Begin typing your search above and press return to search.

జెలెన్ స్కీ సరెండర్ అవుతున్నట్లేనా ?

By:  Tupaki Desk   |   23 March 2022 6:31 AM GMT
జెలెన్ స్కీ సరెండర్ అవుతున్నట్లేనా ?
X
యుద్ధం మొదలైన 28 రోజుల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యాకు సరెండర్ అవుతున్నట్లే అనిపిస్తోంది. టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధాన్ని ఆపటానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో చర్చలు జరపటానికి తాను రెడీగా ఉన్నట్లు చెప్పారు. అలాగే నాటో దేశాల్లో సభ్యత్వాన్ని కూడా కోరబోమని హామీ కూడా ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన కారణాల్లో నాటో దేశాల్లో ఉక్రెయిన్ సభ్యత్వం కోసం ప్రయత్నించడం కూడా ఒకటని అందరికీ తెలిసిందే.

యుద్ధం మొదలైన ఇన్ని రోజులకు జెలెన్ స్కీకి వాస్తవాలేమిటో తెలిసొచ్చినట్లుంది. 28 రోజుల యుద్ధంలో ఉక్రెయిన్లోని చాలా నగరాలు, పట్టణాలు దాదాపు ధ్వంసమైపోయాయి. మరణాల సంఖ్య ఇంతాని సరిగ్గా లెక్కలు లేవుకానీ సంఖ్య చాలా పెద్దదనే అనిపిస్తోంది. ఉక్రెయిన్లో సైనికులతో పాటు మామూలు జనాలు కూడా చనిపోయారు. ఇదే సమయంలో రష్యా సైనికులు సుమారు 15 వేల మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

అంటే యుద్ధం వల్ల రెండు దేశాల్లోను నష్టం చాలా తీవ్రంగా ఉందన్నది వాస్తవం. యుద్ధం వల్ల తర్వాత పరిణామాలు ఇంత భయంకరంగా ఉంటుందని జెలెన్ స్కీకి యుద్ధానికి ముందు తెలీదా ? తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోబట్టే సమస్య ఇలా పెరిగిపోయింది. అమెరికా నాయకత్వంలోని నాటో దేశాల మద్దతు చూసుకునే జెలెన్ స్కీ రష్యాతో యుద్ధానికి తొడకొట్టాడు. తీరా యుద్ధం మొదలయ్యే సమయానికి అమెరికాతో పాటు నాటో దేశాలన్నీ వెనక్కు వెళ్ళిపోయాయి. ఆయుధాలను అందించాయే కానీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు.

నాటో దేశాల వైఖరిని ఏ మాత్రం ఊహించని జెలెన్ స్కీకి దిక్కుతోచలేదు. అయినా వాళ్ళిచ్చిన ఆయుధాలతోనే ఇంతకాలం రష్యా సైన్యాలను ప్రతిఘటిస్తున్నాడు. ఇక లాభం లేదని అర్ధమైపోయినట్లుంది. అందుకనే యుద్ధ విరమణకు పుతిన్ కు ప్రతిపాదనలు పంపాడు. మరి రష్యా ఏ విధంగా స్పందిస్తునే విషయం చూడాల్సిందే. దాదాపు నేలమట్టమైపోయిన ఉక్రెయిన్ను పునర్నిర్మించాలంటే కనీసం 20 ఏళ్ళు పడుతుందని అంచనా వేస్తున్నారు.