Begin typing your search above and press return to search.
కష్టాలను తలచుకున్న యువ క్రికెటర్ తిలక్ వర్మ
By: Tupaki Desk | 24 Feb 2022 11:30 AM GMTహైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మ తన కష్టాలను చెప్పుకొచ్చాడు. ప్రతిభావంతుడైన ఎడమ చేతివాటం బ్యాట్స్ మన్ గా పేరు తెచ్చకున్న తిలక్.. ఈ ఏడాది ఐపీఎల్ లో మంచి ఆఫర్ కొట్టేశాడు. ఐపీఎల్ దిగ్గజ జట్టు అయిన ముంబై ఇండియన్స్ అతడిని రూ1.70 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో తిలక్ దశ తిరిగిందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ఈసారి అతడి ఇషాన్ కిషన్ తో కలిసి ముంబై ఇన్నింగ్స్ ను ఆరంభించే అవకాశం ఉంది.
లేదంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తో కలిసి ఓపెనింగ్ వచ్చే వీలుంది. స్వతహాగానే దూకుడైన బ్యాట్స్ మన్ అయిన తిలక్ ఈసారి ఐపీఎల్ లో అదరగొడితే మరో మెట్టు ఎక్కుతాడనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పటివరకు అతడి ప్రస్థానం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. మధ్యలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ మెగా వేలం-2022లో ముంబై ఇండియన్స్ జట్టు తనను కొనుగోలు చేసిందని తెలియగానే తన కోచ్ సంతోషంతో ఉప్పొంగిపోయారని తిలక్ అన్నాడు.
ఆనందం పట్టలేక ఒక్కసారిగా బోరున ఏడ్చేశారని గుర్తు చేసుకున్నాడు. తన తల్లిదండ్రులైతే ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయారన్నాడు. కాగా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్ వర్మ తండ్రి నాగరాజు, కోచ్ సాలమ్ బయాష్‌ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగాడు.యువ భారత జట్టులో సభ్యుడైన 19 ఏళ్ల తిలక్.. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో 180 పరుగులు చేశాడు.
అటీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరులో జరిగిన మెగా వేలంలో భాగంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తిలక్ వర్మ కోసం పోటీ పడింది. ఆఖరికి కోటీ డెబ్బై లక్షలకు అతడిని కొనుగోలు చేయడంతో తిలక్ వర్మకు జాక్‌పాట్ దక్కింది.
టెన్నిస్ బాల్ తో ఆట మొదలుపెట్టి
హైదరాబాద్ గల్లీల్లో.. టెన్నిస్ బాల్‌తో తిలక్ క్రికెట్ ప్రస్థానం మొదలైంది. ఆ సమయంలో తిలక్ ను చూసిన కోచ్ సాలమ్ బయాష్.. ఈ పిల్లాడు బంతిని భలే బాదుతున్నాడే అంటూ ముచ్చటపడ్డారు. కోచ్ అయ్యారు. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. శిక్షణనిచ్చి క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. తల్లిదండ్రులతో మాట్లాడి తిలక్ ను కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయమని కోరారు.
కాగా, ఐపీఎల్-2022 సీజన్‌సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా తిలక్ వర్మ ఫ్రాంఛైజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్‌తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘వేలం జరుగుతున్నపుడు నేను మా కోచ్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. నన్ను ముంబై 1.7 కోట్లకు కొనుగోలు చేసిందని తెలియగానే.. మా కోచ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశారు. మేము పడ్డ కష్టం గుర్తుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నేను మా అమ్మా నాన్నకు ఫోన్ చేశాను. వాళ్లు ఆనందంతో మాట్లాడలేకపోయారు. వారి కళ్ల వెంట నీళ్లు దుమికాయి. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఆర్థిక కష్టాలు వెంటాడినా..
కోచింగ్ లో చేరేందుకు అమ్మానాన్న అంగీకరించినా.. ఆర్థిక కష్టాలు తిలక్ కుటుంబాన్ని వెంటాడాయి. ‘‘బ్యాట్లు, ప్యాడ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు కోచ్ సాలమ్ తన స్నేహితుడి సాయంతో బ్యాట్ కొనిచ్చారు. అండర్ 14 క్రికెట్ ఆడుతున్నపుడు ఒకే ఒక్క బ్యాట్ ఉండేది. అది మెల్లగా విరిగిపోవడం మొదలైంది. అప్పుడు టేప్‌తో అతికించి దానిని వాడుకునేవాడిని.నాకోసం నా కోచ్ ఎంతో చేశారు’’ అంటూ కష్టాల్లో అండగా నిలబడ్డ గురువు పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.