Begin typing your search above and press return to search.

ఢిల్లీలో భూకంపం తప్పదా ?

By:  Tupaki Desk   |   12 April 2022 6:30 AM GMT
ఢిల్లీలో భూకంపం తప్పదా ?
X
వడ్ల రాజకీయంలో భాగంగా ఢిల్లీలో 24 గంటల తర్వాత భూకంపం తప్పదా ? ఏమో కేసీయార్ వైఖరి, హెచ్చరికలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. యాసంగిలో తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే అనే డిమాండ్ తో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పెద్ద ధర్నా జరిగింది. తెలంగాణతో పాటు అన్నీ రాష్ట్రాల్లో పండిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొని తీరాల్సిందే అని కేసీయార్ డిమాండ్ చేశారు.

ఒకవేళ కేంద్రం గనుక ధాన్యాన్ని కొనకపోతే 24 గంటల తర్వాత ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానంటు నరేంద్రమోడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. దాదాపు అర్ధగంట సేపు హిందీలోనే మాట్లాడిన కేసీయార్ కేంద్ర ప్రభుత్వానికి చాలా వార్నింగులే ఇచ్చారు. అయితే కేంద్రం మాత్రం కేసీయార్ ను చాలా సింపుల్ గా తీసుకుంది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని తెగేసి చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ధాన్యం అంటే కేసీయార్ ఉద్దేశ్యంలో బాయిల్డ్ రైస్ అనే.

కేంద్రం ఉద్దేశ్యంలో రైస్ అంటే రా రైస్ అని. బాయిల్డ్ రైస్ కొనటాన్ని కేంద్రం ఎప్పుడో నిలిపేసింది. ఇదే విషయాన్ని అన్నీ రాష్ట్రాలకు చెప్పింది కూడా. అయితే కేసీయార్ మాత్రం తెలంగాణా నుండి బాయిల్డ్ రైస్ కొనితీరాల్సిందే అని మొండి పట్టుపట్టారు.

దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా బాయిల్డ్ రైస్ కు డిమాండ్ లేని కారణంగా తాము బాయిల్డ్ రైస్ కొనటం లేదని కేంద్రం స్పష్టంగానే చెప్పింది. అయినా కేసీయార్ వినిపించుకోవడం లేదు.

ఏదేమైనా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే కాబట్టి ఈ విషయంలో కేసీయార్ చేయగలిగేదేమీలేదు. ఇదే విషయంపై కేంద్రం-తెలంగాణా మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది.

రైతులు పండించిన ధాన్యాన్ని ఏమి చేయాలో అర్ధంకాక, బాయిల్డ్ రైస్ కొని ఏమి చేసుకోవాలో తెలీకే కేసీయార్ కేంద్రంపై గోల చేస్తున్నట్లు లోకల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో వార్నింగ్ ఇచ్చిన ఫలితంగా 24 గంటల తర్వాత కేసీయార్ ఎలాంటి భూకంపాన్ని సృష్టిస్తారో చూడాల్సిందే.