Begin typing your search above and press return to search.

ఏపీలో నాలా వ‌సూలు ? టార్గెట్ ఎంతంటే !

By:  Tupaki Desk   |   21 March 2022 5:30 PM GMT
ఏపీలో నాలా వ‌సూలు ? టార్గెట్ ఎంతంటే !
X
వ్య‌వ‌సాయ భూమిని వ్య‌వ‌సాయేత‌ర భూమిగా మార్చుకుని ఇల్లు క‌ట్టుకున్నాడో ఆటో డ్రైవ‌ర్. ఇదంతా ఇర‌వై రెండేళ్ల కింద‌టి క‌థ. అప్పుడు నాలా చెల్లింపున‌కు వెచ్చించాల్సింది స‌రిగ్గా ఇర‌వై వేలు. కాలం బాగా ముందుకు పోయాక, గిర్రున కాల చక్రం తిరిగాక మ‌న అధికారుల క‌ళ్లు తెరిచాయి. రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల మేరకు ఆ ఆటో డ్రైవ‌ర్ నాలా చెల్లించాల‌ని అంటున్నారు. ఇదీ ఇవాళ ఏపీ లో జ‌రుగుతున్న క‌థ‌. మ‌రోవైపు నాలా చెల్లింపు అన్న‌ది పాత ప‌ద్ధ‌తిలో ఉన్న‌దేన‌ని, ఈ ప‌న్ను కింద బ‌కాయి ఉన్న వారంతా చెల్లించాల్సిందేన‌ని సంబంధిత ఉన్న‌తాధికారి ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి! క‌రోనా కాలంలో నాలా వ‌సూళ్లు ఏమ‌య్యాయి ? ఆ రోజు చెల్లించాల్సిన నాలాను ఇప్పుడు చెల్లించడం ఏంటి? ఆ రోజు అధికారులు ఏం చేస్తున్నార‌ని? అంటే అధికారులు త‌ప్పు చేసినా కూడా తామే జ‌రిమానా చెల్లించాలా అన్న‌ది బాధిత వ‌ర్గం ఆవేద‌న. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇవాళ నాలా వ‌సూళ్ల ల‌క్ష్యం అక్ష‌రాలా ఆరు వంద‌ల కోట్లు.

ఇంటి ప‌న్ను, చెత్త ప‌న్నుల వ‌సూళ్ల ల‌క్ష్యం అక్ష‌రాల వెయ్యి కోట్లు. ఇక ఒన్ టైం సెటిల్మెంట్ పేరిట చేస్తున్న హంగామా ల‌క్ష్యం రెండు వేల కోట్లు. ఇవీ ఇవాళ రెవెన్యూ,మున్సిప‌ల్ మ‌రియు పంచాయ‌తీ అధికారుల ముందున్న స‌మీప ల‌క్ష్యాలు. ఇవి చేరుకోలేక‌పోతే క‌లెక్ట‌ర్ల దగ్గ‌ర చీవాట్లు త‌ప్ప‌వు. ఇవి చేరుకోలేక‌పోతే క‌లెక్ట‌ర్ల‌కు సీఎం నుంచి నోటీసులు వ‌చ్చినా వ‌స్తాయి. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం అనుసారం ప్ర‌ధాన మీడియాలో వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం 2021 జూలై నుంచి ఇప్ప‌టిదాకా ప‌ది వేల ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి వ్య‌వ‌సాయేత‌ర భూమిగా మారింది. ఇందుకు స్వ‌చ్ఛందంగానే చెల్లించిన నాలా విలువ 110 కోట్ల రూపాయ‌లు. మ‌రి! ఇంత మొత్తంలో వ‌చ్చిన డ‌బ్బు ఏమ‌యిపోతోంది.మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా 14వేల కోట్లు వ‌చ్చాయి. నాలా ద్వారా 110 కోట్లు వ‌చ్చాయి.ఇత‌ర మార్గాల ద్వారా ఓ వెయ్యికోట్లు వ‌చ్చాయి అనే అనుకుందాం అంటే మొత్తంగా రెండు వేల 110 కోట్ల రూపాయ‌ల‌కు స‌ర్కారు ఏమ‌యినా లెక్క‌లు ఇంత‌వ‌ర‌కూ వెల్ల‌డించిందా అన్న‌దే విప‌క్షాల ప్ర‌శ్న.

ఈ రెండు వేల కోట్ల‌ను పోనీ విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేసే సంస్థ‌ల‌కు ముఖ్యంగా జెన్ కో కు బ‌కాయి ప‌డ్డ మొత్తాన్ని తీర్చేందుకు వెచ్చించిందా అంటే అదీ లేదు. పోనీ థ‌ర్మ‌ల్ విద్యుత్ ప్లాంట్లకు అవ‌స‌రం అనుకున్న బొగ్గు కొనుగోలు చేసి సంబంధిత స‌మ‌స్య నుంచి ఒడ్డెక్కిందా అంటే అదీ లేదు.అంటే డ‌బ్బులు వ‌స్తే పేద‌ల‌కు పంచుతున్నాం అని చెప్పేందుకు మాత్రం ఓ సాకును సిద్ధం చేసుకుని క‌నీస చెల్లింపుల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వ‌కుండా జ‌గ‌న్ స‌ర్కారు కాల‌యాప‌న చేస్తుంది అన్న‌ది ఓ వాస్త‌వం అని ఇదే ఇవాళ నిరూప‌ణ అయిన నిజం కూడా అని టీడీపీ అంటోంది.