Begin typing your search above and press return to search.

హన్మకొండ ప్రేమోన్మాది ఎపిసోడ్ చెప్పే పాఠమిది

By:  Tupaki Desk   |   23 April 2022 8:30 AM GMT
హన్మకొండ ప్రేమోన్మాది ఎపిసోడ్ చెప్పే పాఠమిది
X
ప్రేమ బలి కోరుకోదు. ప్రేమ బతుకునివ్వాలని భావిస్తుంది. కానీ.. ఇప్పటితరానికి ప్రేమకు ఉన్మాదానికి తేడా లేకుండా పోతోంది. తమకు దక్కనిది ఎవరికి దక్కకూడదన్న కసి కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. ఇదే అనుకోని ఆరాచకాలకు కారణంగా మారుతూ ఉంటుంది. హన్మకొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ప్రేమోన్మాది చర్య షాకింగ్ గా మారింది. ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్న వాడిని పక్కక పెట్టిన ఒక అమ్మాయి గొంతు కోసేసి.. ఆమె ప్రాణాల మీదకు తీసుకొచ్చిన ఉన్మాది కథను విన్నప్పుడు అప్రయత్నంగానే ఇప్పటి అమ్మాయిలకు ఒక సందేశాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.

అదేమంటే..వరంగల్ జిల్లా సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన 24 ఏళ్ల మహ్మద్ అజహర్ ఐటీఐ పూర్తి చేసి.. రెండేళ్లుగా ఎలాంటి పని లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఒక పెళ్లిలో బాధిత యువతిని చూసి పరిచయం చేసుకున్నాడు. అయితే.. అతడిది తమ అమ్మమ్మ వాళ్ల ఊరు కావటంతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేది. ఇక.. అమ్మాయి విషయానికి వస్తే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన వారు. 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కరీంనగర్ కు వెళ్లింది. వారికి 23 ఏళ్ల కుమార్తె ఉంది. ఎంసీఏ చదువుతోంది. తండ్రి వెల్డింగ్ షాపులో పని చేస్తుంటే.. తల్లి కూలీ పని చేస్తోంది. ఎంసీఏ చేస్తూ పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటోంది.

తనకు పరిచయమైన యువతితో ఫోన్ లో మాట్లాడే అజహర్.. ఆమెకు ప్రేమ మెసేజ్ లు పెట్టేవాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మెసేజ్ లు పంపేవాడు. దీంతో.. తన స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడన్న విషయాన్ని గుర్తించిన ఆమె అతడ్ని దూరం పెట్టింది. తానెంతగానో ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టటాన్ని సహించలేకపోయాడు. తాను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని.. తనను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దని చెప్పటంతో అతడు రగిలిపోయాడు.

తనను దూరం పెడుతుందని కోపానికి గురైన అతడు.. ఆమె మీద కక్ష కట్టాడు. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ నుంచి సదరు యువతి ఇంటికి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న అజహర్.. తన పథకంలో భాగంగా జేబులో కత్తి పెట్టుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. ఉదయం పది గంటల వేళలో ఇంటికి వచ్చిన అతడ్ని చూసిన ఆమె.. ఇంటికి ఎందుకు వచ్చావంటూ నిలదీయటంతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు.

అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో భయపడిన ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచామని.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నారు.ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

ఈ మొత్తం ఉదంతాన్ని చూసినప్పుడు పరిచయమైన వారికి సంబంధించిన వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటం లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అలా అని అమ్మాయిదే తప్పని ఇక్కడ మా ఉద్దేశం కాదు. అబ్బాయి గురించి అవగాహన లేకుండా మాట కలపటం ద్వారా కలిగే ఇబ్బందుల్ని చెప్పటమే ఉద్దేశ్యం. ఏమైనా.. ఇప్పటితరానికి నచ్చింది సొంతం చేసుకోవాలి. లేదంటే అంతమొందిచాలనే దుర్మార్గమైన మైండ్ సెట్ ఉన్న వేళ.. కొత్త స్నేహాల విషయంలో తొందరపాటు ఏ మాత్రం మంచిది కాదని చెప్పక తప్పదు.