Begin typing your search above and press return to search.

మోడీ పైకి షాట్ గన్ ను ప్రయోగించిన దీదీ

By:  Tupaki Desk   |   15 March 2022 5:30 AM GMT
మోడీ పైకి షాట్ గన్ ను ప్రయోగించిన దీదీ
X
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్లో ఖాళీ అయిన ఒక లోక్ సభ మరో అసెంబ్లీ స్ధానానికి ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అసన్ సోల్ లోక్ సభ స్ధానానికి సినీ ప్రముఖుడు, షాట్ గన్ గా పాపులరైన శతృఘ్నసిన్హా, బాలేగంజ్ అసెంబ్లీ స్ధానానికి కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియోను దీదీ ఎంపికచేశారు. వీరిద్దరిని మమత ఎంపిక చేయటంలో కామన్ పాయింట్ ఏమిటంటే ముగ్గురు నరేంద్ర మోడీకి వ్యతిరేకం అవ్వటమే.

2009, 14లో బీహార్లోని పాట్నాలో సిన్హా రెండుసార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకసారి వాజ్ పేయి మంత్రివర్గంలో కూడా పనిచేశారు. తర్వాత నరేంద్ర మోడితో పడని కారణంగా కేంద్ర ప్రభుత్వంలోని తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే పార్టీ ముఖ్యనేతల సమావేశాల్లో కూడా మోడీని నిలదీశారు. దాంతో 2019 ఎన్నికల్లో షాట్ గన్ కు మోడీ టికెట్ ఇవ్వలేదు. పైగా తర్వాత జరిగిన పరిణామాల్లో సిన్హాపై సస్పెన్షన్ వేటు కూడా పడింది.

బీజేపీలో ఉండలేక పోవటంతో సిన్హా పార్టీ నుంచి వచ్చేశారు. తర్వాత జరిగిన బెంగాల్ ఎన్నికల్లో సిన్హా తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. ఈ కారణంగానే సిన్హాకు దీదీ ఇపుడు లోక్ సభ టికెట్ కేటాయించారట.

అంటే రేపు ఎన్నికల్లో గెలిస్తే సిన్హా పార్లమెంటులో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఖాయం. అలాగే కేంద్రమంత్రిగా పనిచేసిన సుప్రియోను అసెంబ్లీకి పోటీచేయిస్తున్నారు. అసన్ సోల్ నుండి సుప్రియో రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2019లో గెలిచి మోడీ మంత్రివర్గంలో పనిచేశారు.

ఈమధ్యే జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. దాంతో మంత్రిపదవి కోల్పోవటంతో సుప్రియో ఎంపీగా కూడా రాజీనామా చేసేశారు. తర్వాత బీజేపీలో ఉండలేక తృణమూల్లో చేరారు. ఇపుడు దీదీ ఈయనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది.

గెలిస్తే బహుశా మంత్రివర్గంలోకి వెళతారేమో. ఇద్దరిలోను కొన్ని సారూప్యతలున్నాయి. అవేమిటంటే ఇద్దరు సినిమారంగం నుండి వచ్చిన వారే. ఇద్దరు బీజేపీ ప్రరభుత్వంలో కేంద్రమంత్రులుగా పనిచేసినవారే. ఇపుడిద్దరు తృణమూల్ తరపున పోటీచేస్తున్నారు.