Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న బాంబుల మోత

By:  Tupaki Desk   |   15 March 2022 2:07 AM GMT
పెరిగిపోతున్న బాంబుల మోత
X
గడచిన 19 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న మూడు రోజుల నుండే ఉక్రెయిన్ లో బాంబుల మోత బాగా పెరిగిపోతోంది. ఉక్రెయిన్ లోని అనేక నగరాలపై రష్యా వైమానిక దళాలు పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నాయి. ఒకపుడు వైమానిక దళాలు ఇంత జోరుగా ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేసింది లేదు. కేవలం మిలిటరీ మాత్రమే యుద్ధంలో పాల్గొంటోంది. మిలిటరీకి మద్దతుగా అప్పుడప్పుడు మాత్రమే వైమానిక దళాలు కనబడేవి.

కానీ మూడు రోజుల నుండి మిలిటరీ ఒకవైపు వైమానిక దళాలు మరోవైపు రెచ్చిపోతున్నాయి. దాంతో వైమానికి దళాల బాంబుల ప్రయోగాల దెబ్బకు అనేక నగరాల స్వరూపాలే మారిపోతున్నాయి. తాజాగా రాజధాని కీవ్, ఖైమర్, డన్ స్క్రు, మరియాపోల్ లాంటి అనేక నగరాల్లోని ఎంతో పాపులరైన చారిత్రక నిర్మాణాలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. రష్యా ప్రయోగిస్తున్న బాంబులు వాణిజ్య భవనాలు, కాలేజీలు, ఆపీసులు, నివాస సముదాయాలే కాకుండా చివరకు ఆసుపత్రులను కూడా ధ్వంసం చేసేస్తున్నాయి.

తాజా బాంబుల దాడిలో ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా విమానాలు తయారుచేసే ఆంటనోవ్ ఫ్యాక్టరీ పూర్తిగా దెబ్బతినేసింది. ఒక్క మరియాపోల్లోనే కనీసం 2500 మంది చనిపోయినట్లు సమాచారం.

ఇదే సమయంలో ఉక్రెయిన్ నుండి ఇతర దేశాలకు సుమారు 30 లక్షల మంది వలసలు వెళ్ళిపోయారని ఐక్యరాజ్యసమితి అధికారులు అంచనా వేశారు. యుద్ధానికి ఆపేందుకు ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉన్నతస్ధాయి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు యుద్ధం తీవ్రంగా మారుతోంది.

అంటే యుద్ధాన్ని ఆపటంలో ఐక్యరాజ్యసమితి పూర్తిగా ఫెయిలైనట్లే అర్ధమవుతోంది. ఐక్యరా జ్యసమితి ఎంతసేపు ప్రకటనలకు, హెచ్చరికలకు మాత్రమే పరిమితమవుతోంది. రష్యాను నియంత్రించేంత సీన్ ఐక్యరాజ్యసమితికి లేని కారణంగానే యుద్ధ నివారణ సాధ్యం కావడం లేదు.

ఇదే సమయంలో రష్యాకు ఎలాంటి సాయం అందించేందుకు లేదని చైనాను అమెరికా హెచ్చరిస్తోంది. అయితే అమెరికా వార్నింగును చైనా పట్టించుకుంటుందా అనేది అనుమానమే.

ఉక్రెయిన్ యుద్ధంలో చైనా గనుక రష్యాకు సాయం చేస్తే అది చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఒకవైపు రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. అమెరికా ఆయుధాలు కూడా ఉక్రెయన్ కు అందాయి. కానీ చైనా మాత్రం రష్యాకు సాయం చేయకూడదని అమెరికా వార్నింగిస్తోంది. మరి చైనా ఏమి చేస్తుందన్నదే కీలకమైపోయింది.