Begin typing your search above and press return to search.

జిల్లాల బాధ్య‌త మంత్రుల‌కు.. గెలిపించే వ్యూహాలు ఎంపీల‌కు.. వైసీపీలో గుస‌గుస‌

By:  Tupaki Desk   |   27 March 2022 3:30 AM GMT
జిల్లాల బాధ్య‌త మంత్రుల‌కు.. గెలిపించే వ్యూహాలు ఎంపీల‌కు.. వైసీపీలో గుస‌గుస‌
X
ఏపీ అధికార పార్టీలో రాజ‌కీయ వ్యూహాలు రోజు రోజుకు మారుతున్నాయా? వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే పార్టీ అధిష్టానం.. ప‌దునైనై వ్యూహాలో ముందుకు వెళ్లాల‌ని భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు తాడేప‌ల్లి ప్ర‌ముఖులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం అనేది వైసీపీకి అత్యంత కీల‌కం. ఈ నేప‌థ్యంలో దీనికి అనుగుణంగానే.. బాధ్య‌త‌ల‌ను వికేంద్రీక‌రించే ప‌నిని ఇప్ప‌టి నుంచే ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల‌.. కొత్త‌గా ఏర్ప‌డే జిల్లాల‌కు త్వ‌ర‌లో మాజీలు అయ్యే మంత్రుల‌ను నియ‌మిస్తామ‌ని.. జిల్లాల్లో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్య‌త వారిదేన‌ని.. సీఎం జ‌గ‌న్ తేల్చిచెప్పారు.

అయితే.. దీనికి కొన‌సాగింపుగా సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేసే బాధ్య‌త‌ల‌ను.. మాజీ మంత్రుల‌కు అప్ప‌గించి.. పార్టీని గెలిపించే బాధ్య‌ల‌ను ఎంపీల‌కు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నారు. ఇటీవ‌ల ఉత్త‌రప్ర‌దేశ్‌లో(యూపీ) అధికార బీజేపీ మ‌రోసారి గెలుపు గుర్రం ఎక్కింది. వాస్త‌వానికి యూపీ చ‌రిత్రలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ కూడా వ‌రుస‌గా అధికారం ద‌క్కించుకున్నది లేదు. ప్ర‌స్తుతం యోగి ఆదిత్య‌నాథ్ హ‌యాంలో బీజేపీనే రెండో సారి వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చింది. అయితే.. ఈ విజ‌యానికి ప్ర‌ధానంగా బీజేపీ ఎంపీలు కీల‌కంగా ప‌నిచేశారు.

పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు భారీ సంఖ్య‌లో ఉన్న బీజేపీ ఎంపీల కృషిని మ‌ర‌వ‌లేం. ప్ర‌తి ఎంపీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేశారు. ఎండ‌న‌క‌, వాన‌న‌క‌.. నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ దిరిగా రు. ప్ర‌భుత్వ పథ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అదేవిధంగా మంత్రులు కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగాతీసుకుని ముందుకు సాగారు.

ప‌లితంగా బీజేపీ రెండో సారి వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకుంద‌నేది జాతీయ స్థాయిలో వ‌చ్చిన విశ్లేష‌ణ‌లను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీ విష‌యంలోనూ ఎంపీలు కీల‌కంగా మార‌నున్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

రాష్ట్రం మొత్తంమీద కాన్సంట్రేష‌న్ చేసే బ‌దులు... త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ప‌రుగులు పెట్టించేందుకు కృషి చేస్తే. యూపీలో వ‌చ్చిన ఫ‌లిత‌మే వైసీపీకి కూడా ద‌క్కుతుంద‌ని సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌గా ఉంద‌ని సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు. ప్ర‌స్తుతం ఎంపీలు ఎవ‌రూ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డం లేద‌నే కామెంట్లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఎంపీలు.. ఇక నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టి... నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డంతోపాటు.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న‌ని అంటున్నారు. యూపీ ఫార్ములాను అనుస‌రిస్తే.. ఇక‌, ఏపీలోనూ వైసీపీకి తిరుగులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు.. జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు మాజీల‌య్యే మంత్రులు, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంపీలు కృషి చేయాల్సి ఉంటుంద‌న్న మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.