Begin typing your search above and press return to search.

అలీ...ఖాళీగానేనా.. ?

By:  Tupaki Desk   |   1 March 2022 1:30 PM GMT
అలీ...ఖాళీగానేనా.. ?
X
ఆలీతో జాలీగా అంటూ టీవీ షోస్ చేసుకుంటూ సెకండ్ ఇన్నిన్స్ తో ఫుల్ హ్యాపీగా ఆయన ఉన్నారు. ఇక సినిమాల్లో కూడా కమెడియన్ నుంచి హీరోగా ఎదిగి సత్తా చాటారు. అలీకి జనాల్లో మంచి పేరుంది. ఆయన తన వంతుగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే చాన్స్ ఉంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి మరింత ఎక్కువగా ప్రజా సేవ చేయాలని అలీ భావించారు. దానికోసం గతంలో టీడీపీతో సన్నిహితంగా ఉన్నారు. ఇపుడు వైసీపీలో కీలకంగా ఉంటూ వచ్చారు.

ఇదిలా ఉండగా అలీకి మంచి పదవి అని ఈ మధ్య గట్టిగా ప్రచారం జరిగింది. అలీ కూడా సతీసమేతంగా వెళ్ళి మరీ సీఎం జగన్ని కలిశారు. ఈ సందర్భంగా అలీకి గుడ్ న్యూస్ ఉంటుందని అంతా భావించారు. అలీ కూడా మీడియాతో మాట్లాడుతూ ఏ న్యూస్ అయినా మీడియాకే ముందు తెలుస్తుంది అని తన సంతోషాన్ని పంచుకున్నారు. కట్ చేస్తే అలీకి ఇప్పటిదాకా ఏ పదవీ దక్కలేదు.

ఈ మధ్య అంతా జరిగిన ప్రచారం ఏంటి అంటే ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అలీకి ఇస్తారని. తీరా చూస్తే ఆ పదవి కూడా ఇపుడు భర్తీ అయిపోయింది. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ సన్నిహితుడు ఖాదర్ భాషా ఎన్నికయ్యారు. నిజానికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ని ప్రభుత్వం నియమించదు. కేవలం డైరెక్టర్లనే నియమిస్తుంది.

వారే బోర్డు చైర్మన్ ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం అలా ఆరుగురు మెంబర్స్ ని ఈ మధ్య నామినేట్ చేసింది. అంతకు ముందు ముగ్గురు టీడీపీ తరఫున ఉన్నారు. టోటల్ గా చూసుకుంటే తొమ్మిది మంది ఉన్న బోర్డులో మెజారిటీ వైసీపీకి ఉన్నందువల్ల ఖాదర్ భాషాకు చైర్మన్ పదవి దక్కింది.

ఇక అలీకి వక్ఫ్ బోర్డ్ సమావేశానికి ఆహ్వానం అందింది. ఆయన కూడా వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో వెళ్లలేదు. వైసీపీ హై కమాండ్ ఆయన వెళ్ళవద్దని చెప్పి ఉంటుందని అంటున్నారు. అంటే వక్ఫ్ బోర్డు పదవిని అలీకి ఇవ్వడం ఇష్టం లేకనే పార్టీ పెద్దలు ఆపారని అనుకోవాలి.

సరే ఆ పదవి భర్తీ అయిపోయింది. మరి అలీకి ఇంకేముంది అంటే రాజ్యసభ పోస్టు మాత్రమే ఉంది. అయితే అది చాలా పెద్ద పదవి, ఇంకా చెప్పాలీ అంటే ఎంతో మంది కన్నేసిన పోస్ట్ అది. మరి దాన్ని అలీకి ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే రాజు తలచుకుంటే వరాలకు కొదవా అన్నట్లుగా అలీకి ఆ పదవి ఇవ్వవచ్చు.

జూన్ లో నాలుగు రాజ్యసభ ఎంపీ పదవులు ఖాళీ అవుతాయి. అందులో ఒకటి మైనారిటీ కోటాలో ఇవ్వాలీ అనుకుంటే అలీ లక్కీ స్టార్ అవుతారు. అలా కాదు అనుకుంటే మాత్రం ఆయన ఖాళీగానే ఉంటారు. మొత్తానికి అలీ పదవి విషయంలో అయితే సస్పెన్స్ అలా కొనసాగుతోంది అనే అంటున్నారు. చూడాలి మరి అలీని ఏ పదవి వరిస్తుందో. లేక ఏ పదవీ దక్కకుండా ఉండిపోతారో.