Begin typing your search above and press return to search.

ఓట్లు 0.43 శాతం.. సీట్లు సున్నా.. మ‌జ్లిస్‌కు దెబ్బ‌

By:  Tupaki Desk   |   11 March 2022 8:30 AM GMT
ఓట్లు 0.43 శాతం.. సీట్లు సున్నా.. మ‌జ్లిస్‌కు దెబ్బ‌
X
బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల జోరుతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ స‌త్తాచాటాల‌ని భావించిన ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ ఆట‌లు సాగ‌లేదు. యూపీ ఎన్నిక‌ల్లో ఆల్ ఇండియా మ‌జ్లిస్ ఎ ఇత్త‌హాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీకి ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా రాలేదు.

దీంతో మ‌తం పేరుతో ప్ర‌లోభ పెట్టి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని చూసిన అస‌దుద్దీన్‌కు మైనార్టీ ఓట‌ర్లు దిమ్మ‌తిరిగే షాకిచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ముస్లిం ప్ర‌జ‌ల‌ను సంఘ‌టితం చేసి యూపీ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపాల‌నుకున్న అస‌దుద్దీన్ ఓవైసీని నిరాశే ఎదురైంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 403 స్థానాల‌కు గాను 100 సీట్ల‌లో ఎంఐఎం పోటీ చేసింది. అది కూడా మెనార్టీ ఓట‌ర్లు బ‌లంగా ఉన్న ప్రాంతాల్లోనే కావ‌డం విశేషం.

కానీ ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. మ‌జ్లిస్‌కు కేవ‌లం 0.43 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీకి బీ టీమ్‌గా మ‌జ్లిస్ ప‌ని చేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మైనార్టీల ఓట్ల‌ను చీల్చి బీజేపీకి ల‌బ్ధి చేకూర్చ‌డం కోస‌మే అస‌దుద్దీన్ త‌న పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఎన్నిక‌లో ప్ర‌చారం సంద‌ర్భంలో అస‌దుద్దీన్ ప్ర‌యాణిస్తున్న కారుపై కాల్పులు జ‌ర‌గ‌డం కూడా రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మేన‌న్న ఆరోప‌ణ‌లు వినిపించాయి. సానుభూతి పేరుతో ముస్లిం మెనార్టీ ఓట‌ర్లను ప్ర‌స‌న్నం చేసుకునేందుకే కుట్ర‌లో భాగంగా కాల్పుల నాట‌కాన్ని ర‌క్తి కట్టించార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కానీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం అస‌దుద్దీన్ అంచ‌నాల‌కు పూర్తి విరుద్ధంగా వ‌చ్చాయి. మ‌జ్లిస్ వైపు ముస్లిం ప్ర‌జ‌లు మొగ్గుచూప‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది. అందుకే 100 సీట్ల‌లో పోటీచేసినా ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా ఆ పార్టీ ద‌క్కించుకోలేక‌పోయింది. యూపీ ఫ‌లితాల దెబ్బ‌కు ఇత‌ర రాష్ట్రాల్లో పోటీ చేసే విష‌యంపై అస‌దుద్దీన్ మ‌రోసారి ఆలోచించుకుంటార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.