Begin typing your search above and press return to search.

మోడీ సార్.. మొత్తానికి మాఫియా పని పడుతున్నాడా?

By:  Tupaki Desk   |   16 Feb 2022 7:31 AM GMT
మోడీ సార్.. మొత్తానికి మాఫియా పని పడుతున్నాడా?
X
కేంద్రంలోని మోడీ సర్కార్ అసాంఘిక శక్తులపై పడింది.ఇన్నాళ్లు రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ, ఈడీ దాడులు చేసి విమర్శలపాలైంది. దేశాన్ని దోచుకుంటున్న వారిపై మిన్నకుండడంపై విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు మాఫియాపై దాడులు మొదలుపెట్టింది. ఈ ధైర్యం చేయడానికి ఎనిమిదేళ్లు పట్టడం విశేషం.

ముంబై అంటేనే మాఫియా.. వాళ్లను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏం చేయలేకపోయింది. ముంబైని ఏలుతున్న మాఫియా సామ్రాజ్యంలోని కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపింది. సంవత్సరాల తరబడి మాఫియా సామ్రాజ్యంలోని కీలక వ్యక్తులు వందలు, వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారు.

ముంబై మాఫియా ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలను బెదిరించి కిడ్నాప్ చేసి హత్యలు చేసి అనుకున్నంత డబ్బును యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మాఫియా వ్యక్తులు పైకి ఏదో వ్యాపారాలు చేస్తున్నట్టు షో చేసి లోపల చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీళ్ల జోలికి ఏ పోలీస్, ప్రభుత్వ పెద్దలు పోవడం లేదు.

కేంద్రంలో, మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దశాబ్ధాలుగా ఈ మాఫియాను అరికట్టలేకపోయారు.వారిని కనీసం టచ్ చేయలేకపోయారు. దీంతో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లాంటి వాళ్లు కొందరు యువత దృష్టిలో హీరోలు అయిపోయారు.

ఇక గతంలో దావూద్ ఇబ్రహీం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మాఫియా అంటే భయమే ఇందుకు కారణం. తాజాగా దావూద్ పై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంచలనం సృష్టించింది. దశాబ్దాలుగా దావూద్ చేసిన నేరాలపై మిన్నకుంటున్న ప్రభుత్వాలు.. తాజాగా కొరఢా ఝలిపించాయి. దావూద్ కు చెందిన లేదా దావూద్ దగ్గరి బంధువులు, మద్దతుదారులుగా గుర్తించిన ఇబ్రహీం కస్కర్, దివంగత హసీనా పార్కర్, చోటా షకీల్ లాంటి వాళ్లకు చెందిన 10 చోట్ల ఈడీ ఉన్నతాధికారుల బృందాలు దాడులు చేశాయి.

దొరికిన ఆధారాల ప్రకారం మనీ ల్యాండరింగ్, హవాలా.. ఎక్స్ టార్షన్ లాంటి అనేక కేసులు నమోదు చేశారు. దేశభద్రత కోసం ిలాంటి దాడులు చేయాల్సిందేనని మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ఈ దాడులను సమర్థించింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత మోడీ సర్కార్ మాఫియాపై ముప్పేట దాడికి దిగడం హాట్ టాపిక్ గా మారింది.