Begin typing your search above and press return to search.

మాజీ మిత్రుడుతో మంత్రి గారు... ?

By:  Tupaki Desk   |   13 March 2022 12:30 PM GMT
మాజీ మిత్రుడుతో  మంత్రి గారు... ?
X
విశాఖ జిల్లా రాజకీయాల్లో ఏకైక మంత్రిగా వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన రాజకీయ అరంగేట్రం ప్రజారాజ్యం పార్టీ ద్వారా 2009 ఎన్నికల్లో జరిగింది. ఫస్ట్ టైమ్ లోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆనక కాంగ్రెస్ లోకి వెళ్ళి అటునుంచి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల వేళ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన అవంతి 2019 నాటికి భీమిలీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అది కుదరకపోవడంతో ఆయన ఒక్కసారిగా పార్టీ మార్చేశారు.

ఇక అవంతి రాజకీయ రంగ ప్రవేశం వెనక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు అన్నది తెలిసిందే. గంటా ప్రోద్బలంతోనే అవంతి ఎమ్మెల్యేగా చట్టసభల్లోకి వచ్చారు. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. అయితే కేవలం భీమిలీ సీటు విషయమే ఈ ఇద్దరు మధ్య ఉన్న స్నేహానికి చిచ్చు పెట్టింది. ఆ మీదట అవంతి వైసీపీలోకి సడెన్ గా వెళ్ళి గంటాకు షాక్ ఇచ్చేశారు. నిజానికి అంతా కలసి నాడు వైసీపీలోకి వెళ్లాలి అన్నది గంటా ప్లాన్ అని కూడా ప్రచారంలో ఉంది.

గంటాతో వెళ్తే మళ్లీ భీమిలీ సీటు దక్కదు, ఒకవేళ దక్కినా జస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వస్తుందన్న ఆలోచనతో అవంతి డేర్ చేసి వైసీపీ పెద్దలకు టచ్ లోకి వచ్చారని చెబుతారు. మొత్తానికి అవంతి పొలిటికల్ స్కెచ్ హిట్ అయి మంత్రి కూడా అయిపోయారు. ఇక మంత్రిగా అయిన తొలిరోజుల్లో ఆయన గంటాను టార్గెట్ చేసి హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు.

అధినాయకత్వం మెప్పు పొందడం కోసంతో పాటు, తాను కూడా జిల్లాలో చక్రం తిప్పగలను అని నిరూపించుకోవడానికి అవంతి అలా పెద్ద నోరు చేసేవారు అంటారు. అయితే తరువాత కాలంలో విశాఖ జిల్లాలో మంత్రిగా తన సీటు కంటే కూడా ఎంపీ విజయసాయిరెడ్డి హవాయే ఎక్కువగా సాగడంతో అవంతి కొంత అసంతృప్తికి లోను అయ్యారు. ఒక దశలో ఆయన అలక పానుపు కూడా ఎక్కారు.

మొత్తానికి ఎన్ని చేసినా జిల్లా మంత్రిగా పట్టు అయితే సాధించలేకపోయారు. దాంతో చాలాకాలంగా ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు. ఇక నాడు గంటాని టార్గెట్ చేసి కామెంట్స్ చేసిన అవంతి ఇపుడు మాత్రం ఆ వూసే లేకుండా కాలం నెట్టుకొస్తున్నారు. పైగా గంటా పట్ల మునుపటి ప్రేమను కూడా కనబరుస్తున్నారు అని ప్రచారం అయితే ఉంది. మరి గంటా అయితే ఓడినా కూడా జిల్లా రాజకీయాలలో తనదైన మార్క్ ని చాటుకుంటూ వస్తున్నారు.

ఆయన రీసెంట్ గా విశాఖలో కాపుల మీటింగు పేరిట హైలెట్ అయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తన హవా చాటుకోవాలని చూస్తున్నారు. మాజీ ప్రజారాజ్యం మిత్రులను కూడా ఆయన కలుసుకుంటూ ఒక చోటకు చేర్చే పనిలో ఉన్నారని ప్రచారంలో ఉంది. మరి ఆ విధంగా చూస్తే అవంతి మౌనానికి గంటా దూకుడుకీ మధ్య ఏమైనా జరుగుతోందా అన్న చర్చ అయితే బయల్దేరింది.

ఏది ఏమైనా రాజకీయాల్లో ఎవరు ఎపుడు ఎలా ఉంటారో తెలియదు. అందువల్ల ఒకనాటి మిత్రులు అయినా ఈ ఇద్దరూ ఫ్యూచర్ లో కలవకపోతారా అన్నదే చర్చ. తొందరలో మంత్రి పదవి కూడా పోతే అవంతి మరింత ఫ్రీ అవుతారని, అపుడు ఆయన వేసే అడుగులే ఆసక్తికరంగా ఉంటాయని ప్రచారం అయితే ఉంది. చూడాలి మరి ఇది ఎంత వరకూ నిజమో.