Begin typing your search above and press return to search.

రక్త‌పు మ‌డుగులో వివేకాను చూశా.. వైఎస్ ప్ర‌తాప్‌రెడ్డి వాంగ్మూలం

By:  Tupaki Desk   |   25 Feb 2022 8:30 AM GMT
రక్త‌పు మ‌డుగులో వివేకాను చూశా..  వైఎస్ ప్ర‌తాప్‌రెడ్డి వాంగ్మూలం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వివిధ వ్య‌క్తులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూల‌లు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో అనూహ్య విష‌యాలు తెలుస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పెద‌నాన్న వైఎస్ ప్ర‌తాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 2021 ఆగ‌స్టు 16న ఆయ‌న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.

ఆ వాంగ్మూలంలో ఆయ‌న ఏం చెప్పారంటే..

"2019 మార్చి 15న ఉద‌యం 6.30 గంట‌ల‌కు మా సోద‌రుడు వైఎస్ మ‌నోహ‌ర్‌రెడ్డి నాకు ఫోన్ చేసి వివేకానంద‌రెడ్డి గుండెపోటు, ర‌క్త‌పు వాంతుల‌తో చ‌నిపోయార‌ని చెప్పాడు. నేను 7.20కి వివేకా ఇంటికి చేరుకున్నా. హాల్‌లో వైఎస్ మ‌నోహ‌ర్‌రెడ్డి కూర్చుని ఉన్నారు. బ‌య‌ట గార్డెన్‌లో వైఎస్ అవినాష్ రెడ్డి ఎవ‌రితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. బెడ్‌రూమ్‌లోకి వెళ్ల‌గా ఎంవీ కృష్ణారెడ్డి, డి.శంక‌ర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఇన‌య‌తుల్లా ఉన్నారు. మంచం వ‌ద్ద నేల‌పై రక్తం ఉంది. బాత్‌రూమ్‌లో వివేకా మృత‌దేహం ఉంద‌ని ఆయ‌న పీఏ కృష్ణారెడ్డి చెప్పారు. అక్క‌డికి వెళ్లి చూస్తే క‌మోడ్ ద‌గ్గ‌ర ర‌క్త‌పు మ‌డుగులో వివేకా మృతేద‌హం ప‌డి ఉంది. బేసిన్ వైపు గోడ‌పై రక్తం ఉంది.

వివేకా నుదిటిపై తీవ్ర గాయాలున్నాయి. అప్పుడే నాకు అనుమానం వ‌చ్చింది. అది గుండెపోటు కాద‌ని ఏదో త‌ప్పు జ‌రిగింద‌ని గ్ర‌హించా. అప్ప‌టికే వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మ‌నోహ‌ర్‌రెడ్డి, వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, డి.శంక‌ర్‌రెడ్డి క‌లిసి వివేకా గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు నాతో స‌హా అంద‌రికీ చెప్పారు. ప‌నిమ‌నిషిని త్వ‌ర‌గా బెడ్‌రూమ్ క్లీన్ చేయాల‌ని శంక‌ర్‌రెడ్డి, గంగిరెడ్డి బ‌ల‌వంతం చేశారు. అంత హ‌డావుడి ఎందుక‌ని ఆశ్చ‌ర్య‌పోయా. అదే స‌మ‌యంలో సీఐ శంక‌ర‌య్య వ‌చ్చి సాక్ష్యాధారాల‌ను ఎందుకు చెరిపేస్తున్నార‌ని అడిగినా వాళ్లు వినిపించుకోలేదు. ర‌క్తంతో త‌డిసిన బెడ్‌షీట్‌ను ఎర్ర గంగిరెడ్డి ఓ మూల‌కు ప‌డేశారు. నా క‌ళ్ల ముందే ఆధారాలు చెరిపేస్తుంటే అక్క‌డ ఉండ‌లేక మా ఇంటికి వ‌చ్చేశా.

వివేకాతో నాకు స‌త్సంబంధాలున్నాయి. ఆయ‌న మ‌ర‌ణానికి వారం రోజుల ముందు నా ఆఫీసుకు వ‌చ్చి అరగంట మాట్లాడారు. క‌డ‌ప ఎంపీ టికెట్ త‌న‌కు ఇవ్వ‌కున్నా ప‌ర్లేద‌ని వివేకా చెప్పారు. త‌న‌కు కాదంటే ఆ టికెట్‌ను ష‌ర్మిల లేదా విజ‌య‌మ్మ‌కు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. వైఎస్ అవినాష్‌రెడ్డి జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యే స్థానానికి మంచి అభ్య‌ర్థి అవుతార‌ని ఆ రోజు వివేకా అభిప్రాయ‌ప‌డ్డారు.అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర్‌రెడ్డి, ఆయ‌న కుటుంబం ఎప్పుడూ వివేకానందకు వ్య‌తిరేకంగా ఉండేది. 2017 ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భాస్క‌ర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, శంక‌ర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కార‌ణంగానే ఓడిపోయాన‌ని వివేకాకు త‌ర్వాత తెలిసింది" అని ప్ర‌తాప్‌రెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నారు.