Begin typing your search above and press return to search.

కాట‌సాని క‌ష్టం ఫ‌లించేనా.. మంత్రి ప‌ద‌వి ద‌క్కేనా.. ?

By:  Tupaki Desk   |   30 March 2022 2:30 AM GMT
కాట‌సాని క‌ష్టం ఫ‌లించేనా.. మంత్రి ప‌ద‌వి ద‌క్కేనా.. ?
X
కాట‌సాని రాంభూపాల్ రెడ్డి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న నాయ‌కుడు. పైగా.. వివాద ర‌హిత నాయకుడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకుని తిరుగులేని నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఆయ‌నకు ఉన్న ఏకైక కోరిక‌.. ఒక్క‌సారైనా మంత్రి ప‌ద‌వి ని ద‌క్కించుకుని.. `మంత్రిగారు` అనిఅనిపించుకోవాలని. కానీ, ఆయ‌న కోరిక ఇప్ప‌టి వ‌ర‌కు తీర‌లేదు గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. వైఎస్‌కు అంత్యంత స‌న్నిహితుడుగా మెలిగారు. అంతేకాదు.. రెండు వ‌ర్గాలుగా ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ చీలిపోయిన‌ప్పుడు వైఎస్‌కు అను కూల వ‌ర్గంలో కాట‌సాని చ‌క్రం తిప్పారు. అలాంటి నాయ‌కుడు.. అయిన‌ప్ప‌టికీ.. వైఎస్‌ను బ‌తిమాలుకున్నా కూడా.. ఆయ‌న సున్నితంగా తిరస్క‌రించారు.

ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. 2014లో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలోనే వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే.. ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్క‌రించారు. అయితే.. ఎన్నిక‌ల్లో మాత్రం పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఇండిపెండెంట్‌గా ఓడిపోయారు. ఇక‌, త‌ర్వాత‌.. బీజేపీలో చేరినా.. ఆయ‌న అక్క‌డ ఇమ‌డ‌లేక పోయారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పాణ్యంలో చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కాట‌సాని.. వైసీపీలోకి వ‌చ్చారు., అప్ప‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న చ‌రితారెడ్డి టీడీపీలోకి వెళ్లారు. దీంతో ఆమెపై విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న మంత్రి వ‌ర్గంపై ఆశ‌లు పెట్టుకున్నారు. తొలి ద‌శ కేబినెట్‌లోనే అవ‌కాశం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

కానీ, క‌ర్నూలు నుంచి పార్టీ త‌ర‌ఫు ప‌నిచేసిన‌.. వారికే ప్రాధాన్యం ద‌క్కింది. దీనికి కూడా ఒక కార‌ణం ఉంది. ముందు పిలిచి న‌ప్పుడు పార్టీలోకి రాలేద‌నే ట్యాగ్ అప్ప‌ట్లో కాట‌సాని గురించి ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రిగింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఉన్న నేప‌థ్యంలో త‌న మిత్రుడు, స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ద్వారా చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. అయితే.. సీనియ‌ర్ కావ‌డం.. పైగా.. రాజ‌కీయ అనుభ‌వం ఉండ‌డం వంటివి ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్నా.. రెడ్డి ట్యాగ్ మాత్రం విభేదిస్తోంద‌ట‌.

ఇప్ప‌టికే.. క‌డప జిల్లా రాయ‌చోటి నుంచి గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డిని తీసుకుంటార‌ని.. అంటున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో ఇటీవ‌ల మ‌ర‌ణించిన మంత్రి గౌతంరెడ్డి స‌తీమ‌ణికి రిజ‌ర్వ్ చేశార‌ట‌. ఈ నేప‌థ్యంలో రెడ్ల‌ను ఎక్కువ చేర్చుకుంటే.. ప్ర‌మాద‌మ‌ని.. అందునా ఎన్నిక‌ల‌కు ముందు కేబినెట్‌లో రెడ్డి వ‌ర్గాన్ని మ‌రింత త‌గ్గించాల‌ని.. ప్లాన్ చేస్తున్న ద‌రిమిలా.. కాట‌సాని ఎంత క‌ష్ట‌ప‌డినా.. ఫ‌లితం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రి చివ‌రి నిముషంలో జ‌గ‌న్ ఏమైనా క‌రుణిస్తే.,. త‌ప్ప‌.. కాట‌సాని ఆశ‌లు తీర‌డం సాధ్యం కాద‌ని.. ఆయ‌న అనుచ‌రులు కూడా చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.