Begin typing your search above and press return to search.

పన్నెండేళ్ల వైసీపీ.. కార్య‌క‌ర్త‌ల‌ను మోసం చేసిందా?

By:  Tupaki Desk   |   14 March 2022 1:30 PM GMT
పన్నెండేళ్ల వైసీపీ.. కార్య‌క‌ర్త‌ల‌ను మోసం చేసిందా?
X
కార్య‌క‌ర్త‌ల బ‌లం లేని పార్టీ తెడ్డు లేని ప‌డ‌వ లాంటిది. ఎన్నికల స‌ముద్రంలో పార్టీ అనే ప‌డ‌వ‌ను అధికార ఒడ్డుకు చేర్చ‌డంలో కిందిస్థాయి క్యాడ‌ర్‌దే కీల‌క పాత్ర‌. కానీ వాళ్ల‌కు ఒక‌సారి పార్టీపై అసంతృప్తి పెరిగి.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే కోపం వ‌స్తే మాత్రం అది పార్టీకి న‌ష్ట‌మే.

క‌ల్లోల సంద్రంలో దారి తెన్ను లేని నావ‌లా పార్టీ ప‌రిస్థితి మారుతుంది. ఇప్పుడు ఏపీలో వైసీపీకి కూడా అదే గ‌తి ప‌ట్ట‌నుందా? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. అధిష్ఠానం త‌మ‌ను మోసం చేసింద‌ని వైసీపీ క్యాడ‌ర్ కోపంతో ఉండ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఆ బ‌లం.. ఇప్పుడు కోపంగా

వైసీపీ పార్టీది ప‌న్నెండేళ్ల ప్ర‌స్థానం. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న‌యుడిగా కొత్త పార్టీ పెట్టిన జ‌గ‌న్ ప్రజ‌ల న‌మ్మ‌కాన్ని గెలుచుకున్నారు. త‌న తండ్రి పేరుతో జ‌నాలను త‌న వైపు తిప్పుకున్నారు. సామాజిక మాధ్య‌మాల్లోనూ బీజేపీ త‌ర్వాత అత్య‌ధిక వాలంటీర్లు ఉన్న‌ది వైసీపీకే. గ‌త ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ సీట్లు.. 22 ఎంపీ స్థానాల‌తో రికార్డు విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చింది.

దేశంలో ఒక రాష్ట్రంలో అత్య‌ధిక ఓట్ల శాతాన్ని పొందిన పార్టీగా రికార్డు సాధించింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ ప‌రిస్థితి మారుతోంది. క్యాడ‌ర్ లేని పార్టీగా మిగిలిపోయే దిశ‌గా సాగుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బూత్ స్థాయి లేని పార్టీగా నిలిచేలా సాగుతోంద‌ని టాక్‌. అందుకు పార్టీ శ్రేణుల‌పై హైక‌మాండ్ నిర్ల‌క్ష్య ధోర‌ణే కార‌ణ‌మ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

ప‌ట్టించుకోని క్యాడ‌ర్‌..

ఇప్పుడు వైసీపీని ఆ పార్టీ క్యాడ‌ర్ పట్టించుకోవ‌డం లేదని తెలిసింది. పీకే టీమ్ స‌ర్వేల‌తో ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. త‌మ‌ను అధిష్ఠానం మోసం చేసింద‌ని కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం. పార్టీ విజ‌యం కోసం రూ.ల‌క్ష‌లు ఖ‌ర్చుప‌ట్టి అన్ని ర‌కాలుగా క‌ష్ట‌ప‌డ్డా ఇప్పుడు హై క‌మాండ్ నుంచి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింద‌నే ఆవేద‌న‌లో క్యాడ‌ర్ ఉంది. అందుకే పార్టీని ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని టాక్‌.

ఇటీవ‌ల పార్టీ 12వ వార్షికోత్స‌వ వేడుక‌ల‌ను క్యాడ‌ర్ అస్స‌లు ప‌ట్టించుకోలేద‌ని తెలిసింది. ఎన్నిక‌లకు ముందు న‌మోదైన కేసుల‌ను కూడా ఇప్ప‌టివ‌ర‌కూ అధిష్ఠానం తొల‌గించేలా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని వాళ్లు కోపంతో ఉన్నార‌ని తెలిసింది. వైఎస్సార్ మీద అభిమానం ఉంది కానీ ఇప్పుడున్న వైసీపీ హైక‌మాండ్ నాయ‌కుల మీద మాత్రం న‌మ్మ‌కం పోయింద‌ని కార్య‌క‌ర్త‌లు తెగేసి చెబుతున్నారంటా. ఇలా అయితే పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్ప‌ద‌నే అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.