Begin typing your search above and press return to search.

రైల్వే జోన్ ఏర్పాటూ అబద్ధమేనా ?

By:  Tupaki Desk   |   11 March 2022 12:30 AM GMT
రైల్వే జోన్ ఏర్పాటూ అబద్ధమేనా ?
X
వైజాగ్ కేంద్రంగా తొందరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న మాటలన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ప్రజలను మభ్యపెట్టేందుకు కమలనాథులు అబద్ధాలు చెబుతున్నట్లు తాజాగా వెల్లడైంది. బీజేపీ రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహారావు అండ్ కో మాట్లాడుతూ తొందరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందంటు ఒకటే ఊదరగొడుతున్నారు.

తాను రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడానని డీపీఆర్ రెడీ అయిపోయిందని, తొందరలోనే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే సమాచార హక్కు చట్టం ద్వారా ఒక కార్యకర్త జోన్ ఏర్పాటుపై తాజా సమాచారం కావాలని దరఖాస్తు చేశారు. దానికి రైల్వే శాఖ ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. అందులో ఏముందయ్యా అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ డీపీఆర్ పరిశీలనలోనే ఉందట. కాబట్టి జోన్ ఎప్పుడు ఏర్పాటవుతుందో చెప్పలేమని చెప్పారు.

డీపీఆర్ స్ధితిగతులు, కొత్త జోన్ ఏర్పాటుకయ్యే ఖర్చు, ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులు, చేసిన వ్యయం లాంటి అనేక అంశాలపైన కూడా రైల్వే ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. 2020-21లో బడ్జెట్ లో రు. 170 కోట్లు కావాలని అంచనా వేస్తే కేటాయించింది రు. 3 కోట్లు మాత్రమే.

అలాగే తర్వాత సంవత్సరాల్లో రు. 40 లక్షల చొప్పున కేటాయించారు. అంటే అంచనాలకు, కేటాయింపులకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. కేటాయింపులే ఇంత అధ్వానంగా ఉంటే ఇందులో కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదట.

సో, రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన సమాధానం ప్రకారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు జరిగే పని కాదని అర్థమైపోతోంది. అసలు విభజన చట్టంలో ఉన్నది రైల్వే జోన్ అయితే దాన్ని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పేరుతో స్థాయిని బాగా దిగ జార్చేసింది.

మళ్ళీ దీని ఏర్పాటులో కూడా ఇన్ని అబద్ధాలు. ఇంకొంత కాలమైతే అసలు ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఏడాది దాటితే ఎన్నికల సంవత్సరం అడుగుపెడుతుంది. ఇక ఏమన్నా జరగాలంటే 2024 ఎన్నికల తర్వాతే. మరప్పుడు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.