Begin typing your search above and press return to search.

పంజాబ్ లో ఆప్ నేర్పిన పాఠాలెన్నో..? ఏపీలోనే కాదు ఎక్కడైనా గుణపాఠాలే అవి..

By:  Tupaki Desk   |   10 March 2022 10:30 AM GMT
పంజాబ్ లో ఆప్ నేర్పిన పాఠాలెన్నో..? ఏపీలోనే కాదు ఎక్కడైనా గుణపాఠాలే అవి..
X
పంజాబ్ లో ఆప్ చీపురు కట్ట తిరగేసి.. ప్రధాన జాతీయ పార్టీలను బాదేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు 20 సీట్ల లోపే వస్తుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి డబుల్ డిజిట్ కూడా దక్కేలా లేదు. దీన్నిబట్టే పంజాబ్ లో ఆప్ ఏ విధంగా స్వీప్ చేస్తోందో తెలిసిపోతోంది. ఢిల్లీ వంటి చిన్న రాష్ట్రంలో.. అధికారాలూ పెద్దగా లేనిచోట.. దానికితోడు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అడ్డంకులు కల్పిస్తున్నచోట.. తనదైన ముద్రతో ఆప్ సర్కారును నడిపి మంచి మార్కులు కొట్టేశారు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. అందరికంటే ముందుగానే, అదికూడా టెలిఫోన్ సర్వే ద్వారా సీఎం అభ్యర్థిని ప్రకటించి ముందుకెళ్లిన ఆప్.. ఆ మేరకు ఫలితాన్ని రాబట్టింది. దిగ్గజాల పంజాబ్ లో చరిత్ర నమోదు చేస్తూ విజయ దుందుభి మోగించింది.

పంజాబ్ ఆషామాషీ ఏం కాదు..

పంబాజ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మురేపింది. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా 91 సీట్లలో ఆధిక్యంలో ఉంటూ వీర విహారం చేస్తోంది. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు ఝలక్ ఇస్తూ.. సత్తా చాటింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తర్వాత మరో రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయబోతోంది. ఓ చిన్న పార్టీగా, అవినీతి కాంగ్రెస్ తో ప్రజలు విసిగిపోయిన సందర్భంలో ఆదర్శాలతో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం అంటే మాటలు కాదు.

పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. లెఫ్టినెంట్ గవర్నర్ ను రాజకీయంగా ఉపయోగించుకుంటూ కేజ్రీ చెవిలో జోరీగలా పోరు పెట్టింది బీజేపీ. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటూ ఆప్ నేతలపై దాడులు చేయించింది. కరోనా కాలంలోనూ ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది. అయినా కేజ్రీవాల్ వీటన్నిటినీ తట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించాలన్న తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

చివరకు ఢిల్లీలో రెండోసారి కూడా అధికారం దక్కించుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీ బయట అధికారం దక్కించుకున్నారు. ఢిల్లీ అంటే పూర్తిగా నగర రాష్ట్రం. అక్కడ ఆప్ గెలిచిందంటే విద్యావంతులు, వ్యాపారులు, యువత కారణంగానే అనుకోవచ్చు. కానీ, పంజాబ్ అలా ఇలా కాదు. వ్యవసాయం, వ్యాపారం దండిగా సాగే రాష్ట్రం. విద్యావంతులూ ఉన్నారు. ధనిక రైతులు, దూకుడైన యవత.. అంతా ఢిల్లీకి భిన్న పరిస్థితులు.

కానీ, దీనిని కూడా అధిగమించి పంజాబ్ లో పాగా వేసింది ఆప్. అంటే.. ఆషామాషీ ఏం కాదు. పంబాజ్ అంటే హరికిషన్ సింగ్ సుర్జీత్ (సీపీఎం), ప్రకాశ్ సింగ్ బాదల్ (అకాళీదళ్) వంటి ఉద్ధండుల రాష్ట్రం. అన్నిటికి మించి ప్రధానమంత్రిగా పదేళ్లు నిరాటంకంగా దేశాన్ని పాలించిన మన్మోహన్ సింగ్ సొంత రాష్ట్రం. అయితే, మన్మోహన్ ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరనుకోండి. అది వేరే విషయం. ఇటీవలి వరకు సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ చరిత్ర కూడా తక్కువే కాదు. అలాంటి పంజాబ్ లో ఆప్ గెలుపంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి తెలిసేదేమంటే.. స్థిరమైన రాజకీయ ఎజెండా, అభివ`ద్ధిపై తనదైన ఆలోచన,రాజకీయాల్లో ఒడిదొడుకులను తట్టుకుంటూ ముందుకెళ్తే పార్టీ ఏదైనా ప్రజాభిమానం చూరగొనడం ఖాయం.

ఏపీలో వీలుందా?

పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ సాధించిన అద్భుతం.. ఏపీలోనూ జరిగే వీలుందా? అంటే కచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏపీలో టీడీపీ, వైసీపీ పాలన ఎలా ఉందో అందరూ చూశారు. మరీ ముఖ్యంగా వైసీపీ సర్కారు తీరును నిశితంగా గమనిస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ చేసినదానితో పోలుస్తూ ప్రస్తావనకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ కాక మూడో పార్టీ ప్రత్యామ్నాయంగా అవతరిస్తే ఆదరించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే, అలా వచ్చే పార్టీ అన్ని అర్హతలు, సామర్థ్యాలతో ఉండాలి. తామేం చేయాలనుకుంటున్నామో విపులంగా ప్రజలకు చెప్పాలి. తమ అభివ`ద్ధి ప్రణాళికలేమిటో..? సంక్షేమ రథాన్ని ఎలా నడిపిస్తారో వివరించాలి. దీనికితగినట్లుగా వారి ప్రణాళికలు ఉండాలి. తమ ఎజెండాతో జనంలోకి చొచ్చుకెళ్లాలి. అదే జరిగితే ఏ పార్టీకి అయినా ఎక్కడయినా అవకాశం ఉంటుంది.