Begin typing your search above and press return to search.

ఉదయం పెగాసన్ వాడుతున్నామన్న వైసీపీ ఎమ్మెల్యే సాయంత్రానికి ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   23 March 2022 5:50 AM GMT
ఉదయం పెగాసన్ వాడుతున్నామన్న వైసీపీ ఎమ్మెల్యే సాయంత్రానికి ఏం చెప్పారు?
X
రాజకీయాల్లో దూకుడు ఒక ఆయుధం. అలా అని వెనుకా ముందు చూసుకోకుండా ప్రత్యర్థులను ఛేజ్ చేసినట్లుగా మాటల్ని విసిరితే.. ఇట్టే తేడా కొట్టటం ఖాయం. తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది ఏపీ అధికార పక్షానికి చెందిన గుడివాడ అమర్ నాథ్. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటమే లక్ష్యంగా మారిన వేళ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం.. ఆ తర్వాత తన మాటల్లోని దూకుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వైనాన్ని గుర్తించి.. మాటలు మార్చేశారు.

ఉదయం వేళ.. తమ ప్రభుత్వం బరాబర్ ట్యాపింగ్ పరికరాల్ని వాడుతోందని చెప్పిన ఆయన సాయంత్రానికి తన మాటల్ని పూర్తిగా వెనక్కి తీసేసుకున్నారు. తన మాటలకు ఆయన కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల పెను సంచలనంగా మారి.. అప్పటి చంద్రబాబు సర్కారు పెగాసన్ సాఫ్ట్ వేర్ వినియోగించిందన్న వాదనల వేళ.. అందరి అంచనాలకు భిన్నంగా గుడివాడ అమర్ నాథ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ పరికరాల్ని.. ఇతర సాఫ్ట్ వేర్ లను దేశ భద్రత కోసం వినియోగిస్తారన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది తప్పించి.. నేతల వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లమన్నారు. చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆయన సతీమణితో ఏం మాట్లాడుతున్నారు? బాబు కుమారుడు.. కోడలు ఏం మాట్లాడుతున్నారన్న విషయాల్ని తెలుసుకునేందుకు వీటిని వినియోగించమంటూ నోరు పారేసుకున్నారు. నిజానికి ఈ వ్యవహారంలో చంద్రబాబు ఆయన సతీమణి.. చంద్రబాబు కుమారుడు ఆయన కోడలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవటానికి వీటిని వినియోగించమన్న పోలిక ఏ మాత్రం సరికాదంటున్నారు.

రాజకీయంగా దెబ్బ తీయటానికి.. సంబంధం లేని అంశాల్ని ముడి వేస్తే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న దానికి నిదర్శనంగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. ఉదయం వేళలో సెక్రటేరియట్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.

తన దూకుడు లెక్క తేడా కొట్టిన వైనాన్ని గుర్తించిన ఆయన.. సాయంత్రం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యక్రమాల్ని ఎప్పుడూ చేయదని.. సాఫ్ట్ వేర్.. స్పైవేర్ రెండు వేర్వేరు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకే అనేది.. తొందరపడితే ఇలాంటి తిప్పలే తప్పవు. మొత్తానికి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా గుడివాడ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.