Begin typing your search above and press return to search.

ప్రపంచకప్ లో మనమ్మాయిలు ఇరగదీశారు.. పాక్ జట్టును ఓడించారు

By:  Tupaki Desk   |   7 March 2022 5:31 AM GMT
ప్రపంచకప్ లో మనమ్మాయిలు ఇరగదీశారు.. పాక్ జట్టును ఓడించారు
X
మహిళా క్రికెట్ ప్రపంచ కప్ లో మనమ్మాయిలు శుభారంభం చేశారు. దాయాది పాక్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో అద్భుతమైన ఫాం ప్రదర్శించిన భారత మహిళా జట్టు మర్చిపోలేని మంచి విజయాన్ని అందించారు. బ్యాట్ తోనూ.. బాల్ తోనూ రాణించిన మహిళల జట్టు పాక్ జట్టుపై అన్నింట్లోనూ అధిక్యతను ప్రదర్శించింది.

వన్డేల్లో పాకిస్తాన్ పై 11 విజయాలతో భారత్ తన అజేయ రికార్డును కొనసాగిసోతోంది. ప్రపంచ కప్ లో దాయాదికి ఇది వరుసగా 15వ పరాజయం కావటం గమనార్హం. న్యూజిలాండ్ లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ తన తదుపరి మ్యాచ్ ను కివీస్ జట్టుతో ఆడనుంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన బారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఆరంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగులు ఏమీ చేయకుండానే ఔట్అయ్యారు. నాలుగు పరుగులకు తొలి వికెట్ ను కోల్పోయిన భారత్ కు మరో ఓపెనర్ దీప్తి శర్మ 40 పరుగులు చేసి ఆదుకుంది. మరో బ్యాట్స్ ఉమెన్ స్మ్రతి అర్థ సెంచరీతో భారత్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ఇలాంటివేళ పాక్ స్పిన్నర్లు చెలరేగిపోవటంతో భారత్ వికెట్లు టపటపా రాలిపోయాయి. ఒకదశలో కేవలం 114 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి దారుణ స్థితికి చేరుకుంది. ఇలాంటి వేళలో స్కోర్ బోర్డు 200 పరుగులకు చేరుకుంటుందా? అన్న సందేహం వ్యక్తమైంది.

ఇలాంటివేళలో ఆల్ రౌండర్లు స్నేహ.. పూజలు పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు తీయించారు. దీంతో.. 200 పరుగుల దాటటమే కాదు 50 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి.. గౌరవప్రదమైన స్కోరును జట్టుకు అందించారు. పూజ.. స్నేహ్ లు ఇద్దరు చెరో హాఫ్ సెంచరీ సాధించటమేూకాదు ఏడో వికెట్ కు ప్రపంచ కప్ లో అత్యధిక భాగస్వామ్యం రికార్డును నెలకొల్పారు.

అనంతరం 245 పరుగుల విజయలక్ష్యంతో దిగిన పాక్ జట్టును భారత బౌలర్లు క్రమం తప్పకుండా దెబ్బ తీశారు. స్పిన్నర్ రాజేశ్వరి పాక్ పతనానికి శ్రీకారం చుడితే.. మిగిలిన బౌలర్లు తమ వంతు సహకారాన్ని అందించారు. దీంతో.. పాక్ వరుస పెట్టి వికెట్లను సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో పాక్ కేవలం 43 ఓవర్లకు 137 పరుగులు మాత్రమే చేసి అలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్ కు మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే సచిన్.. జావెద్ మియాందాద్ తర్వాత ఆరు ప్రపంచ కప్ లలో బరిలోకి దిగిన మూడో క్రికెటర్ గా 39 ఏళ్ల మిథాలీ రాజ్ రికార్డును క్రియేట్ చేశారు. ఈ ఘనతను సాధించిన తొలి మహిళా క్రికెటర్ ఆమె కావటం మరో విశేషం.