Begin typing your search above and press return to search.

ఈ ఎన్నికలే రాష్ట్రపతిని డిసైడ్ చేస్తాయా ?

By:  Tupaki Desk   |   7 March 2022 6:02 AM GMT
ఈ ఎన్నికలే రాష్ట్రపతిని డిసైడ్  చేస్తాయా ?
X
ఇందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలే రాష్ట్రపతి ఎన్నికపై ప్రభావం చూపుతుంది కాబట్టే బీజేపీ ఇన్ని అవస్థలు పడుతోంది. వీటిల్లో కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. అందుకనే యూపీలో గెలుపు కోసం కేంద్రంలోని పెద్దలు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ ప్రకారం లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, రాష్ట్రాల శాసనసభ్యులు ఓట్లు వేస్తారు.

ఎలక్టోరల్ కాలేజీ ప్రకారం మొత్తం ప్రజాప్రతినిధుల సంఖ్య 4896 అయితే వాళ్ళ ఓట్ల విలువ 10,98,903. ఇందులో లోక్ సభ ఎంపీల బలం ఎన్డీయేకి 334, రాజ్యసభ బలం 106 ఉంది. ఇక మొత్తం ఎంఎల్ఏల బలం 4120లో బీజేపీ బలం 1431గా ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంఎల్ఏల బలం 766 అయితే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీల్లోని ఎంఎల్ఏల బలం 1923. మొత్తం 10,98,903 ఓట్లలో రాష్ట్రపతిగా ఎన్నికవ్వాలంటే కచ్చితంగా 51 శాతం ఓట్లు వచ్చి తీరాలి.

ఇప్పటి బలం ప్రకారం సొంతంగా అభ్యర్ధిని పోటీ చేయించి గెలిపించుకునే అవకాశం బీజేపీ తక్కువే. అందుకనే యూపీయే కూటమి పార్టీల్లోను, నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలపై నరేంద్ర మోడి దృష్టిపెట్టారు.

అలాగే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిని ఓడగొట్టేందుకు ఎన్డీయే కూటమిలోను చీలికలు తెచ్చేందుకు ఇటునుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు కూటములకు దూరంగా ఉంటున్న టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ పార్టీల ఓట్లు చాలా కీలక మయ్యాయి.

ఈ నేపధ్యంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే అందరి దృష్టి పడింది. యూపీలో గనుక బీజేపీ మంచి మెజారిటీతో గెలవకపోయినా లేదా ఎస్పీ గణనీయంగా తన బలాన్ని పెంచుకున్నా రాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా తయారవుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో ఎంఎల్ఏల సంఖ్యను బట్టే ఓటు విలువ మారిపోతుంది.

యూపీలో 403 మంది ఎంఎల్ఏలున్నారు కాబట్టి ఒక్కో ఓటు విలువ 208. మణిపూర్లో ఎంఎల్ఏల సంఖ్య తక్కువ కాబట్టి అక్కడి ఎంఎల్ఏ ఓటు విలువ 18 మాత్రమే. అంటే ఒక్కో రాష్ట్రంలో అసెంబ్లీ సంఖ్య ఆధారంగా ఎంఎల్ఏ ఓటు విలువ ఒక్కో విధంగా ఉంది. అందుకనే అందరి దృష్టి మార్చి 10వ తేదీ ఓట్ల కౌంటింగ్ పైనే ఉంది.