Begin typing your search above and press return to search.

ఎలాన్‌ మస్క్‌ను మించాడు.. అదానీ విశ్వరూపం అంకెల్లో కనిపించింది

By:  Tupaki Desk   |   17 March 2022 2:30 AM GMT
ఎలాన్‌ మస్క్‌ను మించాడు.. అదానీ విశ్వరూపం అంకెల్లో కనిపించింది
X
భారత వ్యాపార రంగంలో సంచలనం అన్నంతనే గుర్తుకు వచ్చేది ముకేశ్ అంబానీ. కానీ.. ఆయన్ను సైతం తోసి రాజన్నట్లుగా వ్యవహరించే సత్తా ఉన్న వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ. వ్యాపార రంగంలో ఆయన సాధించినన్ని రికార్డులు సమీప భవిష్యత్తులో మరెవరికీ సాధ్యం కాదేమో? ఇంతకాలం ఆయన సత్తా గురించి భారతీయులకు బాగా తెలుసు. తొలిసారి ఆయన ఏమిటన్నది ప్రపంచానికే తెలిసేలా చేశారు. సంపద సృష్టిలో ప్రపంచ దిగ్గజం.. అపర కుబేరుడు కమ్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను దాటేసి కొత్త రికార్డును క్రియేట్ చేశారు.

2021లో ఆయన తన సంపదను ఏకంగా 49 బిలియన్ డాలర్లు అంటే.. మన రూపాయిల్లో రూ.3.67 లక్షల కోట్ల మేర పెంచేశాడు. ప్రపంచంలో టాప్ బిలియనీర్లు అయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. ఎల్ వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ లు పెంచుకున్న సంపదతో పోలిస్తే.. అదానీ నెట్ వర్త్ గత ఏడాది ఎక్కువగా ఉన్నట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది.

తాజాగా ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022ను ప్రకటించారు. ఇందులో తాజా విశేషం హైలెట్ గా నిలిచింది. భారత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ మొత్తం 103 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో నిలవగా.. ప్రపంచ ర్యాంకింగ్ లోకి వస్తే తొమ్మిదో స్థానంలో నిలిచారు.

2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన సంపద 24 శాతం పెరిగినట్లుగా గుర్తించారు. అంబానీ తర్వాత అత్యంత సంపన్నుడిగా అదానీ నిలిచారు. ఆయన సంపద గత ఏడాది కాలంలో ఏకంగా 153 శాతం పెరగటం గమనార్హం.

ఇంత భారీగా ప్రపంచంలో మరే వ్యాపార దిగ్గజానికి సాధ్యం కాలేదు. తాజాగా ఆయన సంపద 81 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గడిచిన పదేళ్లలో అంబానీ నికర విలువ 400 శాతం పెరిగితే.. ఇదే సమయంలో అదానీ సంపద 1830 వాతం పెరగటం చూస్తే.. సంపదను పెంచటంలో ఆయన తన విశ్వరూపాన్నే ప్రదర్శించారని చెప్పాలి.

దేశీయంగా చూస్తే.. అత్యంత సంపన్న జాబితాలో హెచ్ సీఎల్ కంపెనీ ప్రమోటర్ శివనాడార్ మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ సంపన్నుల ర్యాంకింగ్ లో చూస్తే మాత్రం 46వ ర్యాంకులో ఆయన నిలిచారు. నాలుగో స్థానంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా.. ఐదో స్థానంలో లక్ష్మీ నివాస్ మిట్టల్ నిలిచారు.