Begin typing your search above and press return to search.

కాపు స‌మావేశాల వెన‌క ముద్ర‌గ‌డ‌?

By:  Tupaki Desk   |   24 March 2022 7:35 AM GMT
కాపు స‌మావేశాల వెన‌క ముద్ర‌గ‌డ‌?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కాపు సామాజిక వ‌ర్గం కీల‌క పాత్ర పోషిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఎవ‌రు అధికారంలోకి రావాల‌నే నిర్ణ‌యించే స్థాయిలో ఆ సామాజిక వ‌ర్గ ఓట‌ర్లున్నారు. అందుకే ఎన్నిక‌ల‌కు ముందు ఆ సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు రాజ‌కీయ పార్టీలు ప్ర‌య‌త్నిస్తాయి. కానీ ఇటీవ‌ల రాజ్యాధికారం కోసం ఒక్క‌టి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయంతో కాపు నేత‌లు స‌మావేశాలు పెడుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివిధ పార్టీలోని కాపు నేత‌లు పార్టీల‌కు అతీతంగా ఈ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. కాపు సామాజిక వ‌ర్గాన్ని ఒక్క‌తాటిపైకి తెస్తే రాజ్యాధికారం ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాద‌న్న ఆలోచ‌న‌తో ఆ నేత‌లున్న‌ట్లు తెలిసింది.

అయితే ఈ కాపు స‌మావేశాల వెన‌క కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్యమ పోరాట స‌మితి నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీ హ‌యాంలో కాపు రిజర్వేష‌న్ల కోసం ఆయ‌న పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగ‌తి తెలిసిందే. బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కానీ అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చ‌ర్య‌ల కార‌ణంగా త‌న కుటుంబంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల వ‌ల్ల ఆయ‌న ఉద్యమం నుంచి త‌ప్పుకున్నార‌నే అభిప్రాయాలున్నాయి. ఆయ‌న ఉద్య‌మం నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ కాపుల ప్ర‌యోజ‌నాల కోసం ముఖ్య‌మంత్రికి, ప్ర‌ధాన మంత్రికి లేఖ‌లు రాస్తూనే ఉన్నారు.

మ‌రోవైపు రాజ్యాధికారం కావాల‌న్న ఏకైక డిమాండ్‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న కాపు నేత‌ల వెన‌క ముద్ర‌గ‌డ ఉన్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ కాపు నేత‌ల‌కు ముద్ర‌గ‌డ ప‌రోక్షంగా స‌ల‌హాలు, సూచ‌న‌లు అందిస్తున్న‌ట్లు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి యాక్టివ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వివిధ పార్టీల నుంచి ఆయ‌కు ఆహ్వానాలు అందిన‌ట్లు స‌మాచారం. ఓ ప్ర‌ధాన జాతీయ పార్టీ ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించినా ముద్ర‌గ‌డ సున్నితంగా తిర‌స్క‌రించార‌ని టాక్‌. మ‌రో ప్రాంతీయ పార్టీ ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేస్తే ఆయ‌న ఒప్పుకోలేద‌ని అంటున్నారు.

ఇక ఇటీవ‌ల కాపుల‌ను ఒక‌వైపు తీసుకుపోయే విధంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ముద్ర‌గ‌డ భావిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా కాపు ఓటు బ్యాంకు మారే అవ‌కాశం ఉంద‌ని అనుకుంటున్న ఆయ‌న ఆ విష‌యంపై కాపు పెద్ద‌ల‌తో మాట్లాడార‌ని తెలిసింది. గ‌తంలో మోసం చేసిన చంద్ర‌బాబుకు మ‌రోసారి మ‌ద్ద‌తు ఇవ్వొద్ద‌నే ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నార‌ని అంటున్నారు. కాపులు ఒక‌టైతే రాజ్యాధికారం ద‌క్కుతుంద‌నే భావ‌న‌తో ఆయ‌న ఉన్నారు.

కాబట్టి తాత్కాలిక ప్ర‌లోభాల‌కు గురై కొన్ని పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే మ‌రోసారి కాపుల ప్ర‌యోజ‌నాల కోసం ఆయ‌న రంగంలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.