Begin typing your search above and press return to search.

అంతా చేసి.. ఓట‌మి మాత్రం చ‌న్నీ పై తోసి

By:  Tupaki Desk   |   12 March 2022 6:31 AM GMT
అంతా చేసి.. ఓట‌మి మాత్రం చ‌న్నీ పై తోసి
X
పంజాబ్‌లో అధికారాన్ని చేతుల్లోనుంచి పోగొట్టుకుని ఎన్నిక‌ల్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడింది. ఆప్ దెబ్బ‌కు మూట ముల్లె స‌ర్దుకోవాల్సి వ‌చ్చింది. పంజాబ్‌లో కాంగ్రెస్ ఓట‌మి వెన‌క ఎన్నో కార‌ణాలున్నాయి. కానీ వాటిలో ముఖ్య‌మైంది మాత్రం పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు. దానికి ప్ర‌ధాన కార‌కుడు పీసీసీ అధ్య‌క్షుడు న‌వజ్యోత్ సింగ్ సిద్ధూ అన్న‌ది విశ్లేష‌కుల మాట‌. త‌న మాటే చెల్లాల‌నే ఆధిప‌త్య ధోర‌ణితో ఆయ‌న పార్టీని ముంచార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న చేసిందంతా చేసి.. ఇప్పుడు ఓట‌మి బాధ్య‌త మాత్రం చ‌న్నీపై తోయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా పోటీలో దిగిన చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ, పీసీసీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌ల బరిలో నిలిచిన సిద్ధూ స‌హా ఆ పార్టీ బ‌డా నేత‌లంతా ఓట‌మి పాల‌య్యారు. పార్టీకి కేవ‌లం 18 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఏకంగా 59 స్థానాలు గ‌ల్లంత‌య్యాయి.

కానీ ఈ ఓట‌మి పై మాత్రం సిద్ధూ విచిత్రంగా స్పందించారు. కొత్త వ్య‌వ‌స్థ‌కు నాంది ప‌లికే క్ర‌మంలో ఈ అద్భుత నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌జ‌ల‌ను అభినందిస్తున్న‌ట్లు వ్యాఖ్య‌లు చేశారు. పార్టీని ఓడించి మంచి ప‌నే చేశార‌నే అర్థం వ‌చ్చేలా మాట్లాడారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నార‌ని, వాళ్లు త‌ప్పు చేయ‌ర‌ని ఆయ‌న స్పందించారు.

ఇక పీసీసీ అధ్య‌క్షుడిగా పార్టీ ఓట‌మికి బాధ్య‌త తీసుకునే విష‌యంలో మాత్రం సిద్ధూ వెన‌క్కి త‌గ్గారు. తాను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కానందున పంజాబ్ అంతటా తిరిగి ప్ర‌చారం చేసే అధికారం త‌న‌కు ద‌క్క‌లేద‌ని చెప్పారు. అది చ‌న్నీ బాధ్య‌త అని పేర్కొన్నారు.

చ‌న్నీని రాహుల్ గాంధీ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన‌ప్పుడే ప్ర‌చారం మొత్తం ఆయ‌న బాధ్య‌తే అని తాను చెప్పేశాన‌ని వెల్ల‌డించారు. అయితే చ‌న్నీని ప్ర‌జ‌లు అంగీక‌రించారా? లేదా? అనే విష‌యంపై మాత్రం వ్యాఖ్య‌లు చేయ‌న‌ని త‌ప్పించుకున్నారు.

కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న అమ‌రీంద‌ర్‌తో సిద్ధూ విభేదాలు తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు అమ‌రీంద‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ కు గుడ్‌ బై చెప్పారు. ఆ త‌ర్వాత చ‌న్నీ సీఎం అయినా త‌న‌కు కావాల్సిన కొన్ని విష‌యాల‌పై సిద్ధూ ప‌ట్టుప‌ట్టారు. అందుకు పీసీసీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ అధిష్టానం జోక్యంతో శాంతించారు. ఆ త‌ర్వాత సీఎం అభ్య‌ర్థిగా త‌న‌ను ప్ర‌క‌టిస్తార‌ని సిద్ధూ ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ మ‌రోసారి చ‌న్నీ వైపే అధిష్ఠానం మొగ్గు చూప‌డంతో తీవ్ర నిరాశ‌లో మునిగిపోయిన సిద్ధూ పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌లేద‌ని తెలిసింది.