Begin typing your search above and press return to search.

15 మందిపై వేటు.. ఇదే జ‌గ‌న్ రూటు

By:  Tupaki Desk   |   13 March 2022 11:30 PM GMT
15 మందిపై వేటు.. ఇదే జ‌గ‌న్ రూటు
X
మంత్రి ప‌ద‌వులు ఊడే నాయ‌కులు ఎవ‌రు? కొత్త‌గా జ‌గ‌న్ కేబినేట్‌లో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంది? ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఇవే చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. కేబినేట్ స‌మావేశంలో జ‌గ‌న్ స్వ‌యంగా ఈ మాట చెప్ప‌డంతో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

కానీ కేబినేట్ విస్త‌ర‌ణ ఎప్పుడు ఉంటుందో మాత్రం జ‌గ‌న్ చెప్ప‌లేదు. ఉగాది నాటికి ఉంటుంద‌ని కొంత‌మంది.. మూడేళ్ల ప‌ద‌వీ కాలం పూర్త‌యిన త‌ర్వాత అంటే జూన్ త‌ర్వాత ఉంటుంద‌ని మరి కొంత‌మంది చెబుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన సీఎం జ‌గ‌న్ పార్టీపై ఫోక‌స్ పెట్టారు. అందుకే వైసీపీ ప్లీన‌రీని ఘ‌నంగా నిర్వ‌హించాల‌నుకుంటున్నారు. జూన్ లేదా జులైలో ఆ ప్లీన‌రీ ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్లీన‌రీ కంటే ముందే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

మ‌రోవైపు ప్ర‌స్తుతం ఉన్న మంత్రివ‌ర్గంలో దాదాపు 90 శాతం మందిని త‌ప్పించ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే జిల్లాల వారీగా, సామాజిక వ‌ర్గాల వారీగా క‌స‌ర‌త్తులు పూర్తి చేసిన జ‌గ‌న్ తుది జాబితా సిద్ధం చేసుకున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

పార్టీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు ప్ర‌స్తుతం ఉన్న 19 మంది మంత్రుల్లో 15 మందిపై వేటు ప‌డుతుంద‌ని తెలిసింది. బొత్స స‌త్యానారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని మిన‌హా మిగ‌తా అంద‌రినీ జ‌గ‌న్ తొల‌గిస్తార‌ని చెబుతున్నారు. వాళ్ల స్థానాల్లో కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చి వచ్చే ఎన్నిక‌ల‌కు తాజాగా వెళ్లాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

మ‌రోవైపు ఉద్వాస‌న‌కు గురైన మంత్రుల‌కు జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించి పార్టీని బ‌లోపేతం చేసేందుకు వాళ్ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని జ‌గ‌న్ చూస్తున్నారు. మ‌రి వేటు ఎవ‌రిపై ప‌డుతుందో? వేచి చూడాలి.