Begin typing your search above and press return to search.

సీఎం జగన్ దగ్గర బాలినేనికి ఇంత చనువు ఉందా?

By:  Tupaki Desk   |   12 March 2022 11:30 AM GMT
సీఎం జగన్ దగ్గర బాలినేనికి ఇంత చనువు ఉందా?
X
వయసులో చిన్నోడు కావొచ్చు. కానీ.. కోట్లాది ప్రజల మద్దతు ఉన్న అధినేత విషయంలో ఎంతటి తోపు సీనియర్ అయినా కాస్తంత తగ్గి ఉండాల్సిందే. ఎందుకంటేఅంతటి సీనియర్ నేతకు సైతం పదవి దొరికేది .. అధినేత ఛరిష్మాతోనే. అందుకే.. అధినేత అంటే వయసుతో సంబంధం లేకుండా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు నేతలు. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వయసు.. రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ఆయన మంత్రి వర్గంలోని చాలా మంది మంత్రులతో పోలిస్తే ఆయన చాలా జూనియర్. కానీ.. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారంతా జగన్ కున్న చరిష్మాతోనే పదవుల్లో ఉన్నారన్నది నిజం.

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టే వేళ.. తనతో కలిసి నడిచే వచ్చే నేతల కోసం ఎదురు చూశారు జగన్. ఆయన్ను నమ్మి బయటకు వచ్చిన వారితో చాలానే స్వేచ్ఛ.. స్వతంత్రం ఉందని భావిస్తాం. కానీ.. అధికారంలో అలాంటివన్నింటిని మర్చేస్తుంది. అధినేత ఎప్పటికి అధినేతే. ఆయనతో తమకు ఎంత చనువు ఉన్నా.. నలుగురి ముందు ఏదైనా విషయాన్ని ప్రస్తావించాలంటే వంద ఆలోచిస్తారే కానీ.. నోట్లో నుంచి మాట రావటానికి పెద్ద ఇష్టం చూపించరు. అందులోని జగన్ లాంటి ప్రజాకర్షక అధినేత విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు.

ఏపీ మంత్రి వర్గాన్ని రెండున్నరేళ్లలో మారుస్తామని చెప్పటం.. దానిపై తరచూ ఏపీ మంత్రుల మధ్య చర్చ జరగటం.. తమ పదవి ఉండేది ఇంకెన్ని రోజులో అన్న మాట తమ సహచరులతో చెప్పుకొని.. దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? అన్న మాటలు తరచూ జరుగుతుంటాయి. కాస్తంత ధైర్యం చేసి.. అధినేతనే నేరుగా.. కొత్త టీం విషయం మీద తమకున్న క్వశ్చన్లు అడుగుతారా? అంటే అంత ధైర్యం చేయలేని పరిస్థితి. దీంతో.. ఏం జరుగుతుందో అర్థం కాక తల్లడిల్లిపోతున్న మంత్రులు చాలామందే ఉన్నారు.

ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన మంత్రివర్గ భేటీ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాస్తంత చనువు తీసుకొని సీఎం జగన్ తో ముచ్చట పెట్టేశారు. బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో తాను చేసిన వ్యాఖ్యల్ని సీఎంకు చెప్పేశారు.

ఈ బడ్జెట్ కు బుగ్గనను తాను కోటు వేసుకొని రావాలని చెప్పానని.. ఎందుకంటే చివరిసారిగా నిన్ను కోటులో చేసేవాళ్లమని చెప్పానని.. వచ్చే బడ్జెట్ ను నువ్వు చదువుతావో.. లేదో? అని తాను అన్నట్లుగా బాలినేని పేర్కొన్నారు. రెండున్నరేళ్లకు టీంను మార్చేస్తానని సీఎం చెప్పిన నేపథ్యంలో బాలినేని నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి.

దీనికి స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. "మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు? రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మారుస్తామని మొదట్లోనే చెప్పా కదా? మంత్రులుగా ఇప్పుడు మీకు మూడేళ్ల అనుభవం వచ్చింది. మీకు పార్టీ బాధ్యతల్ని అప్పగిస్తే సమర్థంగా నిర్వహిస్తారు. అదేదో మిమ్మల్ని తక్కువ చేసినట్లు కాదు" అని జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా చూసినప్పుడు.. ముఖ్యమంత్రి జగన్ వద్ద మంత్రుల్లో ఎవరికీ లేనంత చనువు మంత్రి బాలినేనికి ఉన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమైంది.