Begin typing your search above and press return to search.

అయ్యన్న అన్ స్టాపబుల్... ఇరిటేషన్ పెరిగిపోతోందిగా...?

By:  Tupaki Desk   |   22 Feb 2022 10:38 AM GMT
అయ్యన్న అన్ స్టాపబుల్... ఇరిటేషన్  పెరిగిపోతోందిగా...?
X
టీడీపీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దూకుడు వైసీపీ పెద్దలకు చికాకుగా ఉంటోంది. ఇరిటేషన్ కూడా కలిగిస్తోంది. ఒక దశలో ఆయనని నిలువరించాలని చూసినా వీలు కావడంలేదు. టీడీపీలో ఎంతో మంది లీడర్లు ఉన్నారు. వారి ధోరణి వేరు. అయ్యన్న మాత్రం ఎక్కడా తగ్గరు. ఆయన జోరుకు ఎవరైనా జోహారు అనాల్సిందే.

ఆరున్నర పదుల వయసులో కూడా పైలా పచ్చీస్ మాదిరిగా పాలిటిక్స్ లో స్పీడ్ పెంచడం అయ్యన్నకే సాధ్యం. ఆయన డైరెక్ట్ గా జగన్నే అంటారు. వారూ వీరూ ఎందుకు అంటూ తుగ్లక్ ముఖ్యమంత్రి అని పేరు పెట్టి మరీ జగన్ని విమర్శిస్తారు. తానే ఆ పేరు జగన్ కి పెట్టానని గొప్పగా చెప్పుకుంటారు. చెత్త పన్నులు వేస్తే వైసీపీ నేతలను చెత్తగానే విమర్శలు చేస్తామంటూ అయ్యన్న బిగ్ సౌండ్ చేసినా ఆపడం ఎవరి తరమూ కావడం లేదు.

ఆయన బహిరంగ సభ అయినా మీడియా సమావేశం అయినా కార్యకర్తల మీటింగ్ అయినా కూడా వైసీపీ సర్కార్ మీద గట్టిగానే కామెంట్స్ చేస్తారు. అవి హాట్ హాట్ గా ఉంటాయి. క్షణాల్లో వైరల్ అవుతాయి. ఆ మీదట వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు పెడతారు, అయినా బేఫికర్ అంటారు ఈ సీనియర్ మాజీ మంత్రి.

లేటెస్ట్ గా జగన్ ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు అయింది. నల్లజర్లలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న‌ అక్కడ జరిగిన సభలో జగన్ ను దుర్భాషలాడారంటూ వైసీపీ నేత రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతే కాదు గతంలో హోం మంత్రి మేకతోటి సుచరితను దూషించారంటూ కేసు నమోదు అప్పట్లో ఫైల్ చేశారు.

విషయానికి వస్తే నల్లజర్ల సభలో జగన్ ను దూషిస్తూ అయ్యన్నపాత్రుడు మాట్లాడారన్న కారణంతో అయ్యన్నపై ఐపీసీ సెక్షన్లు 153 ఏ, 505 (2), 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సరే ఇలాంటి కేసులకు అసలు భయపడేది లేదు అని అయ్యన్న సహా ఆయన అనుచరులు చాలా సార్లు చెప్పశారు. అప్పట్లో అయ్యన్నను అరెస్ట్ చేయాలని చూసినా ఆయన స్టే తెచ్చుకున్నారు.

టీడీపీలో ఎంతో మంది నాయకులకు జైలు దారి చూపించిన వైసెపీ సర్కార్ పెద్దలకు అయ్యన్న ఒక విధంగా కొరకరాని కొయ్యగానే ఉన్నారు అంటున్నారు. అయ్యన్న మీద కేసులు పెడితే ఆయన తగ్గుతారా. ఆయన నోరు ఆగుతుందా తగ్గేదే లే అన్నదే తమ్ముళ్ళ మాట. అయ్యన్న దూకుడుని ఆపడం ఎవరి తరం కాదని ఆయన అన్ స్టాబబుల్ అని తమ్ముళ్ళు గొప్పగా చెబుతున్నారు. మొత్తానికి మూడేళ్ళ వైసీపీ పాలనలో రాజకీయంగా కొరుకుడు పడని బిగ్ ఫిగర్ ఎవరైనా ఉన్నారూ అంటే అది అయ్యన్నపాత్రుడే అని గట్టిగా చెప్పేయవచ్చు అంటున్నారు.