Begin typing your search above and press return to search.

బీసీ సీఎం... కొత్త పార్టీ....బాంబు పేల్చిన బావ...?

By:  Tupaki Desk   |   14 March 2022 11:32 AM GMT
బీసీ సీఎం... కొత్త పార్టీ....బాంబు పేల్చిన బావ...?
X
ఏపీకి బీసీ సీఎం రావాలన్న డిమాండ్ ఉందని ప్రముఖ మత ప్రభోదకుడు, బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. విశాఖలో వివిధ సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలతో సహా అణగారిన వర్గాలకు ఇప్పటిదాకా ఏ రకమైన న్యాయం వైసీపీ ఏలుబడిలో అసలు జరగలేదని సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీ విజయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎంతో కృషి చేసాయని గుర్తు చేశారు.

అలాంటి వారు ఇపుడు తమకు తగిన సాయంతో పాటు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రాలో అత్యధిక శాతం బీసీలు ఇతర బడుగు వర్గాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వారి గోడు వినేందుకే తాను ఈ ప్రాంతం వచ్చానని చెప్పుకున్నారు. విశాఖలో వివిధ సామాజిక వర్గాలతో బ్రదర్ అనిల్ సమావేశం నిర్వహించిన అనంతరం వారికి అనేక్స సమస్యలు ఉన్నాయని గుర్తించినట్లుగా చెప్పారు.

అలాగే, ఏ సమస్యలు తీరాలంటే ఏపీలో బీసీలు సీఎం అయితే బాగుంటుంది అన్న డిమాండ్ అయితే ఆయా వర్గాల్లో ఉందని ఆయన బాంబు లాంటి వార్త పేల్చారు. అంతే కాదు, తనను రాజకీయ పార్టీ పెట్టమని వత్తిడి తెస్తున్నారని అని కూడా చెప్పుకున్నారు. అయితే రాజకీయ పార్టీ పెట్టడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదని, అది చాలా కష్టంతో కూడుకున్నదని అంటూనే దాని మీద సుదీర్ఘంగా ఆలోచన చేయాల్సి ఉందని అనిల్ చెప్పడం విశేషం.

ఇక బీసీలు, ఇతర వర్గాలు కలసి రాజకీయంగా ముందుకు అడుగు వెస్తే తాను వారితో ఉంటానని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా ఆయన జగన్ మీద కొన్ని సెటైర్లు కూడా పేల్చారు. తాను జగన్ని కలసి రెండున్నర సంవత్సరాలు అయిందని అన్నారు. జగన్ బాగా బిజీ కదా అందుకే ఈ మధ్య కలవడం పడడం లేదని అనిల్ చెప్పడమూ గమనార్హం.

ఇక తాను బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు మాట ఇచ్చానని, ఇపుడు అవి ఈ ప్రభుత్వంలో నెరవేరడం లేదనే బాధ అన్నారు. ఈ విషయంలో కుదిరితే సీఎం అపాయింట్మెంట్ తీసుకుని సమస్యలు చెబుతానని, లేకపోతే లేఖ రూపంలో వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని ఆయన అన్నారు.

ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అని ఆయన చెప్పడమూ విశేషం. ఎవరు తప్పు చేసినా దొరుకుతారు, సీబీఐ వంటి అత్యుత్తమ సంస్థ ఈ కేసుని టేకప్ చేసింది అంటే కచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. మొత్తానికి ఏపీలో కొత్త పార్టీ, బీసీ సీఎం అని అనిల్ అంటున్నారు అంటే వైసీపీ మీద ఆయన యుద్ధమే ప్రకటించారు అనుకోవాలి.