Begin typing your search above and press return to search.

బొత్స రూటే సెప‌రేటు ? తిరుగులేదిక !

By:  Tupaki Desk   |   11 April 2022 6:30 AM GMT
బొత్స రూటే సెప‌రేటు ? తిరుగులేదిక !
X
మంత్రి బొత్స రూటే సెప‌రేటు..కానీ ఆయ‌న బొబ్బిలి రాజులంటే భ‌యం. వారి జోలికి మాత్రం వెళ్ల‌రు. విజ‌య‌న‌గ‌రం రాజులంటే ఇష్టం. అందుకే పార్టీలు వేర‌యినా వారితో స‌ఖ్య‌త‌తో ఉంటారు. మొన్న‌టిదాకా కోల‌గ‌ట్ల (కోమ‌టి సామాజిక‌వ‌ర్గ నేత, డిప్యూటీ స్పీక‌ర్) అంటే దిగ్గున లేచేవారు. కానీ ఆ మ‌ధ్య ఆయ‌న‌తో రాజీ అయ్యారు. అల్లుడు చిన్న శ్రీ‌ను ఒక‌ప్పుడు అన్నీ తానై న‌డిపారు. కానీ ఇప్పుడు ఆయ‌న కూడా బొత్స‌కు వ్య‌తిరేకంగా పావులు కదుపుతూ జెడ్పీ చైర్మ‌న్ హోదాలో జిల్లా రాజ‌కీయాల‌ను బొత్స స్థాయిలో శాసించేందుకు త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. అయినా స‌రే బొత్స హ‌వా ముందు చిన్న శ్రీ‌ను నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మే! కానీ ఇంటి గుట్టు తెలిసిన శ్రీ‌ను త‌న‌కు ప్ర‌మాద‌మే అన్న భావ‌న‌ను బొత్స ఎప్పుడో గుర్తించారు అన్న‌ది ఆయ‌న స‌న్నిహితుల మాట.

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఓ ప్ర‌త్యేక స్థానం బొత్స‌ది. వైఎస్సార్ హ‌యాం నుంచి ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర‌కూ ఆ రోజు ఈ రోజు త‌న మాట నెగ్గించుకున్న ఏకైక మంత్రి. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో మంచి ప‌ట్టున్న నాయ‌కుడు. మాస్ లీడ‌ర్. అనుకున్న‌ది అనుకున్న విధంగా చేయించ‌గ‌ల స‌మ‌ర్థులు. కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆయ‌న వెన‌క్కు త‌గ్గ‌రు. కీల‌క కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌గా పేరున్న బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌ళ్లీ క్యాబినెట్ లో బెర్తు ద‌క్కించుకున్నారు. అంటే దేవుడు త‌థాస్తు అని అన్నాడ‌న్న‌ది నిజం. ఆయ‌న అన్న మాటే.. దేవుడిపైనే భారం వేశాను.. ఆయ‌న త‌థాస్తు అంటే ప‌ద‌వి మ‌ళ్లీ వ‌స్తుంది లేదంటే లేదు అని! ఏమో రెవెన్యూ శాఖ అప్ప‌గిస్తారేమో అన్న ఊహాగానాలూ ఉన్నాయి.

బొత్స చేతిలో ఉమ్మ‌డి విజ‌య‌గ‌రం జిల్లా మొత్తం ఉంది. తొమ్మిది నియోజ‌క వ‌ర్గాల్లోనూ ఆయ‌న మాట చెల్లుతుంది. ఆయ‌న మాట అక్కడ శాస‌నంగా వ‌ర్థిల్లిన రోజులున్నాయి. అయితే అమ‌రావ‌తి విష‌య‌మై ఆయ‌న చెప్పిన మాట‌లు మాత్రం ఎన్నో వివాదాలు తావిచ్చాయి.. ఇక్క‌డేముంది చూడ్డానికి స్మ‌శానం త‌ప్ప అని వ్యాఖ్యానించి ఆఖరికి ఎంద‌రో ఆగ్ర‌హాన్ని చ‌వి చూసినా కూడా క‌నీసం క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్ప‌లేదు.

దీంతో రాజ‌ధాని రైతులు ఇప్ప‌టికీ ఆయ‌నపై ఆగ్ర‌హంగానే ఉన్నారు. విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా అభివృద్ధి ప‌నులు ఇప్ప‌టిదాకా ఆయ‌నేమీ చేప‌ట్ట‌లేద‌ని సొంత నియోజ‌క‌వ‌ర్గం చీపురుప‌ల్లికి రెవెన్యూ డివిజన్ రావ‌డం ప‌ట్ల కూడా టీడీపీ కృషి ఉంది కానీ బొత్స చేసిందేమీ లేదు అని ఇప్ప‌టికీ విప‌క్షాలు గొంతెత్తుతున్నాయి.

గ‌తంలో లిక్క‌ర్ వ్యాపారం చేశార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. అదేవిధంగా అశోక్ గ‌జ‌ప‌తి రాజుతో మంచి సంబంధాలు ఉన్నాయి. రామ‌తీర్థం గొడ‌వ‌లో రాములోరి విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌లో బొత్స అస్స‌లు హోదాకు త‌గ్గ విధంగా మాట్లాడ‌లేక‌పోయారు. పునః ప్ర‌తిష్ట స‌మ‌యంలో అశోక్ ను వెల్లంప‌ల్లి అవ‌మానించినా అడ్డుకోలేక‌పోయారు.

ఇవాళ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ (అప్ప‌టి దేవాదాయ శాఖ మంత్రి) లేరు కానీ ఆయ‌న ప్ర‌వ‌ర్తన అన్న‌ది ఎన్న‌టికీ చ‌రిత్ర‌లో న‌మోదు అయి ఉంటుంది. అదేవిధంగా ప‌లు సంద‌ర్భాల్లో బొత్స మాట్లాడిన మాట‌లు వివాదాల‌కు తావిచ్చాయి. ఇక‌పై అయినా ఆయ‌న కాస్త ఆచితూచి మాట్లాడితే రాజ‌కీయాల్లో హుందాత‌నం పెరుగుతుంది.