ఉంది. దీనికితగ్గట్లే ఫలితాలు ఎదురయ్యాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, అదంగా గతం. ప్రస్తుతం టీమిండియా కోచ్ గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడంతో తనదైన ముద్ర కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు రోహిత్ సారథి అయ్యాడు.

వీరిద్దరి కాంబినేషన్లో ప్రపంచ కప్ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇటీవలి టి20, వన్డే సిరీస్ లను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇక జట్టంతా కుదురుకున్న ఈ సమయంలో వచ్చే అక్టోబరులో జరుగనున్న ప్రపంచ కప్ ను లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ విషయంలో తాను, రోహిత్‌ పూర్తి క్లారిటీతో ఉన్నామని చెబుతున్నాడు ద్రవిడ్‌.

ఊపు వచ్చింది.. కొనసాగాలి..

ఓపెనర్ గా ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపిస్తుండగా.. సూర్యకుమార్‌‌ నాలుగో స్థానంలో నిలకడగా రాణిస్తున్నాడు. ఆట కంటే సూర్య ఆత్మ విశ్వాసం ఎంతో ఉన్నతంగా ఉందని మ్యాచ్ లు చూసినవారు చెప్పేమాట. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్ . భారీ షాట్లు కొట్టగల సమర్థుడు. హార్దిక్ పాండ్యా లోటును వెంకటేశ్ పూర్తి చేస్తున్నాడు. ఇలాంటి ఆటగాళ్లతో మిడిలార్డర్‌ పటిష్టంగా మారడం సానుకూల అంశాలు. ఇదే ఉత్సాహంలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్‌-2022కు టీమిండియా సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి కోచ్‌ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు వెస్టిండీస్‌ను వైట్‌వాష్‌చేసిన అనంతరం ద్రవిడ్‌ మాట్లాడుతూ... ‘‘నేను, రోహిత్‌ శర్మ.. మేనేజ్‌మెంట్‌ ఈ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం. కచ్చితంగా ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలని ఏమీ లేదు. అయితే సమతుల్యమైన జట్టును సెట్‌ చేసుకోవడం ముఖ్యం. అర్హుడైన ప్రతి ఒక్క ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇస్తాం.

మెగా టోర్నీ నేపథ్యంలో జట్టులో స్థానం సంపాదించుకునే దిశగా వారు చేస్తున్న ప్రయత్నాలకుఊతమిస్తాం’’ అని పేర్కొన్నాడు. కేవలం 15 మంది ఆటగాళ్లకే పరిమిత కాబోమని, వరల్డ్‌కప్‌నకు ముందు కీలక ఆటగాళ్లు కనీసం పది నుంచి 20 మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంకతో టీ20సిరీస్‌కు సిద్ధమవుతున్నది.