Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లో టీడీపీ నేత‌లు.. ఇదే బాబు మాస్ట‌ర్ ప్లాన్‌!

By:  Tupaki Desk   |   17 March 2022 5:28 AM GMT
జ‌న‌సేన‌లో టీడీపీ నేత‌లు.. ఇదే బాబు మాస్ట‌ర్ ప్లాన్‌!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విప‌క్షాల‌న్నీ ఓ కూటమిగా ఏర్పాడే సూచ‌న‌లు ఇప్ప‌టి నుంచే క‌నిపిస్తున్నాయి. తాజాగా జ‌న‌సేన 9వ ఆవిర్భావ స‌భ‌లో ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు కూట‌మి ఏర్పాటుకు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. సొంత ప్ర‌యోజ‌నాల‌ను వ‌దిలి రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం కలిసి వ‌చ్చే పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటామ‌ని జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విప‌క్షాలు క‌లిసే అవ‌కాశం ఉంది. క‌నీసం జ‌న‌సేన‌, టీడీపీ అయినా క‌లిసే పోటీ చేస్తార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

2014 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న జ‌న‌సేన‌.. టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు 2024 ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీతో బంధాన్ని కోరుకోవ‌డం లేదు.

కానీ బీజేపీ క‌లిసి వ‌చ్చినా రాక‌పోయినా జ‌న‌సేన‌, టీడీపీ ఒక్క‌ట‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన ఎన్నెన్ని సీట్ల‌లో పోటీ చేస్తాయ‌నే అంశంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ పొత్తుతో అధిక ప్ర‌యోజనం పొందేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబా నాయుడు మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌వ‌న్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం కాబ‌ట్టి భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు రాకుండా బాబు ప్లాన్ వేసిన‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు క‌నీసం 40 సీట్లు కేటాయించినా.. అందులో అత్య‌ధిక శాతం త‌న నాయ‌కుల‌నే నిల‌బెట్టేలా బాబు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలిసింది.

ఏదో ఒక కార‌ణంతో త‌మ పార్టీ నుంచి నాయ‌కుల‌ను జ‌న‌సేన‌లోకి పంపి.. ఆ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల్లో గెలిపించుకోవాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

బాబు ఇలా చేయాల‌నుకోవ‌డం ఇదేం కొత్త కాదు. 2014లో త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని బీజేపీ త‌ర‌పున గెలిపించుకుని, ఆ త‌ర్వాత మిత్ర‌ప‌క్షం కోటాలో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని ఇప్పుడు విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. అలాగే 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత టీడీపీ నాయ‌కుల‌ను బాబే బీజేపీలోకి పంపించార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.