Begin typing your search above and press return to search.

పెద్ద కాపు ఆ పార్టీయేనట...?

By:  Tupaki Desk   |   20 Feb 2022 2:30 AM GMT
పెద్ద కాపు ఆ పార్టీయేనట...?
X
కాపు కాసేది, భుజాన మోసేది మేమే అంటోంది బీజేపీ. ఏపీలో తన రాజకీయానికి అదే సేఫ్ అని కూడా చెబుతోంది. ఏపీలో కాపులు గణనీయంగా ఉన్నారు. ఏకంగా 28 శాతం ఓటు బ్యాంక్ కాపులదే. అలాంటి కాపుల విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే ఆచీ తూచీ అనే చెప్పాలి. దానికి కారణం వారి భయాలు వారివి.

ఏపీలో బీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాపులను చేరదీస్తే బీసీలు దూరం అవుతారు అన్న భయాలు టీడీపీ, వైసీపీలలో ఉన్నాయి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కాపులను బీసీలలో చేరుస్తామని రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరికి అది జరగకపోగా దశాబ్దాలుగా నమ్ముకున్న బీసీలు ఆ పార్టీకి దూరం అయ్యారు.

ఇక ఇచ్చిన హామీని నెరవేర్చలేదని కాపులు కూడా గుర్రు మీద ఉండి వైసీపీకి ఓటేశారు. ఇలా రెండింటికీ చెడిన తీరుగా టీడీపీ 2019లో భారీ ఓటమిని దక్కించుకుంది. దాంతో నాటి నుంచి నేటి వరకూ బాహాటంగా కాపులను ఆ పార్టీ సమర్ధించడంలేదు. ఏది చేసినా తెర వెనకే అన్నట్లుగా ఉంది.

వైసీపీ విషయం సేమ్ డిటో. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే కాపులను బీసీల్లో చేర్చే శక్తి తనకు లేదని, అది తమ చేతిలో లేదని చెప్పేసి బీసీలను దగ్గరకు తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన బీసీలను వదిలే సీన్ లేదు, వారికే పదవులు కట్టబెడుతున్నారు. కాపుల ఓట్లు ఎటూ జనసేన పవన్ కి ఈసారి ఎక్కువ వెళ్తాయని, మిగిలినవే టీడీపీతో కలసి పంచుకోవాలన్న లెక్కలు వైసీపీకి ఉన్నాయి. దాంతో కాపులకు ప్రాధాన్యత ఇస్తూనే బీసీల జపం చేస్తోంది వైసీపీ.

మరో వైపు చూస్తే అందరివాడు ట్యాగ్ తో మురిసిపోవాలనుకుంటున్న పవన్ కళ్యాన్ డైరెక్ట్ గా కాపు కార్డుని అందుకోవాలనుకోవడంలేదు. ఇలా కాపులను ఓపెన్ గా ముందుకు వచ్చి ఓన్ చేసుకోవడానికి ప్రతీ పార్టీకి వారి వ్యూహాల వల్ల వీలు పడడంలేదు. సరిగ్గా దీన్నే ఇపుడు బీజేపీ ఫుల్లుగా వాడుకోవాలనుకుంటోంది. ఏపీలో కాపులకు మేమే అండగా ఉంటామని చెబుతోంది.

ఈ మధ్యనే పార్లమెంట్ లో కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేవనెత్తారు. ఇక కాపులకు ఈబీసీ కోటాలో అయిదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఏపీ బీజేపీ వైసీపీ సర్కార్ ని గట్టిగా డిమాండ్ చేస్తోంది. దానికి మార్చి 15 డెడ్ లైన్ పెట్టింది. ఆ రోజు వరకూ చూస్తామని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఆ పార్టీ చెబుతోంది. మొత్తానికి ఏపీలో పెద్ద కాపులం తామేనని కాషాయ సేన గర్జిస్తోంది. మరి కాపులు బీజేపీ వైపు మొగ్గు చూపుతారా. బీజేపీ లాంటి జాతీయ పార్టీ తమకు మద్దతు ఇస్తే వారు ఈబీసీల రిజర్వేషన్లతోనే సరిపెట్టుకుంటారా లేక బీసీల్లో కాపులను చేర్చే అధికారం మీకే ఉంది కదా ముందు దాని సంగతి తేల్చమని డిమాండ్ చేస్తారా.. చూడాలి మరి.