Begin typing your search above and press return to search.

అదేంటి స్వామీజీ.. గ్యాప్ గురించి అడిగితే అంత ఘాటు రియాక్షన్

By:  Tupaki Desk   |   19 March 2022 8:06 AM GMT
అదేంటి స్వామీజీ.. గ్యాప్ గురించి అడిగితే అంత ఘాటు రియాక్షన్
X
కాలానికి మించింది మరొకటి ఉండదు. ఎందుకంటే దూరమైన వాళ్లను దగ్గరకు చేర్చేది. దగ్గరైనోళ్లను దూరం చేసేది కాలమే. ఎంతటోళ్లు అయినా సరే కాలానికి తలొగ్గాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత సన్నిహితులు.. ఆయన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి దగ్గరుండి చేయించే చినజీయర్ స్వామికి మధ్యనున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంతటి వారైనా సరే.. తన ముందు మోకరిల్లేలా చేసుకునే కేసీఆర్.. తనకు తాను భక్తిభావంతో ప్రణమిల్లే అతి కొద్ది మందిలో చినజీయర్ స్వామి ఒకరు.

స్వాములోరు ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ప్రత్యేకంగా చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి.. అక్కడి నుంచి రివ్యూ చేసి.. ఆయా శాఖల వారికి పనులు పురామాయించిన తీరు చూస్తే.. స్వాములోరి శక్తియుక్తులకు అందరూ ఆసూయ పడే పరిస్థితి. అలాంటి కేసీఆర్ - చిన జీయర్ బంధానికి మరింత బలం చేకూరేలా అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంటారు మైహోం రామేశ్వరరావు.

మొత్తానికి సమతామూర్తి ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదలైన తేడాలు అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. అవి పెద్దవి అయిపోయాయి. చివరకు పూడ్చలేనంత వరకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇలాంటివేళలోనే.. చినజీయర్ స్వామి అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఏదో చానల్ లో మాట్లాడినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజానీకం మనసుల్ని గాయపరిచేలా చేశాయి. తామెంతగానే నమ్మి ఆరాధించే సమ్మక్క.. సారలమ్మల గురించి అంత చులకనగా ఎలా మాట్లాడుతున్నారన్న మండిపాటు అంతకంతకూ ఎక్కువైంది.

రోజులు గడిచే కొద్దీ ఈ వివాదం పెద్దది కావటం.. చినజీయర్ సమాధానం చెప్పక తప్పనిపరిస్థితిని తీసుకొచ్చింది. శంషాబాద్ లోని ముచ్చింతల్ ను వదిలి.. విజయవాడలోని ఆశ్రమంలో ప్రెస్ మీట్ పెట్టారు చినజీయర్. కలిసిరాని కాలంలో ఉన్న స్వాములోరి మాటలు చాలామందికి నప్పలేదు. ఇది సరిపోదన్నట్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పెరిగిన దూరం గురించి అప్రయత్నంగా స్వాములోరి మాటల్లో బయటకు వచ్చేసింది.

మనసులోని ఉన్న ఫస్ట్రేషన్.. కడుపులో దాచుకున్న అసంతృప్తి దావాగ్నిని మాటల రూపంలో బయటపెట్టేశారు చిన జీయర్. తెలంగాణ ప్రభుత్వంతో మీకు గ్యాప్ వచ్చిందా? యాదాద్రికి వెళతారా? అని ప్రశ్నించగా ఆయన స్పందించారు. కాకుంటే.. ఆయన మాటల్లో కోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. శాంతమూర్తిగా.. భావోద్వేగాలకు అతీతంగా స్పందిస్తారన్నట్లుగా ఉండే ఆయన మాటలు.. తాజాగా విన్నప్పుడు మాత్రం చినజీయర్ స్వామి ఇలా మాట్లాడటమా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి.

"ఎవరైనా అడిగితే సలహాలు ఇస్తాను. ఆహ్వానిస్తే వెళతాను. లేకుంటే... చూసి ఆనందిస్తాను. మేము దేని గురించీ పూసుకుని తిరిగేవాళ్లం కాదు. మాకు ఎవరితోనూ గ్యాప్స్‌ ఉండవు. వాళ్లు ఏవైనా పెట్టుకుంటే మేమేమీ చేయలేం. ఎవరైనా సలహా అడిగితే చెప్పడం మా బాధ్యత. ఏదైనా ఈ పని చేసి పెట్టమని అడిగితే చేసి పెట్టడం మా బాధ్యత. బాధ్యత తీసుకున్నపుడు దానికి నూరుశాతం న్యాయం చేస్తాం. వెంటపడి పాకులాడడమనేది మాకు అలవాటు లేదు. వెంటపడి వాళ్ల ప్రేమాభిమానాలను ఎదురుచూసే వ్యక్తులం కాదు. మేము ఎప్పుడూ ఓ మంచి లక్ష్యంతో, మంచి కార్యక్రమాలు చేయాలి... ఎవరినీ మోసం చేయకూడదు అనే మార్గంలోనే ఉంటాం. అందుకే ధైర్యంగా ఇలాంటి విషయాలను మాట్లాడగలుగుతాం" అని వ్యాఖ్యానించారు.

ఇంతా బాగానే ఉంది కదా అనుకోవచ్చు. మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో అక్కడ దెబ్బ పడే మాటలు నోటి నుంచి వచ్చేస్తుంటాయి. సామాన్యులకే కాదు చినజీయర్ లాంటి స్వాములోరు సైతం మినహాయింపు కాదన్న విషయం ఆయన మాటల్ని వింటే అర్థమవుతుంది. ఎలాంటి మాటలైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సలు నచ్చవో.. అలాంటి మాటలే చినజీయర్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఆ మాటలేమిటన్నది చూస్తే.. "వాడికి వీడికి దడుస్తూ ఎక్కడో అక్కడ ఏ మూలకోనక్కి మాట్లాడటం మా చరిత్రలో లేదు. నువ్వు నడుస్తున్నపుడు కాలులో ఏమి దిగుతుందో చెప్పడం నా బాధ్యత. దాన్ని గుర్తించకుండా దానిని తొక్కుకుంటూ వెడతాను అంటే రక్తం కారేది నీకే. నీరు కార్చేది నీ కళ్లే. కాబట్టి కళ్లు ముందుగా హెచ్చరిస్తాయి. రాజకీయాలతో మాకు సంబంధం లేదు" అని స్పష్టం చేశారు. ఈ మాటలకు కేసీఆర్ స్పందన ఏమిటన్నది కాలమే చెబుతుందన్న మాట వినిపిస్తోంది.