Begin typing your search above and press return to search.

ప్రధాని రేసులో గడ్కరీ... ?

By:  Tupaki Desk   |   20 Feb 2022 12:30 AM GMT
ప్రధాని రేసులో గడ్కరీ... ?
X
బీజేపీలో ఉద్ధండ నేతలు చాలామంది ఉన్నారు. వారంతా రాజకీయంగా విశేష అనుభవం గడించిన వారే. ఇక నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఎకాఎకీన ప్రధాని అయిపోయారు. అదే ఇతర జాతీయ నాయకులు ఇప్పటికి రెండున్నర దశాబ్దాలుగా బీజేపీలో ఉన్నా అత్యున్నత స్థానం అందుకోలేకపోయారు అన్న బాధ అయితే ఉంది.

ఇదిలా ఉంటే బీజేపీకి వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి అన్నది సందేహం లేని విషయం. ఈ మాట చెప్పడానికి ఎలాంటి సర్వేలు అవసరం లేదు, బీజేపీ ఇప్పటికి రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉంది. మూడవసారి అంటే కచ్చితంగా వ్యతిరేకత చాలానే ఉంటుంది. మహా నేత ఇందిరాగాంధీయే ఆనాటి రాజకీయాల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టలేకపోయారు. నాడు అంత బలంగా కాంగ్రెస్ ఉన్న వేళ, ఆసేతు హిమాచలం ఆ పార్టీ జెండా ఎగురుతున్న వేళనే ఆమె మూడవసారి గెలవలేక 1977లో భారీ ఓటమి చవిచూశారు.

ఇపుడు మోడీ ప్రధానిగా బీజేపీకి ఉన్నారు. ఆయన కనుక ఈ రేర్ ఫీట్ ని సాధిస్తే మాత్రం ఇక కాషాయ పార్టీకి తిరుగు ఉండదనే చెప్పాలి. అయితే బీజేపీకి పూర్తి మెజారిటీ రావడం మాత్రం గగన కుసుమమే. ఆ నేపధ్యంలో మిత్రుల కోసం వెతుక్కోక తప్పదు. అదే సమయంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోతే మిత్రులు సూచించిన వారే ప్రధానిగా బీజేపీ నుంచి అవుతారు. అదే సమయంలో సంఘ్ నిర్ణయం కూడా శిరోధార్యం అవుతుంది.

ఆ విధంగా ఆలోచిస్తే నితిన్ గడ్కరీ బలమైన నేతగా ప్రధాని రేసులో ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన ఆరెస్సెస్ కి బాగా దగ్గర మనిషి అని ముద్ర ఉంది. దానికి తోడు బీజేపీలో మధ్యే వాద నేతగా చెబుతారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు నితిన్ గడ్కరీ ప్రధాని కావాలీ అంటే ముందు కొత్త మిత్రులను సమకూర్చుకోవాల్సి ఉంది. ఆయనకు బీజేపీయేత పార్టీలు, మిత్రులు మద్దతుగా నిలిస్తే సంఘ్ నిర్ణయం కూడా తులసీదళం అవుతుంది. అపుడు దేశానికి ఆయనే మోడీ తరువాత ప్రధాని అవుతారు.

మరి ఇవన్నీ బాగా ఎరిగిన ఈ మరాఠీ రాజకీయ నాయకుడు ఇప్పటి నుంచే మిత్రుల వేట మొదలెట్టారా అన్న చర్చ అయితే ఉంది. తాజాగా గడ్కరీ విజయవాడ టూర్ చూస్తే కొత్త చర్చ కూడా వస్తోంది. ఆయన ఏపీ సీఎం జగన్ని డైనమిక్ లీడర్ అని బాగా పొగిడేశారు. అంతే కాదు జగన్ కోరిన వరాలను వేదిక మీద నుంచే ఇచ్చేశారు. పోలవరం తన ప్రాణం అన్నారు. రైతు బిడ్డగా ఏపీ అభివృద్ధిని గట్టిగా కోరుకుంటున్నాను అని చెప్పారు.

ఇక గడ్కరీ జగన్ ఇంటికి కూడా వెళ్లి చాలా సేపు ఉన్నారు. జగన్ సైతం గడ్కరీతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఇవన్నీ చూసినపుడు 2024 ఎన్నికల వేళ గడ్కరీ కనుక బీజేపీ తరఫున ప్రధాని రేసులో నిలబడితే ఏపీ నుంచి ఆయనకు జగన్ పార్టీ మద్దతు ఇస్తుందా అన్న చర్చ కూడా బయల్దేరింది. ఇక ఢిల్లీలో చూసుకుంటే మోడీ అమిత్ షా జగన్ తో ఎంత బాగా ఉన్నా ఏపీకి సంబంధించి అనేక సమస్యలు పెండింగులోనే ఉన్నాయి.

ఇక జాతీయ రాజకీయ ముఖచిత్రం 2024లో అంచనా వేసుకుంటే బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా అతి పెద్ద పార్టీగా అవతరించడం అయితే ఖాయం. ఏ రెండు వందల సీట్ల దగ్గర బీజేపీ ఆగినా మూడవసారి మోడీని ప్రధానిగా మిత్రులు ఎవరూ అంగీకరించరు. ఆ సమయాన వైసీపీ కనుక ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తే గడ్కరీకి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి గడ్కరీ తాజా ఏపీ టూర్ అయితే కొంత ఆసక్తికరంగానే సాగింది అని చెప్పాలి. జగన్ సైతం ఏ బీజేపీ మంత్రి వద్ద ఇంత చనువుగా లేరని కూడా అంటున్నారు. నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూంటే వేదిక మీద కూర్చుని జగన్ పడి పడి నవ్వడం, ఎంతో సంతోషంగా గడ్కరీ టూర్ లో జగన్ కనిపించడం బట్టి చూస్తూంటే వైసీపీ బీజేపీల మధ్య కొత్త ఈక్వేషన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా అన్న చర్చ అయితే ఉంది మరి.